సైన్స్ ఎంత పురోగతి సాధించినా సరే మరణం చుట్టూ ఉన్న మిస్టరీ మాత్రం అలాగే కొనసాగుతోంది. మరణం అంటే ఏమిటి? అనే విషయాల గురించి అనేక రకాల మత సంబంధ వాదానలు ఉన్న నేపథ్యంలో మరణం ఎప్పుడూ ఆసక్తికర అంశమే. మరణం గురించి రకరకాల అధ్యయనాలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. మరణిస్తున్న వారిని గమనించడం, ప్రయోగాలు చెయ్యడం నిత్యకృత్యమే. ఈ విషయంలో తెలుసుకున్నవి ఎన్నున్నా.. దేన్నీ కూడా ఇది అసలు సత్యం అని చెప్పగలిగే రుజువులు దొరకనే లేదనేది వాస్తవం. మరణం తర్వాత ఏమవుతుంది? మరణ సమయంలో అనుభవం ఎలా ఉంటుంది? వంటి అనేకానేక అనుమానాలు మరణం చుట్టూ ఎన్నో ఉన్నాయి.


చనిపోవడానికి కాస్త ముందు తెల్లని కాంతి కనిపిస్తుందట, ఇది మెదడులో జరిగే చివరి ఆక్టివిటిగా చెప్పుకోవచ్చని నిపుణులు అంటున్నారు. మరణానికి అతి దగ్గరగా వెళ్లి వచ్చిన వారు చనిపోయిన తమ సన్నిహితుల గొంతులు విన్నట్టు, ప్రకాశవంతమైన వెలుగును చూసినట్టు చెప్పినట్టు చాలా కథనాలు విని, లేదా చదివి ఉంటాం మనమంతా.


ఈ నేపథ్యంలో పరిశోధకులు ఆ మిస్టరీని తెలుసుకొనే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా కార్డియాక్ అరెస్ట్ తో మరణిస్తున్న వారి లైఫ్ సపోర్ట్ ను తొలగించిన తర్వాత వారి మెదడు కార్యకలాపాలను పర్యవేక్షించి చూశారు. వారికి గామా తరంగాలు కనిపించాయి. అత్యంత వేగవంతమైన ఈ తరంగాలు మెదడులో ఉత్పత్తి అయ్యాయి. లైఫ్ సపోర్ట్ మిషిన్స్ తీసేసినపుడు మరింత వేగంగా కనిపించాయట.


మిచిగాన్ సెంటర్ ఫర్ కాన్షియస్నెస్  సైన్స్ కు చెందిన అధ్యయనకారులు ఈ ప్రయోగాలను నిర్వహించారు. చనిపోతున్న సమయంలో పనిచేయని మెదడు నుంచి స్పష్టమైన ఇలాంటి అనుభవం ఎలా వస్తుందనేది ఒక న్యూరోసైంటిఫిక్ పారడాక్స్ గా ఇక్కడి అధ్యయనకారులు అభిప్రాయపడ్డారు. ఈ అధ్యయనం న్యూరోఫిజియలాజికల్ మెకానిజం గురించిన కొత్త విషయాన్ని వెలువరిస్తోందని వారు అంటున్నారు. ప్రొసిడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెలో ఈ వివరాలను ప్రచురించారు.


ఈఈజీ పర్యవేక్షణలో ఉండి హాస్పిటల్లో గుండె ఆగిపోవడం వల్ల మరణించిన నలుగురు వ్యక్తులను అధ్యయనం చేశారు. ఈ నలుగురు కూడా కోమాలో ఉన్నారు. వారిలో వైద్యానికి ఎలాంటి స్పందన లేకపోవడంతో వారిని బ్రెయిన్ డెడ్ గా ప్రకటించారు. వారి లైఫ్ సపోర్టింగ్ మెషిన్లను తొలగించిన తర్వాత ఇద్దరు రోగుల్లో పెరిగిన గుండె వేగంతో పాటు వారి మెదడులో గామా తరంగాలను గమనించారు.


ఈ తరంగాల కదలికలు మెదడులోని కలలు కనడం, ఎపిలేప్సీ సమయంలో బ్రమలు కలిగించే మెదడు భాగంలో గుర్తించారు. ఇలాంటి మార్పు వారికి ఫ్లాష్ లైట్ లాంటి వెలుగు కనిపించి ఉండేందుకు అవకాశం ఉందని అంటున్నారు. నిజానికి వారికి ఎలాంటి అనుభవం కలిగిందో చెప్పడం కష్టం. ఎందుకంటే వాళ్లు అప్పటికే మరణించారనేది గుర్తుపెట్టుకోవాలి అని నిపుణులు తెలియజేశారు. అయినప్పటికి తెలుసుకున్న విషయాలు చాలా ప్రాముఖ్యత కలిగినవే. ఎందుకంటే మరణిస్తున్న మనుషులలో రహస్యంగా ఉండే స్పృహ గురించిన అవగాహనకు సంబంధించిన ఒక కొత్త ప్రేమ్ లభించనట్టయిందని ఈ అధ్యయన కారులు ఉత్సాహంగా చెప్పారు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: లిప్ స్టిక్ వల్ల పెదాలు నల్లగా మారిపోతున్నాయా? ఇలా చేస్తే ఆ సమస్యే ఉండదు