ద్యోగాలు చేసే ఎంతో మంది రొటేషనల్ షిఫ్ట్ మీద పని చేస్తూ ఉంటారు. ఒక వారం నైట్ డ్యూటీ ఉంటే మరుసటి వారం డే డ్యూటీ ఉంటుంది. కానీ ఇలా షిఫ్ట్ మీద ఉద్యోగాలు చేసే వాళ్ళు ఎక్కువగా నిద్రలేమి సమస్యని ఎదుర్కొంటూ ఉంటారు. ఇలా జరగడం వల్ల బరువు పెరగడం, మధుమేహం, క్యాన్సర్, నిరాశ, గుండె బలహీనపడవచ్చని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. నైట్ షిఫ్ట్ శరీరం మీద ఎటువనాంతి ప్రభావం చూపుతుందని దాని గురించి తాజా పరిశోధనలు జరిపారు. కొత్త పరిశోధనలో ఎప్పుడు తింటున్నారు, అది ఆరోగ్యం మీద ఎటువంటి ప్రభావాన్ని చూపుతుందని దానికి మధ్య సంబంధాన్ని కనుగొన్నారు. ఎలుకలపై ఈ అధ్యయనం సాగింది.


నిద్ర మేల్కొనే చక్రం సరిగా లేనప్పుడు ఆకలి ప్రవర్తనలో కూడా మార్పు జరుగుతుందని గుర్తించారు. యునైటెడ్ కింగ్ డమ్ లోని బ్రిస్టల్ విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తల బృందం నిద్ర చక్రంతో సంబంధం ఉన్న హార్మోన్లు, ఎలుకల రోజువారీ ఆహారపు అలవాట్లకి మధ్య ఉన్న సంబంధంపై పరిశోధన చేశారు. సిర్కాడియన్ రిథమ్ అంతరాయాలు ఎలుకల తినే ప్రవర్తన మీద తీవ్ర ప్రభావం చూపుతాయని వాళ్ళు కనుగొన్నారు. ఇది శారీరక లయలకి భంగం కలిగిస్తుంది. కార్టికొస్టెరాన్ అనే హార్మోన్ ని ప్రభావితం చేస్తుంది. మానవులలోని కార్టిసాల్ హార్మోన్ ని ఇది పోలి ఉంటుంది. ఎలుకలలో కార్టికొస్టెరాన్ స్థాయిలు మేల్కోనే ముందు గణనీయంగా పెరుగుతాయి. తర్వాత రోజంతా క్రమంగా తగ్గుతాయి.


నిద్ర సరైన సమయంలో పడుకోకపోవడంతో కార్టికొస్టెరాన్ పెరుగుదలకి గురవుతుంది. అటువంటి సమయంలో ఎలుకలు నియంత్రణ లేకుండా ఆహారం తీసుకుంటున్నాయి. సాధారణంగా విశ్రాంతి తీసుకునే సమయాల్లో రోజువారీ ఆహారంలో దాదాపు సగం తిన్నాయి. ఈ అధ్యయనం ప్రకారం రాత్రి వేళ నిద్రపోకపోవడం వల్ల అతిగా తినాలనే కోరిక గణనీయంగా పెరిగింది. దీని ప్రభావం శరీరం మీద పడుతుంది. ఫలితంగా మధుమేహం, బరువు పెరగడం, అధిక రక్తపోటు వంటి అనారోగ్య సమస్యలు వచ్చేస్తాయి. నైట్ షిఫ్ట్ లో చేస్తూ ఒక్కసారిగా మార్నింగ్ షిఫ్ట్ కి మారడం వల్ల శరీరం దానికి త్వరగా అలవాటు పడదు. ఇలా చేయడం వల్ల గుండె నొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయని అనేక అధ్యయనాలు ఇప్పటికే హెచ్చరిస్తున్నాయి.


ఒక్కసారిగా జీవగడియారంలో వచ్చే మార్పుల వల్ల మధుమేహం రావడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. మెదడు మీద కూడ ప్రభావం చూపిస్తుంది. ఏకాగ్రత లోపించడం, అలసట, జ్ఞాపకశక్తి మందగించడం ఎదుర్కోవాల్సి వస్తుంది. రాత్రి వేళ శరీరం నుంచి మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఇది నిద్ర బాగా పట్టేలా చేస్తుంది. ఉదయం పూట దీని ఉత్పత్తి తగ్గుతుంది. అందుకే పగటి నిద్ర కంటే రాత్రి నిద్రకి అధిక ప్రాధన్యత ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: కిడ్నీ సమస్యలున్నాయా? తప్పనిసరిగా ఈ ఆహారాలను దూరం పెట్టాల్సిందే!