కోడిగుడ్డును సంపూర్ణ ఆహారంగా చెబుతారు పోషకాహార నిపుణులు. దీనిలో మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు నిండుగా ఉంటాయి. ఇది కేవలం మన ఆరోగ్యాన్ని కాపాడడానికే కాదు, అందాన్ని కాపాడడానికి ఎంతో సహకరిస్తుంది. దీనిలో మన జుట్టుకు, చర్మానికి అవసరమైన ఎన్నో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ లభిస్తాయి. అందుకే ప్రతిరోజూ గుడ్డు తినమని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. ఆరోగ్యాన్ని కాపాడాలనుకునే కాదు, అందాన్ని పరిరక్షించుకోవాలనుకునే వారు కూడా ప్రతిరోజు గుడ్డును తినడం అలవాటు చేసుకోవాలి. అలాగే గుడ్డుతో కొన్ని రకాల ఫేస్ ప్యాక్‌లు వేసుకోవడం ద్వారా కూడా చర్మాన్ని కాపాడుకోవచ్చు.
గుడ్డులోని పచ్చసొనను వేరుచేసి ఒక చిన్న గిన్నెలో వేయాలి. ఆ పచ్చసొనలో ఒక స్పూన్ తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా గిలక్కొట్టి ముఖానికి పట్టించాలి. 20 నిమిషాల పాటు అలా వదిలేసి తర్వాత కడుక్కోవాలి. వారం రోజులు పాటు ఇలా చేస్తే చర్మం పొడి బారడం తగ్గుతుంది. అలాగే పచ్చసొనలో ఒక టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లాక్స్ పొడిని వేసి బాగా కలపాలి. అందులో ఒక టేబుల్ స్పూన్ పాలు, తేనె కూడా కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా గిలక్కొట్టి ముఖానికి పట్టించాలి. ఇరవై నిమిషాల పాటు అలా ఉంచి తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా పొడి చర్మం తగ్గుతుంది.
కొందరికి చర్మం జిడ్డు కారుతూ ఉంటుంది. అప్పుడే మేకప్ వేసుకున్నా కూడా వెంటనే చర్మం జిడ్డుగా మారుతుంది. ఇలాంటివారు గుడ్డులోని తెల్లసొనను ఉపయోగించవచ్చు. తెల్లసొనను ఒక గిన్నెలో వేసి ఒక స్పూన్ తేనె కలుపుకోవాలి. దాన్ని బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. ఇరవై నిమిషాల పాటు వదిలేసి సాధారణ నీటితో కడిగేసుకోవాలి. ఇలా వారం రోజులు పాటు చేస్తే చర్మంపై అదనంగా నూనె ఉత్పత్తి కావడం తగ్గిపోతుంది. అలాగే ఒక టేబుల్ స్పూన్ తెల్లసొనను ఒక టేబుల్ స్పూన్ ఓట్స్, ఒక టేబుల్ స్పూన్ పెరుగు, టేబుల్ స్పూన్ తేనె వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి బాగా మర్ధనా చేయాలి. తర్వాత ఇరవై నిమిషాల పాటు వదిలేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే చర్మం మృదువుగా మారుతుంది.
తెల్లసొనలో ఓట్స్ కలిపి ముఖానికి పట్టించిన చాలా మంచిది. గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి. చర్మ రంధ్రాలు తెలుసుకోవడం వల్ల మొటిమలు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. గుడ్డుతో జుట్టుకు కూడా ఎంతో పోషణను అందించవచ్చు. గుడ్డులోని తెల్లసొనను వేరుచేసి జుట్టుకు పట్టించాలి. తర్వాత ఒక గ్లాసు నీటిలో నిమ్మకాయ రసాన్ని పిండి, ఆ ద్రవంతో జుట్టును తడుపుకోవాలి. 20 నిమిషాల పాటు అలా వదిలేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టుగా జిడ్డుగా కాకుండా పట్టుకురుల్లా ఉంటుంది. అలాగే ఒక గుడ్డులోని పచ్చ సొనను గిన్నెలో వేసి అందులో రెండు స్పూన్ల బాదం నూనె కలపాలి. దీన్ని జుట్టుకు బాగా పట్టించి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టు పొడి బారే సమస్య ఉన్నవారికి ఆ పరిస్థితి తగ్గుతుంది. తెల్ల సొనలో నిమ్మరసం కలిపి జుట్టుకు పట్టించి అరగంట పాటు వదిలేసి తర్వాత షాంపూతో కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టు మెరుపు సంతరించుకుంటుంది.
ఇలా గుడ్డుతో చేసే ఫేస్ ప్యాక్‌లను పాటించడమే కాదు. ప్రతిరోజూ గుడ్డుతో చేసిన వంటకాలను తినడం వల్ల కూడా చర్మం మృదువుగా మారుతుంది. జుట్టు బాగా పెరుగుతుంది. అయితే రోజుకి ఒక గుడ్డుకు మించి తినకపోవడమే మంచిది. గుడ్డులో మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది. కాబట్టి ఒక గుడ్డు రోజూ తినడం వల్ల గుండెకు కూడా ఎంతో మంచి జరుగుతుంది.
Also read: గాలి కాలుష్యంతో జాగ్రత్త, త్వరగా పక్షవాతం బారిన పడతారు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.