Healthy Kids with Small Habits : పిల్లలు ఆరోగ్యంగా, బలంగా, ఆత్మవిశ్వాసంతో ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. కానీ స్క్రీన్ టైమ్, స్కూల్ షెడ్యూల్‌, జంక్ ఫుడ్, మొబైల్ గేమ్స్ మోజులో బయట గేమ్స్ ఆడకపోవడం వల్ల పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుంది. అయితే మీకో శుభవార్త. మీ పిల్లలు తెలివిగా, పొడవుగా, బలంగా ఎదగడానికి ఎలాంటి ఫాన్సీ సప్లిమెంట్లు అవసరం లేకుండా.. ఫుడ్ విషయంలో కొన్ని మార్పులు చేస్తే చాలంటున్నారు పోషకాహార నిపుణులు. వాటితో పాటు కాస్త జీవనశైలిలో మార్పులు చేస్తే పిల్లలు బలంగా, ఆరోగ్యంగా ఎదుగుతారని చెప్తున్నారు. 

Continues below advertisement

ప్రోటీన్ పవర్ మార్నింగ్స్

సాధారణంగా ఇంట్లో ఉదయాన్నే పోహా, దోశ, బ్రెడ్, ఇడ్లీ వంటి కార్బోహైడ్రేట్‌లతో నిండిన టిఫెన్స్ ఉంటాయి. ఇవి తక్షణ శక్తిని ఇస్తాయి. కానీ మధ్యాహ్నం సమయానికి నీరసంతో పాటు.. ఏకాగ్రతను దూరం చేస్తాయి. కాబట్టి పిల్లలకు ఉదయాన్నే ప్రోటీన్ ఇవ్వాలి. ఇది ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, మానసిక స్థితిని మెరుగు చేస్తుంది. కాబట్టి అవకాడో, గుడ్లు, పనీర్ శాండ్ విచ్, పండ్లు, నట్స్, యోగర్ట్, పీనట్ బటర్, అరటి పండు, శనగలు, స్ప్రౌట్స్​ తినకుంటే వాటితో టేస్టీ సలాడ్ చేసి పిల్లలకు బ్రేక్​ఫాస్ట్​గా ఇవ్వవచ్చు. 

రెయిన్‌బో ప్లేట్ ఛాలెంజ్

పిల్లలకు ఆరోగ్యకరమైన ఫుడ్ అనేది నచ్చదు. ఆటలు ఇష్టం. కాబట్టి తినడానికి ప్లేట్​ని కలర్​ఫుల్​గా సిద్ధం చేయండి. కనీసం ఓ ప్లేట్ భోజనంలో 5 రకాల కలర్స్ ఉండేలా చూసుకోండి. ఉదాహరణకు...

Continues below advertisement

  • ఎరుపు: టొమాటోలు, ఆపిల్స్, స్ట్రాబెర్రీలు, పుచ్చకాయ, దానిమ్మ
  • పసుపు/నారింజ: క్యారెట్లు, చిలగడదుంప, మామిడి
  • ఆకుపచ్చ: పాలకూర, బఠానీలు, కీరదోస
  • నీలం/పర్పుల్: ద్రాక్ష, బీట్‌రూట్, బ్లూబెర్రీస్
  • తెలుపు: పుట్టగొడుగులు, అరటిపండు, కొబ్బరి

ప్రతి రంగు విభిన్న విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు కలిగి ఉంటుంది. ఇవి మంచి దృష్టి, బలమైన ఎముకలు ఇవ్వడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇలాంటి ఫుడ్స్ కాంబినేషన్​గా ఇస్తే చూసేందుకు కలర్​ఫుల్​గా ఉంటుంది. మీరు వారితో కలర్స్ అడుగుతూ తినిపించవచ్చు.

నీరు ప్రధానం

పిల్లలు "నాకు ఆకలిగా ఉంది" అని చెప్తున్నారంటే.. వారికి దాహం అవుతుందని కూడా ఇండికేషన్ అని చెప్తారు. ఎక్కువ ఆడడం, యాక్టివ్​గా ఉంటారు కాబట్టి.. వారికి తరచూ నీళ్లు ఇవ్వాలని చెప్తారు. డీహైడ్రేషన్ వల్లే పిల్లలో జంక్ ఫుడ్ క్రేవింగ్స్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని చెప్తారు. ప్రతి పిల్లలకి బాటిల్ ఇవ్వండి. కచ్చితంగా వాళ్లు నీళ్లు తాగేలా చూడండి. బాగా చిన్న పిల్లలు రోజుకు 1–1.2 లీటర్లు, పెద్ద పిల్లలు రోజుకు 1.5–2 లీటర్లు నీళ్లు తాగేలా చూసుకోవాలి. షుగర్ డ్రింక్స్​కి దూరంగా ఉంచండి. అవి బరువు పెరిగిలే చేస్తాయి. ఇమ్మూనిటీపై నెగిటివ్ ప్రభావం చూపిస్తాయి. 

నిద్రతోనే ఎదుగుదల

పిల్లలకి స్క్రీన్ చూసే అలవాటు ఉంటే.. రాత్రుళ్లు పడుకునే ముందు కూడా మొబైల్స్ తోనే ఉంటారు. ఇది నిద్రను దొంగిలిస్తోంది. అందుకే ఈరోజుల్లో పిల్లలు తమ శరీరానికి అవసరమైన దానికంటే 1–2 గంటలు తక్కువ నిద్రపోతున్నారని తేలింది. దీనివల్ల ఎత్తు, కండరాలు, రోగనిరోధక శక్తికి కారణమయ్యే వృద్ధి తగ్గుతుంది. కాబట్టి పిల్లలు నిద్రపోయే వాతావరణాన్ని మీరు అందించాలి. 5-12 ఏళ్లు ఉన్న పిల్లలు 9–11 గంటలు, టీనేజర్స్ 8–10 గంటలు పడుకునేలా చూసుకోవాలి. మంచి నిద్ర మెరుగైన ఎదుగుదలతో పాటు బలమైన రోగనిరోధక శక్తిని, ప్రశాంతమైన ప్రవర్తనను అందిస్తుంది.

యాక్టివిటీ

పిల్లలకు వ్యాయామాలు అవసరం లేదు. కనీసం వారు సరదాగా కదిలే ఆటలు అయినా ఆడేలా చేయాలి. బహిరంగ శారీరక శ్రమ అనేది ఎముక సాంద్రత, ఊపిరితిత్తుల సామర్థ్యం, కండరాల బలం, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. సైక్లింగ్ లేదా స్కేటింగ్, స్కిప్పింగ్ రోప్, ఫుట్‌బాల్ లేదా క్రికెట్, దాగుడు మూతలు లేదా పరిగెత్తే ఆటలు, ఇంట్లోనే డ్యాన్స్ వేయడం వంటివి చేయించవచ్చు. ఇవన్నీ ఆందోళనను తగ్గించి.. మెరుగైన నిద్రను అందిస్తాయి. మెదడు పనితీరును మెరుగ్గా ఉంచుతాయి. పిల్లలో ఒబెసిటీ రాకుండా కాపాడుతాయి.

ఇవన్నీ చిన్న మార్పులే. కానీ పెద్ద ఫలితాలు ఇస్తాయి. కాబట్టి ఈరోజు నుంచే అన్ని స్టార్ట్ చేయాలని లేదు. వారానికొకటి పిల్లల లైఫ్​లో ఉండేలా చూసుకోండి. ఒకేసారి అన్నీ రుద్దేస్తే పిల్లలు వాటిని ఎక్కువ కాలం చేయలేరు కాబట్టి.. చిన్న చిన్నగా మొదలు పెట్టండి. ఇవన్నీ వారికి మంచి ఎదుగుదల, ఆరోగ్యాన్ని తప్పక అందిస్తాయి. 

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.