వేసవికాలం దగ్గర పడిదంటే దాహం పెరిగిపోతుంది. అందరూ కొబ్బరి నీళ్ళు, పండ్ల రసాలు తాగడానికే మక్కువ చూపిస్తారు. కానీ ఒక గ్లాసు చల్లని చెరుకు రసం తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఎండలో బాగా తిరిగి వచ్చాక ఒక గ్లాసు చల్లని చెరుకు రసం తాగి చూడండి, నిమిషాల్లో శరీరం తేరుకుంటుంది. డిహైడ్రేషన్ బారిన పడకుండా తట్టుకునే శక్తి దానికి వస్తుంది. చెరుకు రసంలో ఫైబర్, ప్రోటీన్, విటమిన్ బి6, విటమిన్ సి తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే చెరుకు రసాన్ని పవర్ హౌస్ అని చెప్పుకోవచ్చు. మన శరీరం కోల్పోయిన చక్కెరను తిరిగి అందించడం ద్వారా డిహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది ఈ జ్యూస్. అంతే కాదు చెరుకు రసం తాగడం వల్ల మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన చెరుకు రసం కాలేయాన్ని పలు రకాల ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుంది. బిల్‌రూబిన్ స్థాయిలను అదుపులో ఉంచి కాలేయానికి రక్షణ కల్పిస్తుంది. అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవడానికి అవసరమైన ప్రోటీన్లను, పోషకాలను ఇది భర్తీ చేస్తుంది. ఎండలో బాగా తిరిగాక వడదెబ్బ కొడితే జ్వరం రావడం సహజం. ఆ జ్వరంతో పోరాడే శక్తిని చెరుకు రసం ఇస్తుంది. కాబట్టి వారానికి రెండు మూడు సార్లు అయినా చెరుకు రసాన్ని తాగడం అలవాటు చేసుకోండి.
1. చెరుకు రసం తాగాక మూత్ర విసర్జన ఎక్కువసార్లు అవుతుంది. ఆ మూత్ర విసర్జన ద్వారా శరీరంలోని టాక్సిన్లు, ఇన్ఫెక్షన్లకు కారణమైన వైరస్‌లు బయటికి పోతాయి. అంతేకాదు చెరుకు రసం తాగడం వల్ల యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కూడా తగ్గుతుంది.
2. చెరుకు రసం తాగడం వల్ల జీర్ణవ్యవస్థ చక్కగా పనిచేస్తుంది. పొట్ట ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. మలబద్ధకం సమస్యకు చికిత్స చేస్తుంది.
3. జ్వరం వచ్చినప్పుడు వచ్చే ఇతర సమస్యల నుంచి చెరుకు రసం కాపాడుతుంది. పిల్లల్లో జ్వరం వచ్చినప్పుడు మూర్ఛ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఆ సమయంలో చెరుకు రసం తాగితే మూర్చ రాకుండా ఇది అడ్డుకుంటుంది. జ్వరం వచ్చినప్పుడు ప్రోటీన్లు నశిస్తాయి. వాటిని తిరిగి నింపడంలో చెరుకు రసం సహాయపడుతుంది.
4. ఈ రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుంది.
5. వేసవిలో చాలామంది బలహీనంగా మారుతారు. కాబట్టి కచ్చితంగా చెరుకు రసం తాగాలి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి వంటివి జీర్ణ రుగ్మతలు, కాలేయ వ్యాధులు, శ్వాస కోశ ఇన్ఫెక్షన్లు రాకుండా సహాయపడతాయి.
6. ఈ రసంలో కాల్షియం, మెగ్నీషియం, భాస్కరం, ఇనుము, పొటాషియం వంటివి ఉన్నాయి. ఇవి ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. ఆస్టియోపొరాసిస్ వంటి వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి. వైద్యులు కూడా ఒక గ్లాసు చెరుకు రసం తాగాలని సిఫారసు చేస్తున్నారు.
Also read: వెల్లుల్లిని మీ వంటగది గార్డెన్లో సులువుగా ఇలా పెంచేయండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.