Chicken Pickle Recipe : నిల్వ పచ్చళ్లు అంటే ఎవరికీ ఇష్టముండదు చెప్పండి. అందున చికెన్​ పచ్చడి అంటే నాన్​వెజ్​ ప్రియులు మరింత ఇష్టంగా లాగించేస్తారు. బ్యాచిలర్స్​ అయితే దీనిని లొట్టలేసుకుంటూ తింటారు. అలాంటి ఈ నిల్వ పచ్చడి చేయడం కష్టం అనుకుంటారు కానీ.. దీనిని తయారు చేయడానికి కర్రీ చేసుకున్నంత సమయం కూడా పట్టదు. గంటలోపే ఈ టేస్టీ పచ్చడిని మీరు తయారు చేసుకోవచ్చు. బ్యాచిలర్స్​ కూడా ఈ రెసిపీని చాలా సింపుల్​గా తయారు చేసుకోవచ్చు. దీనిని చేయడం కోసం ఎక్కువ పదార్థాలు కూడా అవసరం లేదు. ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతో దీనిని తయారు చేసుకోవచ్చు. మరి ఈ నిల్వ చికెన్ పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలి? కావాల్సి పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.


కావాల్సిన పదార్థాలు 


చికెన్ - 1 కేజి (బోన్​లెస్)


కారం - 3 టేబుల్ స్పూన్లు


నూనె - 500 మి.లీ


ఉప్పు - తగినంత 


పసుపు - టీస్పూన్


కరివేపాకు - 2 రెబ్బలు


గరం మసాలా - 2 టీస్పూన్లు


ధనియాల పొడి - 2 టీస్పూన్లు


లవంగాలు - 2


యాలకులు - 2


దాల్చిన చెక్క - 1 అంగుళం


స్టార్ పువ్వు - 1


జీలకర్ర - 1 టీస్పూన్ 


అల్లం - 100 గ్రాములు


వెల్లుల్లిపాయలు - 2


నిమ్మకాయ - 1


తయారీ విధానం


ముందుగా చికెన్​ను మీకు నచ్చిన సైజ్​లో కట్ చేసుకోవాలి. దానిని బాగా కడిగి నీరు లేకుండా వడబోయండి. ఇప్పుడు చికెన్​ను ఓ గిన్నెలోకి తీసుకుని దానిలో పసుపు, ఉప్పు వేసి బాగా కలిపి పెట్టండి. దానిని మూత వేసి ఓ గంట మ్యారినేట్ చేయండి. అల్లం, వెల్లుల్లిని శుభ్రం చేసి.. ముక్కలుగా కోసి మిక్సీలో వేయండి. దానిని మెత్తని పేస్ట్​గా చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి పాన్ పెట్టండి. దానిలో మసాలా దినుసులు అన్నింటిని వేసి డ్రై రోస్ట్ చేయండి. వీటిని మిక్సీలో వేసి మెత్తని పొడిగా చేసుకోండి. నిమ్మకాయ గింజలు లేకుండా రసం పిండి పక్కన పెట్టుకోండి.


స్టౌవ్ వెలిగించి దానిపై కడాయి పెట్టండి. దానిలో చికెన్ వేసి.. వాటిలోని నీరు పోయే వరకు ఉడికించండి. ఇలా చేయడం వల్ల సగం చికెన్ ఉడికిపోతుంది. ఇప్పుడు దానిలో డీప్​ఫ్రైకి సరిపడా నూనె వేయండి. చికెన్ ముక్కలు వేసి బాగా ఫ్రై చేయండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు చికెన్ ఫ్రై చేయాలి. అనంతరం వాటిని నూనె నుంచి తీసివేసి.. అదే నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. దానిని పచ్చివాసన పోయేవరకు వేయించి.. ముందుగా వేయించుకున్న చికెన్ ముక్కలు వేసి బాగా కలపండి. ఈ రెండూ బాగా ఉడికిన తర్వాత దానిలో కారం, ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసి బాగా కలపాలి. చివర్లో కరివేపాకు వేసి మరోసారి మిక్స్ చేయండి. ఇప్పుడు స్టౌవ్ ఆపేయండి. మిశ్రమం కాస్త చల్లారిన తర్వాత నిమ్మరసం వేసి బాగా కలపండి. అంతే నిల్వ ఉండే చికెన్ పచ్చడి రెడీ. దానిని మీరు వేడి వేడి అన్నంలో హాయిగా వేసుకుని కమ్మగా లాగించేయవచ్చు. 


Also Read : కొలెస్ట్రాల్​, షుగర్​ను కంట్రోల్​ చేసే గ్లూటెన్ ఫ్రీ బ్రేక్​ఫాస్ట్.. రెసిపీ ఇదే