మీకో స్వీట్ వార్నింగ్.. ఈ వార్తను భోజనానికి ముందు, లేదా భోజనం తర్వాత అస్సలు చదవొద్దు. ఎందుకంటే.. ఇది చదివిన తర్వాత కడుపులో తిప్పడం లేదా వికారంతో వాంతు వచ్చేలా ఉండవచ్చు. అది మీరు తిన్నా, తినబోయే ఆహారం వల్ల కాదు.. మీరు చదవబోయే ఈ అరుదైన వంటకం వల్ల. ఇంత బిల్డప్ ఇస్తున్నారు.. ఏమిటీ ఆ వంటకం అనుకుంటున్నారా? దాని పేరు టైటిల్‌లో చదివే ఉంటారు... ‘గాడ్జిల్లా రామెన్’. 


అంటే, ఆ ప్లేటులో ఉన్నది గాడ్జిల్లా పాదమా అని ఆశ్చర్యపోతున్నారా? అస్సలు కాదు. ఎందుకంటే గాడ్జిల్లాలు ఎప్పుడో అంతమైపోయాయి. ఒక వేళ దాని కాలును వండుకుని తినాలన్నా.. ఈ ప్లేట్లు, స్టవ్‌లు సరిపోవు. అందుకే, అందుబాటులో ఉన్న మొసలి కాళ్లను నరికేసి.. ఇలాంటి వంటకాలు చేస్తున్నారు. క్యాచ్చీగా ఉంటుందని.. ఆ వంటకానికి ముద్దుగా ‘గాడ్జిల్లా రామెన్’ అని పేరు పెట్టారు. ఇప్పుడిప్పుడే ఇంటర్నెట్ ద్వారా ఫేమస్ అవుతున్న ఈ వంటకాన్ని తైవాన్‌లో తయారు చేస్తున్నారు. 


యునిలిన్ కౌంటీలోని డౌలీయు సిటీలో గల ఓ రెస్టారెంట్‌లో మాత్రమే ఈ ‘గాడ్జిల్లా రామెన్’ తయారు చేస్తారట. అది కూడా స్పెషల్‌గా ఆర్డర్ చేసుకోవాలట. ఈ వంటకాన్ని మొసలి మాంసంతో తయారు చేస్తారు. అయితే, తైవాన్‌లో చాలామంది మొసలి మాంసాన్ని తింటారు. ఎందుకంటే.. అక్కడ మేకలు, కొళ్ల తరహాలోనే మొసళ్లను కూడా చెరువుల్లో పెంచుతారు. లెదర్ వస్తువుల తయారీ కోసం వాటిని తరలిస్తుంటారు. చర్మాన్ని తొలగించిన తర్వాత.. వాటి మాంసాన్ని రెస్టారెంట్లకు తరలిస్తారు. అయితే, ఈ రెస్టారెంట్లో మాత్రం అలా కాదు. ఫ్రెష్‌గా మొసలిని చంపి.. దాని ముందు కాళ్లతో మాత్రమే ఈ వంటకాన్ని చేస్తారు. దాన్ని బాగా మసాలాలు వేసిన నీటిలో ఉడికిస్తారు. దాని పై చర్మం కూడా తొలగించరు. కాలును కాలులాగే వడ్డించేస్తారు. అందుకే, మొసలి కాలుతో ఉన్న ఆ వంటకం ఫొటో ఇప్పుడు అంత వైరల్ అవుతోంది. అంతేకాదు, ఆ మొసలి కాలు వంటకం.. అదేనండి ‘గాడ్జిలా రామెన్’ను ఓ యువతి లొట్టలేసుకుంటూ మరీ తింటున్న వీడియో కూడా బాగా వైరల్‌గా చక్కర్లు కొడుతోంది.


రుచి ఎలా ఉంటుంది?



ఆ వీడియోలో ఆమె దాని రుచి ఎలా ఉందో కూడా చెప్పింది. నూనెలో వేయించిన మొసలి కాలును తింటుంటే పంది మాంసాన్ని తింటున్నట్లే ఉందట. ఇక ఉడకబెట్టిన కాలు టేస్ట్ చికెన్‌లా ఉందట. రెస్టారెంట్ ఓనర్ చెప్పిన వివరాల ప్రకారం.. ఇందులో వేసిన సూప్‌ను 40 రకాల సుగంధ ద్రవ్యాలతో తయారు చేశారట. ‘గాడ్జిల్లా రామెన్’లో మొసలి మాంసంతోపాటు ఇతర జంతువుల మాంసం, గుడ్లు కూడా ఉంటాయని చెప్పాడు. అయితే, ధీని ధర ఎంత అనేది తెలియరాలేదు. మీకు కూడా ఈ స్పెషల్ డిష్‌ను టేస్ట్ చేయాలని ఉంటే.. తైవాన్ వెళ్లినప్పుడు తప్పకుండా ట్రై చేయండి.



Also Read: ఈ లీన్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ తిన్నారంటే కొవ్వు ఇట్టే కరిగిపోతుంది - ఈ రోజే ట్రై చేయండి


Join Us on Telegram: https://t.me/abpdesamofficial