రోజంతా యాక్టివ్ గా ఉండాలంటే ఉదయం నిద్ర లేవగానే చేయాల్సిన మొదటి పని ఒక గ్లాసు నీళ్ళు తాగడం. ఇది అన్ని విధాలుగా ఆరోగ్యానికి మంచే చేస్తుంది. పోషకాహారం, కంటి నిండా నిద్ర శరీరానికి అవసరమో తగినంత నీరు తాగడం కూడా అంతే ముఖ్యం. అందుకే అంటారు నీరు జీవనాధారం అని. శరీరంలో దాదాపు 60 శాతం నీరు ఉంటుంది. శరీర అవయవాల పనితీరు బాగుండాలన్నా, మెరిసే చర్మం కావాలన్నా, బరువు తగ్గాలని అనుకున్నా.. ఇలా దేనికైనా నీరు అన్నింటికీ చక్కని పరిష్కారం.
రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది. కణాలకి పోషకాలని సరఫరా చేస్తుంది, శరీరంలోని వ్యర్థాలని తొలగిస్తుంది. తగినంత నీరు తాగకపోతే శరీరం డీహైడ్రేట్ కు గురవుతుంది. దీని వల్ల ఇతర అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. శరీరం చెమట, శ్వాస, మూత్రం, పేగు కదలికల ద్వారా నీటిని కోల్పోతూనే ఉంటాం. మళ్ళీ నీటిని పొందడం చాలా అవసరం. నిద్ర లేచిన వెంటనే నీళ్ళు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటి వెనుక సైన్స్ పరంగా కూడా కొన్ని కారణాలు ఉన్నాయి.
శరీరం రీహైడ్రేట్ చేస్తుంది
రాత్రి అంతా నిద్రలో ఉండటం వల్ల నీరు తగినంత తీసుకోలేకపోతాం. దీని వల్ల డీహైడ్రేట్ కి గురవుతారు. అందుకే ఉదయం లేచిన వెంటనే నీరు తాగడం వల్ల శరీరం హైడ్రేట్ గా మారిపోతుంది. దీనిపై కొంతమంది పెద్దలపై పరిశోధనలు కూడా చేశారు. ఉదయం పరగడుపున నీళ్ళు తాగిన వాళ్ళ మూత్రం లేత రంగులో ఉంటుంది. అంటే వాళ్ళు హైడ్రేట్ అవలేదని అర్థం. అదే ముదురు రంగులో మూత్రం వస్తే మాత్రం డీహైడ్రేట్ కి గురయినట్టుగా భావించారు.
అల్పాహారానికి ముందు నీరు మంచిదే
ఉదయం అల్పాహారానికి ముందు గ్లాసు నీళ్లు తీసుకోవడం వల్ల రోజంతా దాని ప్రభావం కనిపిస్తుంది. రోజువారీ కేలరీలని తగ్గించడంలో సహాయపడుతుందని పలు ఆధారాలు ఉన్నాయి. అల్పాహారం ముందు నీళ్ళు తాగడం వల్ల తదుపరి భోజనంలో కెలరీలు తీసుకోవడం 13% తగ్గినట్లు అధ్యయనం వెల్లడించింది. అలాగే భోజనానికి ముందు కూడా ఇలా మంచి నీలు తాగడం వల్ల ఇదే ఫలితం వచ్చింది.
బరువు తగ్గిస్తుంది
క్రమం తప్పకుండా నీటిని తాగడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. ఉదయాన్నే నీరు తాగితే అదనంగా 48 కేలరీలు బర్న్ అవుతాయని ఒక అధ్యయనం వెల్లడించింది. అలాగే ఏడాది పాటు ఉదయాన్నే నీరు తాగితే 17వేల అదనపు కేలరీలు ఖర్చు అవుతాయి. అంతే దాదాపు 2.5 కేజీల కొవ్వు కరిగిపోతుంది.
మానసిక పరస్థితి భేష్
డీహైడ్రేషన్ తో మానసిక పరిస్థితికి ముడి పడి ఉంటుంది. ఉదయాన్నే నీళ్ళు తాగడం వల్ల మెదడు చురుకుగా పని చేస్తుంది. దీని వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. ఏకాగ్రత, శారీరక పని తీరు మీద మీద కూడా ప్రతికూల ప్రభావం చూపిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.
టాక్సిన్స్ తొలగిస్తుంది
ముడతలు లేని చర్మం కావాలంటే తప్పనిసరిగా తగినంత నీరు తాగాలి. ఉదయాన్నే నీరు తాగడం వల్ల టాక్సిన్స్ ని తొలగిస్తుంది. మూత్రపిండాల్లోని వ్యర్థాలని బయటకి పంపించడంలో సహాయపడుతుంది. నీరు బాగా తీసుకోవడం వల్ల చర్మం కూడా మెరుస్తూ ఉంటుంది. అంతే కాదు మొటిమలు తగ్గుతాయి. తేమతో కూడిన చర్మం లభిస్తుంది. డీహైడ్రేట్ అయితే చర్మం పొడిబారిపోయి నిర్జీవంగా కనిపిస్తుంది. అందుకే పొద్దున్నే నీళ్ళు తాగితే అందం కూడా మీ సొంతమే.
జీవక్రియ మెరుగు
ఉదయాన్నే నీటిని తీసుకోవడం వల్ల జీవక్రియ కూడా మెరుగుపడుతుంది. ఇది మరింత బరువు తగ్గడానికి దోహదపడుతుంది. కొంతమంది కొవ్వు కరిగించుకునేందుకు గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మకాయ పిండుకుని తాగుతారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also read: ‘లివర్ సిర్రోసిస్’ అంటే ఏమిటీ? అది కాలేయ క్యాన్సర్‌గా మారకూడదంటే ఏం చేయాలి?