భారతీయ సంస్కృతికి ప్రతిబింబం టీ. మనలో చాలా మందికి నిద్ర లేవగానే టీ తాగే అలవాటు ఉంటుంది. మరికొంతమంది ఆరోగ్య ప్రయోజనాలు పొందటం కోసం బ్లాక్ టీ తీసుకుంటారు. ఇందులోని క్యాటేచిన్స్, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి మేలు చేస్తాయి. రోగనిరోధక శక్తిని, జీవక్రియను మెరుగుపరుస్తుంది. కానీ పొద్దున్నే పరగడుపున టీ తీసుకోవడం ఆరోగ్యానికి మంచి కంటే చెడు ఎక్కువగా చేస్తుంది. ఇందులో కెఫీన్ ఉంటుంది. ఖాళీ కడుపుతో టీ లేదా మరేదైనా కెఫీన్ ఉన్న పానీయం తాగడం వల్ల ఎసిడిటీ వస్తుంది. జీర్ణవ్యవస్థలో అసౌకర్యంగా ఉంటుంది. కెఫీన్ కడుపులో యాసిడ్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇది చికాకు, వాపుకు కారణమవుతుంది.
ఉదయం టీ తాగడం వల్ల శరీర సహజ కార్టిస్టాల్ ఉత్పత్తికి ఆటంకం ఏర్పడుతుంది. కార్టిసాల్ అనేది నిద్ర- మెలకొనే చక్రాన్ని నియంత్రించడంలో సహాయపడే హార్మోన్. ఇది రోజంతా శక్తిని అందిస్తుంది. ఉదయం కెఫీన్ తీసుకుంటే దీని సామర్థ్యానికి ఆటంకం కలుగుతుంది. అలసట, బద్ధకంగా అనిపిస్తారు. ఇవే కాదు పరగడుపున టీ తాగితే వచః మరికొన్ని అనార్థాలు ఇవి.. కడుపులో చికాకు: ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల పొట్ట లైనింగ్ లో చికాకు ఏర్పడుతుంది. దీని వల్ల పొట్ట అసౌకర్యంగా ఉబ్బరం, వికారంకు దారి తీస్తుంది.
నిర్జలీకరం: టీ మూత్ర విసర్జనని పెంచుతుంది. నిర్జలీకరణానికి కారణమవుతుంది. ముఖ్యంగా రాత్రి అంతా నీరు తీసుకోకుండా చాలా గంటలు నిద్రపోతారు. దాని వల్ల శరీరం డీహైడ్రేషన్ కి గురవుతుంది. అటువంటి సమయంలో పొద్దున్నే టీ తాగితే డీహైడ్రేషన్ మరింత పెరుగుతుంది.
పోషకాల శోషణకు అంతరాయం: టీలో టానిన్లు ఉన్నాయి. ఇవి ఇనుము, కాల్షియం వంటి ఖనిజాల శోషణ తగ్గించేలా చేస్తుంది. దీంతో శరీరానికి అవి తక్కువగా అందుతాయి.
దంత క్షయం: టీలో సహజమైన ఆమ్లాలు ఉంటాయి. ఇవి దంతాల మీద ఎనామిల ని నాశనం చేస్తుంది. ఎక్కువ మొత్తంలో టీ తాగితే పళ్ళు త్వరగా పుచ్చు పడతాయి.
ఎప్పుడు టీ తాగాలి?
టీ తాగొద్దని ఏమి చెప్పడం లేదు. కాకపోతే అది తీసుకోవడానికి సరైన సమయం ఉండాలి. నిపుణులు అభిప్రాయం ప్రకారం టీ తీసుకోవడానికి సరైన సమయం ఉదయం అల్పాహారం తర్వాత మంచిది. అప్పుడు జీవక్రియ ప్రక్రియ సజావుగా పని చేయడం ప్రారంభిస్తుంది. పొద్దున్నే పరగడుపున టీ, కాఫీకి బదులు మజ్జిగ లేదా గోరు వెచ్చని నీటిలో చిటికెడు హిమాలయన్ గులాబీ ఉప్పు వేసుకుని తాగొచ్చు. సుదీర్ఘ రాత్రి నిద్ర తర్వాత శరీర వ్యవస్థని రీసెట్ చేసేందుకు నిమ్మ లేదా మెంతి నీటితో కూడా రోజును ప్రారంభించవచ్చు. కలబంద రసం, సాధారణ కొబ్బరి నీళ్ళు, పచ్చి తేనె, నీటిలో కొన్ని చుక్కల ఆపిల్ సిడర్ వెనిగర్ లేదా కొబ్బరి వెనిగర్ వేసుకుని తాగొచ్చు. ఇవి కాఫీ, టీ కంటే మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: వేసవిలో పుచ్చకాయ తింటే బోలెడు లాభాలు - మరి రాత్రి పూట తినొచ్చా?