Mysore Bonda Recipe : సౌత్ ఇండియన్ బ్రేక్‌ఫాస్ట్‌లలో మైసూర్ బొండాలు కచ్చితంగా ఉంటాయి. వీటిని చాలామంది ఇష్టంగా తింటారు. కానీ ఇంట్లో చేసుకోవాలంటే అమ్మో అవి ఎలా వస్తాయో అని భయపడతారు. ముఖ్యంగా బొండాలు నూనెను ఎక్కువ పీల్చేస్తాయి అనుకుంటారు. కానీ నూనె ఎక్కువ పీల్చుకోకుండా.. గుల్లగా, క్రిస్పీగా ఉండే మైసూరు బొండాలు తినాలని ఉందా? అయితే ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ రెసిపీని ఫాలో అయిపోండి. ఈ బొండాలను ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
మినపప్పు - అరకప్పు
బియ్యం పిండి - 2 టేబుల్ స్పూన్స్
పెప్పర్ పౌడర్ - అర టీస్పూన్
జీలకర్ర - అర టీస్పూన్
అల్లం - అర అంగుళం
పచ్చిమిర్చి - 2
కొబ్బరి - 3 టేబుల్ స్పూన్లు (తాజాగా ఉండాలి)
కరివేపాకు - 1 రెబ్బ
ఇంగువ - చిటికెడు
ఉప్పు - రుచికి తగినంత
నూనె - డీప్ ఫ్రైకి సరిపడనంత
తయారీ విధానం
ముందుగా మినపప్పును బాగా కడిగి ఓ 4 గంటల ముందు లేదంటే రాత్రి నానబెట్టుకోవాలి. ఉదయాన్నే మినపప్పును కడిగి.. నీటిని వేరు చేసి.. మిక్సర్‌లో వేసి గ్రైండ్ చేయాలి. మెత్తగా గ్రైండ్ చేయాలి. దీనికోసం మీరు కొంచెం నీటిని ఉపయోగించుకోవచ్చు. కానీ ఎక్కువ లేకుండా జాగ్రత్త తీసుకోవాలి. నీరు ఎక్కువ ఉంటే నూనె ఎక్కువ పీల్చుకోకుండా బొండాలు క్రిస్పీగా వస్తాయి. మినపప్పును బాగా రుబ్బిన తర్వాత ఓ గిన్నెలోకి తీసుకోవాలి. అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, కొబ్బరిని సన్నగా తురిమి పక్కన పెట్టుకోవాలి.
మినప పిండిలోకి బియ్యం పిండి వేసి కలపండి. మీరు బియ్యం పిండి లేకపోతే.. రవ్వను కూడా ఉపయోగించవచ్చు. ఒకవేళ పిండిలో నీరు ఎక్కువైంది అనిపిస్తే మీరు రవ్వను కూడా కలిపి తీసుకోవచ్చు. లేదంటే బియ్యం పిండిని కాస్త ఎక్కువ వేసి కలపవచ్చు. అంతేకానీ పిండిలో నీరు ఉంచి బొండాలు వేస్తే నూనె చాలా ఎక్కువ పీల్చుకుంటుంది. దానిలో పెప్పర్, అల్లం తురుము, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, ఉప్పు, ఇంగువ, కొబ్బరి వేసి బాగా కలపండి. దీనిలో మీరు కావాలనుకుంటే ఓ ఉల్లిపాయ సన్నగా తరిగి కూడా వేసుకోవచ్చు. అన్ని పదార్థాలు కలిసేలా పిండిని కలపడం చాలా ముఖ్యం. పిండి ఎంత బాగా కలిస్తే బొండాలు అంత టేస్టీగా వస్తాయి. పిండిని బాగా కలిపితే బొండాలు మృదువుగా మెత్తటి ఆకృతిలో వస్తాయి.
ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై కడాయి ఉంచండి. దానిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి.. వేడి చేయండి. నూనె వేడి అయిందని గుర్తించాకే బొండాలు వేయండి. నూనె బాగా వేగితే బొండాలు ఈజీగా పైకి వస్తాయి. లేదంటే పాత్రకు అంటుకుపోతాయి. కాబట్టి నూనె వేగిన తర్వాత.. పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని నూనెలో వేయాలి. అవి పైకి రాగానే గరిటతో మరోవైపు తిప్పాలి. ఇలా బొండాలు మొత్తం గోధుమరంగులోకి వచ్చేవరకు డీప్‌ఫ్రై చేసుకోవాలి. అవి వేగిన తర్వాత వాటిని నూనె నుంచి తీసివేసి.. టిష్యూలపై వేయాలి. బొండాలలోని నూనెను అవి పీల్చుకుంటాయి. అంతే వేడి వేడి మైసూర్ బొండాలు రెడీ. వీటిని మీరు కొబ్బరి చట్నీ లేదా సాంబార్‌తో హాయిగా లాగించేయవచ్చు.
Also Read : చికెన్‌తో నిల్వ పచ్చడిని ఇలా సింపుల్‌గా పట్టేయండి.. రెసిపీ చాలా ఈజీ