Silent Heart Attacks in India : కరోనా తర్వాత ఇండియాలో సైలెంట్ హార్ట్ ఎటాక్ కేసులు పెరిగినట్లు పలు స్టడీలు చెప్తున్నాయి. ఎలాంటి లక్షణాలు లేకుండా, అతి తక్కువ లక్షణాలతో గుండెపోటు రావడం వల్ల ఎందరో ఇబ్బంది పడుతున్నారని తేలింది. ప్రతి సంవత్సరం ఇండియాలో 3 మిలియన్ల మందికి హార్ట్ ఎటాక్స్ వస్తుంటే.. దానిలో 25 నుంచి 30 శాతం సైలెంట్ హార్ట్ ఎటాక్సేనట. దాదాపు 7.5 నుంచి 9 లక్షల మంది సైలెంట్ హార్ట్ ఎటాక్ బారిన పడతున్నారు. 

కొవిడ్ -19 తర్వాత ఇండియాలో ఈ తరహా గుండెపోటు కేసులు గణనీయంగా పెరిగాయి. ఈ ధోరణి ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే సైలెంట్ హార్ట్ ఎటాక్స్​ ఎలాంటి లక్షణాలు ఉండవు. ఉన్నా అతి తక్కువ లక్షణాలే ఉంటాయి కాబట్టి. దీనిని ఎక్కువమంది సీరియస్​గా తీసుకోరు. దానివల్ల గుండెకు నష్టం జరగడం, ప్రాణాపాయ స్థితిని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయట. 

ప్రమాదం వారికే ఎక్కువట.. కారణమిదే

ముఖ్యంగా కొవిడ్ నుంచి కోలుకున్నవారిలో ఈ ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనాలు సూచిస్తున్నాయి. కరోనా వైరస్ గుండె కణాలను దెబ్బతీయడం వల్ల గుండె బలహీన పడి ఈ ప్రమాదాలు పెంచుతున్నట్లు గుర్తించారు. మళ్లీ కరోనా తెరపైకి రావడం.. ఇండియాలో కేసులు నమోదవుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. సైలెంట్ హార్ట్ ఎటాక్ లక్షణాలు ఏంటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 

సైలెంట్ హార్ట్ ఎటాక్

గుండెపోటు వస్తే ఆ లక్షణాలు తెలుస్తాయి కానీ.. సైలెంట్ హార్ట్ ఎటాక్​లో ఆ లక్షణాలు గుర్తించడం చాలా కష్టం. దీనివల్ల చికిత్స సరైన సమయానికి అందదు. దీనివల్ల హార్ట్ ఫెయిల్ అవ్వడం, మరోసారి హార్ట్ ఎటాక్ రావడం, కొన్ని పరిస్థితుల్లో ప్రాణాలు పోవడం జరుగుతుంది.  

సైలెంట్ హార్ట్ ఎటాక్ లక్షణాలు

సైలెంట్​గా వచ్చే గుండెపోటుకు ఎక్కువ లక్షణాలు కనిపించకపోవచ్చు కానీ.. కొన్ని లక్షణాలు కనిపించే అవకాశముంది. ఛాతీ దగ్గర, దవడ భాగంలో, చేతిలో కాస్త అసౌకర్యంగా ఉండొచ్చు. బాగా అలసిపోయినట్టు, కళ్లు తిరుగుతున్నట్లు, ఓపిక లేనట్లు అనిపించవచ్చు. బ్రీతింగ్ తీసుకోవడంలో ఇబ్బంది, చల్లని చెమటలు వంటి లక్షణాలు సైలెంట్ హార్ట్​ ఎటాక్​లో కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అస్సలు విస్మరించకూడదు. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

సైలెంట్ హార్ట్ ఎటాక్​ రాకుండా ఉండాలనుకుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రెగ్యులర్​గా గుండెకు సంబంధించిన చెకప్స్ చేయించుకోవాలి. ముఖ్యంగా కొవిడ్ బారిన పడినవారు టెస్ట్​లు చేయించుకోవాలి. హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. జంక్ ఫుడ్, డీప్ ఫ్రై చేసిన ఫుడ్స్ తీసుకోకూడదు. రెగ్యులర్​గా వ్యాయామం చేయాలి. రోజు కనీసం 30 నిమిషాలు నడవాలి. బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ కంట్రోల్​లో ఉండేలా చూసుకోవాలి. ఒత్తిడిని తగ్గించుకుంటే మంచిది. స్మోకింగ్ కూడా హాని చేస్తుంది కాబట్టి మానేస్తే బెటర్. 

హెల్తీ లైఫ్​ని ఫాలో అవుతూ రెగ్యులర్​గా చెకప్స్ చేయించుకుంటే సైలెంట్ హార్ట్ ఎటాక్​ని దూరం చేసుకోవచ్చని చెప్తున్నారు. అలాగే ఎలాంటి లక్షణాలు కనిపించినా విస్మరించకుండా వైద్యులను సంప్రదిస్తే ప్రాణాపాయ స్థితి తప్పుతుందని సూచిస్తున్నారు. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.