రోజంతా శ్రమించి అలసిపోయే శరీరానికి నిద్ర ఎంత అవసరమో తెలిసిందే. నిద్ర అంటే.. శరీరంలోని కీలక అవయవాలకు కాసేపు విశ్రాంతి ఇస్తున్నట్లే. నిద్ర ఒత్తిడి నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. తర్వాతి రోజు కార్యకలాపాలకు శక్తిని పొందడానికి సహాయపడుతుంది. నిద్రలేమి వల్ల వచ్చే అలసట, బద్ధకం, అలసట మరియు మానసిక కల్లోలం దీర్ఘకాలంలో మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కొందరికి నిద్రపోయే అవకాశం ఉన్నా.. సమయానికి పడుకోరు. మరికొందరు నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నా నిద్ర రాదు. మరికొందరికి నిద్ర పట్టినా.. అర్ధరాత్రి అకస్మాత్తుగా మెలకువ వస్తుంది. ఆ తర్వాత మళ్లీ నిద్రపోవడమంటే.. పెద్ద టాస్క్. 


జర్నల్ ఆఫ్ సైకోసోమాటిక్ రీసెర్చ్‌లో ప్రచురించిన ఓ అధ్యయనం ప్రకారం.. ఇటీవల 22,000 మంది వాలంటీర్లపై నిద్రపై అధ్యయనం నిర్వహించారు. వీరిలో  15 ఏళ్లు కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో 31.2% మంది కనీసం వారానికి మూడుసార్లు అర్ధరాత్రిళ్లు నిద్ర మధ్యలో మేల్కొంటారని తెలుసుకున్నారు. బెడ్ మీద నుంచి తోసేస్తున్నట్లుగా.. ఏదో మీద పడుతున్నట్లుగా అనిపించి.. ఉలిక్కిపడి నిద్రలేస్తున్నామని చెబుతున్నారు. అయితే, దీన్ని మనం పీడ కలలు అనుకుని సీరియస్‌గా తీసుకోము. కానీ, దీనికి అనేక అనారోగ్య కారణాలు, చెడు అలవాట్లు కారణమని పరిశోధకులు చెబుతున్నారు. 


నిద్రకు ముందు ఎక్కువ పానీయాలు తాగడం: శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం మంచి అలవాటే. కానీ, నిద్ర వేళలో మాత్రం అతిగా పానీయాలు తాగడం అంత మంచిది కాదు. దాని వల్ల తరచుగా మూత్రవిసర్జన చేయవలసి వస్తుంది. దాని వల్ల నిద్ర నుంచి పదే పదే మేల్కోవలసి వస్తుంది. ప్రశాంతమైన నిద్రకు భంగం కలుగుతుంది. అలా జరగకూడదంటే.. మీరు సాయంత్రం లేదా నిద్రవేళలో పరిమిత పరిమాణంలో పానీయాలు తీసుకోడానికి ప్రయత్నించాలి.  


ఆల్కహాల్ తీసుకోవడం: చాలామందికి మద్యం తాగిన తర్వాత మత్తు వచ్చేస్తుంది. స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ నిపుణుడు తెలిపిన వివరాల ప్రకారం.. నిద్రవేళలో ఆల్కహాల్ సేవించినప్పుడు, అది నిద్రకు భంగం కలిగించవచ్చు లేదా (Rapid Eye Movement-REM) దశ ప్రారంభాన్ని ఆలస్యం చేయవచ్చు. అంతేగాక.. ఆల్కహాల్ నిర్జలీకరణాన్ని ప్రేరేపిస్తుంది. దీని వల్ల మీకు నిద్ర మధ్యలో దాహంగా అనిపిస్తుంది. నీటి కోసం లేదా మూత్ర విసర్జన కోసం మళ్లీ మళ్లీ నిద్రలేవాల్సి వస్తుంది. 


స్లీప్ అప్నియా (Sleep Apnea): ఇది తీవ్రమైన నిద్ర సమస్య (Sleep Disorder). దీనివల్ల శ్వాస ఆగిపోయినట్లు అనిపిస్తుంది. దీనివల్ల కొందరు చాలా గట్టిగా గురకపెడతారు. శ్వాస స్థిరంగా లేకపోవడం వల్ల పదే పదే నిద్రలేచి ఊపిరి పీల్చుకోవడం చేస్తారు. స్లీప్ అప్నియా వల్ల గుండె సమస్యలతోపాటు దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతుంది. ఈ సమస్య ఉంటే మీరు తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి. 


Also Read: గంటలు గంటలు కూర్చుని నిద్రపోవడం.. ప్రాణానికే ప్రమాదమా?
 
మానసిక ఆందోళన.. కలలు: మీరు శరీరకంగా గాయపడినా, మానసిక ఒత్తిడికి గురైనా మీలో నిద్రలేమి సమస్య ఏర్పడుతుది. ఒక వేళ నిద్రపోయినా.. ఏవేవో కళ్లల్లో కదులుతున్నట్లు అనిపిస్తుంది. కళ్లు మూసుకున్నా ఆ ప్రతి బింబాలు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మానసిక సమస్యలను ఎదుర్కొనేవారిలో ఈ లక్షణాలు ఉంటాయి. ఒక వేళ వారు నిద్రపోయినా.. కింద పడిపోయినట్లు అనిపించడం, కాలు లాగుతున్నట్లుగా భ్రమపడటం వంటివి నిద్రలో కనిపించి ఉలిక్కిపడి లేస్తారు. శరీరక గాయాలు ఒక్కోసారి బాగా నొప్పి కలిగించి నిద్ర నుంచి మేల్కొనేలా చేస్తాయి.


Also Read: రాత్రి పూట వీటిని తినొద్దు... నిద్ర చెడగొడతాయి
Also Read: నిద్రపోవడానికి ముందు ఈ చిట్కాలు పాటిస్తే బరువు తగ్గుతారు.. జీవక్రియకూ లాభం!
Also Read: నిద్ర సరిపోకపోతే డయాబెటిస్ వచ్చే ఛాన్స్..
Also Read: ఆరుగంటల కన్నా తక్కువ నిద్రపోతున్నారా? అయితే మీ శరీరంలో ఈ మార్పులు తప్పవు