పుల్లపుల్లగా ఉండే చింతపండుని ఒక పుల్లకి తగిలించుకుని దానికి కాసింత ఉప్పు, కారం పట్టించి తింటే భలే ఉంటుంది కదా. చిన్నతనంలో ఈ  పని చేసిన వాళ్ళలో మీరు కూడా ఉండే ఉంటారు. అయితే ఈ చిన్నతనంలో ఉన్న ఆ అలవాటే ఇప్పుడు మీ పళ్ళు పుచ్చిపోవడానికి కారణం అంటే మీరు నమ్ముతారా? అసలు నమ్మరు కదా కానీ ఇది నిజమండి. పుల్లని చింతపండు తినడం వల్ల దంతాల ఆరోగ్యం చెడిపోతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 


చట్నీ, కూరలు ఇలా ప్రతి వంటకానికి చింతపండు జోడించనిదే రుచే రాదు. ప్రతి భారతీయ గృహిణి వంటల్లో దీన్ని తప్పకుండా ఉపయోగిస్తుంది. ఇందులో ఉండే గుణాలు శరీరానికి అవసరమైన పోషకాలను అందించడమే కాదు బరువుని నియంత్రించడంలోనూ కీలకంగా వ్యవరిస్తుంది. ప్రోటీన్స్, అధిక మొత్తంలో కార్బో హైడ్రేట్స్, ఫైబర్, షుగర్, విటమిన్ బి1, బి 2, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్ మెండుగా ఉంటాయి. ఇందులో చక్కెర శాతం ఎక్కువగా ఉండటం వల్ల మధుమేహ రోగులు తక్కువ పరిమాణంలో తీసుకోవడం మంచిది.


చింతపండు గుండెను సంరక్షిస్తుంది. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీని వల్ల ధమనుల్లో కొవ్వు పేరుకుపోయే ప్రమాదాన్ని నివారిస్తుంది. ఇది కాలేయాన్ని రక్షిస్తుంది. దీన్ని రోజువారీ డైట్ లో భాగంగా తీసుకుంటే కాలేయం చుట్టూ ఏర్పడే కొవ్వుని నియంత్రిస్తుంది. ఫ్యాటీ లివర్ బారిన పడకుండా ఇది మనకు రక్షణగా నిలిస్తుంది. 


చింతపండులోని యాంటీఆక్సిడెంట్లు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ సహకరిస్తుంది. అలాగే ఫ్రీ రాడికల్స్ వల్ల వచ్చే నష్టాన్ని తగ్గిస్తుంది. అయితే రుచికరంగా ఉండే చింతపండుని అధిక మోతాదులో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని చేస్తుంది. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల అందులోని ఆమ్లాలు జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. అంతే కాదు మోతాదుకు మించి తినడం వల్ల అలర్జీలు వచ్చే అవకాశం కూడా ఉంది. రక్త ప్రసరణ నెమ్మదించేలా చేస్తుంది. ఒక్కోసారి రక్త నాళాలు దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది.


దంతాలపై ఏ విధమైన ప్రభావం చూపుతుంది?


చింతపండు అధిక మోతాదులో తీసుకోవడం వల్ల దానిలో ఉండే ఆమ్ల స్వభావం కారణంగా దంతాల మీద ఉండే ఎనామిల్ క్షీణిస్తుంది. పళ్ళు పుచ్చిపోయే అవకాశం కూడా ఉందని దంత వైద్య నిపుణులు చెబుతున్నారు. దంతాలని రక్షించేందుకు అడ్డుగోడగా ఉంటుంది ఎనామిల్. అది పోవడం వల్ల పళ్ళు రంగు మారడం జరుగుతుంది. దాని వల్ల మీరు నవ్వినప్పుడు చూసేందుకు అందంగా కూడా కనిపించరు. ఇదే కాదు దీన్ని ఎక్కువగా తినడం వల్ల దురద, తల తిరగడం, శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలు కూడా కనిపిస్తాయి.  


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 


Also Read: నెయ్యి నుంచి వెన్న కావాలా? అయితే ఇలా చేస్తే సరి


Also Read: 'విటమిన్- డి' సప్లిమెంట్స్ కరోనాని నిజంగానే అడ్డుకుంటాయా? క్లినికల్ ట్రయల్స్ ఏం చెప్తున్నాయ్