Heart Disease Risk with Working Hours : ఈ మధ్యకాలంలో లే ఆఫ్​లు, టార్గెట్స్ అనేవి​ ఉద్యోగులపై ఒత్తిడిని పెంచుతున్నాయి. అంతేకాకుండా ఈ కాంపిటేటివ్ వరల్డ్​లో సక్సెస్ అవ్వాలంటే.. ఎక్కువసేపు పని చేయాలని చాలామంది అనుకుంటారు. ఈ క్రమంలో తమ ఉద్యోగాన్ని కాపాడుకోవాలని వర్క్ చేస్తూ.. చాలామంది తమ ఆరోగ్యాన్ని విస్మరిస్తున్నారని చెప్తోన్నాయి తాజా అధ్యయనాలు. వర్క్ మీకు సక్సెస్​ని ఇచ్చినా.. ఇవ్వకున్నా.. మీ గుండెపై మాత్రం ప్రెజర్ పెంచుతుందని.. అందుకే జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు నిపుణులు. 

Continues below advertisement

స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచే పని గంటలు

వారానికి 55 గంటలు లేదా అంతకంటే ఎక్కువ పనిచేసే వ్యక్తులలో గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదం 35 నుంచి 40 శాతం పెరుగుతుందని నిపుణులు గుర్తించారు. నిద్ర అనేది మన గుండె, రక్త నాళాలు సహజంగా తమను తాము మరమ్మతు చేసుకునే సమయం. అయితే ఈ ఆ విషయాన్ని విస్మరిస్తూ నిద్రను మాని.. వర్క్​పై ఫోకస్ చేస్తున్నారట. దీంతో గుండె, రక్తనాళాలు మరమ్మత్తు అయ్యే ఛాన్స్ దొరకదు. దీంతో గుండె సమస్యల ప్రమాదం ఎక్కువ అవుతుంది.

సరైన నిద్రలేకుంటే గుండెకు నష్టమే

రోజుకు 6 నుంచి 7 గంటల కంటే తక్కువ నిద్రపోవడం వల్ల శరీరంలో ఒత్తిడి పెరుగుతుంది. రక్తపోటు పెరిగి గుండెపై ప్రెజర్ ఎక్కువ అవుతుంది. దాంతో గుండె రక్తాన్ని పంప్ చేయడానికి చాలా కష్టపడుతుంది. అలాగే సరైన నిద్రలేకపోవడం వల్ల శరీరం సహజ జీవ గడియారం దెబ్బతింటుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని రెట్టింపు చేస్తుంది.

Continues below advertisement

నైట్ షిఫ్ట్స్ చేస్తే మరింత ప్రమాదం

రాత్రి షిఫ్ట్‌లతో పాటు.. రాత్రిపూట మేల్కొని ఉండటం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అలాగే రక్తంలో చక్కెర నియంత్రణ మరింత దిగజారిపోతుంది. ఇది మధుమేహం, ఊబకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తుంది. దీంతో తరచూ ఛాతీ నొప్పి, నిరంతర అలసట, కొంచెం శ్రమతో శ్వాసలో ఇబ్బందులు కలుగుతాయి. ఇవి గుండె ప్రమాదంలో ఉందని తెలిపే సంకేతాలుగా చెప్తున్నారు. గుండె జబ్బుల ప్రారంభ లక్షణాలు కూడా కావచ్చు.

చేయకూడని తప్పులు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వారం మొత్తం నిద్ర మానేసి వీకెండ్‌లో ఎక్కువగా నిద్రపోవడం కూడా మంచిది కాదు. నిద్ర అనేది లగ్జరీ కాదు.. శరీరానికి అవసరం అని అందరూ గుర్తించుకోవాలి. స్ట్రెస్ పెరిగితే కార్టిసోల్ స్థాయి పెరిగి హార్ట్‌పై ఒత్తిడి పెరుగుతుంది. ఎక్కువసేపు కూర్చొని పని చేయడం కూడా హార్ట్ రిస్క్ పెంచుతుందని చెప్పొచ్చు. ప్రతి 45–60 నిమిషాలకు 5 నిమిషాల బ్రేక్ తీసుకోవచ్చు. 

కాబట్టి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజూ 7 నుంచి 9 గంటల విశ్రాంతి, నాణ్యమైన నిద్ర ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మీరు మరింత ప్రొడెక్టివ్​గా వర్క్ చేయగలుగుతారు. పని సులభం అవుతుంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి, రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేసుకునేందుకు యోగా వంటివి చేయాలి. ఇవి ఒత్తిడిని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.