వంటలకి రుచిని ఇవ్వడంలో ఉప్పుది ప్రత్యేకమయిన పాత్ర. ఉప్పు లేకపోతే ఎంత చేసిన ఆ వంటకానికి రుచి రాదు. ఉప్పు రుచికే కాదండోయ్ మీ బరువుని తగ్గించేందుకు కూడా ఉపయోగపడుతుంది. శరీరంలోని అధిక కొవ్వుని తగ్గించుకునేందుకు డైట్ ఫాలో అవుతుంటారు. వ్యాయామం చేయడానికి ముందు చాలా మంది రిచ్ ప్రోటీన్స్ ఉండే అరటిపండు, నట్స్ తో పాటు వివిధ రకాల పదార్థాలు తీసుకుంటారు. అయితే వ్యాయమానికి ముందు ఉప్పు తీసుకుంటే కూడా బరువు తగ్గేందుకు సహాయపడుతుందనే విషయం మీకు తెలుసా? మీరు విన్నది నిజమేనండి జిమ్ లేదా రన్నింగ్ కి వెళ్ళే ముందు ఓ చిటికెడు ఉప్పు తీసుకుంటే చాలా మంచిదని ప్రముఖ పోషకాహార నిపుణురాలు నిధి నిగమ్ చెప్పుకొచ్చారు. చిటికెడు ఉప్పు నోట్లో వేసుకోవడం వల్ల అలసట రాకుండా శరీరానికి శక్తిని ఇస్తుంది. 


హైడ్రేషన్ ను తగ్గిస్తుంది: ఉప్పు కలిపిన నీటిని తీసుకోవడం వల్ల మీరు వ్యాయామం చేసేటప్పుడు మీ శరీరం డీహైడ్రేట్ కాకుండా చూస్తుంది. 


హార్ట్ బీట్ తగ్గిస్తుంది: శరీరంలో రక్త ప్రసరణను మెరుగ్గా చేస్తుంది. కఠినమైన వ్యాయామం చేసే సమయంలో మన హృదయ స్పందన ఎక్కువగా ఉంటుంది. గుండె వేగంగా కొట్టుకోవడం వల్ల త్వరగా అలసటకు గురైన ఫీలింగ్ వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే ఈ సాల్ట్ వాటర్ బాగా పని చేస్తాయి. 


కండరాల తిమ్మిరిని నివారిస్తుంది: వ్యాయామం చేసిన తర్వాత వచ్చే తిమ్మిర్లను నివారిస్తుంది. మెరుగైన రక్త ప్రసరణ జరిగేలా చేస్తుంది. వర్కవుట్స్ చేసిన తర్వాత వచ్చే కండరాల తిమ్మిర్లు, కీళ్ల నొప్పులను రాకుండా చేస్తుంది. 


ఎనర్జీ ఇస్తుంది: వర్కవుట్స్ చేసే సమయంలో మన శరీరానికి అవసరమైన ఎనర్జీని వచ్చేలాగా చేస్తుంది. శరీరం కోల్పోయే ఎలక్ట్రోలైట్‌లను ఇది భర్తీను చేస్తుంది.


శరీర ఉష్ణోగ్రత సక్రమంగా ఉంచుతుంది: వ్యాయామం చెయ్యడం వల్ల చెమట రూపంలో నీరంతా బయటకి వెళ్ళిపోతుంది. ఆ సమయంలో మన శరీర ఉష్ణోగ్రతను బ్యాలెన్స్ చేయడంలో సహాయపడుతుంది. వర్కవుట్స్ చేసేప్పుడు శరీరానికి కావాల్సిన శక్తిని ఉప్పు ఇస్తుంది.  


ఉప్పు తగిన మోతాదులో తీసుకుంటేనే మంచిది. అతిగా తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలకి ఇది దారి తీస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం అధిక సోడియం వల్ల అధిక రక్తపోటు వస్తుంది. గుండె జబ్బులు, స్ట్రోక్ వంటివి వచ్చే అవకాశం ఉంది. రోజుకు అయిదు గ్రాముల కన్నా తక్కువ ఉప్పు తినాలని, ఇలా తినడం వల్ల గుండె సంబంధ వ్యాధులు, స్ట్రోక్, కరోనరీ హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదాలు తగ్గుతాయని గ్లోబల్ హెల్త్ ఏజెన్సీ సూచిస్తోంది. 


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు


Also Read: ఉప్పును ఆహారంపై చల్లుకుని తినేవారికి ఇదే హెచ్చరిక, అది ముందస్తు మరణానికి కారణం కావచ్చు