Ibomma Ravi Case Latest News | హైదరాబాద్: ప్రముఖ పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ (iBomma) నిర్వాహకుడు ఇమంది రవి కేసు దర్యాప్తులో పోలీసులు కీలక విషయాలను వెలికితీశారు. విచారణలో భాగంగా రవి తన గుర్తింపును దాచిపెట్టేందుకు ప్రహ్లాద్ వెల్లేల అనే వ్యక్తి పేరుతో పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ పొందినట్లు గుర్తించారు. గతంలో పోలీసుల ప్రశ్నకు సమాధానంగా ప్రహ్లాద్ తన రూమ్‌మేట్ అని రవి చెప్పాడు. అయితే ఈ వ్యవహారంపై స్పష్టత కోసం బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న అసలైన ప్రహ్లాద్‌ను పోలీసులు పిలిపించి, రవి సమక్షంలోనే ముఖాముఖి విచారణ జరిపారు.
ఈ విచారణలో ప్రహ్లాద్ పోలీసులకు వాంగ్మూలం ఇస్తూ, తనకు ఇమంది రవి ఎవరో తెలియదని, తన పేరు మీద అతను నకిలీ పత్రాలు సృష్టించాడని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపినట్లు సమాచారం. ప్రహ్లాద్‌కు తెలియకుండానే అతని వ్యక్తిగత పత్రాలను ఇమంది రవి దొంగిలించి, వాటిని తన నేరపూరిత కార్యకలాపాలకు వినియోగించుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
గుర్తింపు చోరీ కేసులు సైతం..కేవలం పైరసీకి సంబంధించిన నేరాలే కాకుండా, ఫోర్జరీ, గుర్తింపు దొంగతనానికి (Identity Theft) పాల్పడినట్లు రవిపై మరిన్ని సెక్షన్ల కింద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్న రవి విచారణ ముగింపు దశకు చేరుకుంది. సోమవారంతో అతని కస్టడీ గడువు ముగియనున్న క్రమంలో పోలీసులు సేకరించిన మరిన్ని సాక్ష్యాలను కోర్టుకు సమర్పించనున్నారు.
గుర్తింపు దొంగతనం.. జాగ్రత్తలుడిజిటల్ యుగంలో ఇమంది రవి వంటి వ్యక్తులు ఇతరుల పత్రాలను దొంగిలించి నేరాలకు పాల్పడటం తీవ్రమైన సమస్యగా మారింది. దీనిని 'ఐడెంటిటీ థెఫ్ట్' అని పిలుస్తారు. ఒక వ్యక్తికి తెలియకుండా వారి పేరు, పాన్ కార్డు, ఆధార్ కార్డు లేదా బ్యాంకు వివరాలను ఉపయోగించి ఆర్థిక లాభం పొందడం లేదా నేరాలు చేయడాన్ని ఐడెంటిటీ థెఫ్ట్ అంటారు. ఐటీ చట్టంతో పాటు భారత శిక్షాస్మృతి (BNS) ప్రకారం ఇది కఠినమైన శిక్షలు పడే నేరం కిందకువస్తుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలుమీ ఆధార్, పాన్ కార్డు ఫోటో కాపీలను ఎక్కడైనా ఇచ్చేటప్పుడు, వాటిపై ఏ కారణం కోసం ఇస్తున్నారో స్పష్టంగా రాసి (For KYC purpose only) సంతకం చేయాలి. వ్యక్తిగత పత్రాలను భౌతికంగా వెంట తీసుకెళ్లకుండా ప్రభుత్వం అందించే 'డిజిలాకర్' (DigiLocker) వంటి యాప్‌లను ఉపయోగించాలి.
మీ పేరు మీద మీకు తెలియకుండా ఎవరైనా లోన్లు లేదా సిమ్ కార్డులు తీసుకున్నారా అని తెలుసుకోవడానికి అప్పుడప్పుడు సిబిల్ (CIBIL) రిపోర్ట్ లేదా 'సంచార్ సాథీ' పోర్టల్‌ను తనిఖీ చేయాలి.
సోషల్ మీడియాలో వచ్చే అనుమానాస్పద లింకులను క్లిక్ చేయడం ద్వారా మీ డేటా హ్యాకర్ల చేతికి చిక్కే ప్రమాదం ఉంది. కనుక అపరిచిత వ్యక్తులు పంపిన లింకులను గుడ్డిగా నమ్మ క్లిక్ చేయకపోవడమే మంచిది. అధికారిక వెబ్‌సైట్ లలో సమాచారం క్రాస్ చెక్ చేసుకోవాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.