ఆకలికి రంగు రూపుతో పనిలేదు, ఏ దేశమన్న తేడాలేదు, సమయానికి ఆహారం అందాల్సిందే, లేకుంటే ఆత్మరాముడు ఆకలితో చావు కేకలు వేస్తాడు. ప్రస్తుతం ఉక్రెయిన్లో కనీసం మంచి నీళ్లు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇక ఆహారం సంగతి దేవుడెరుగు? ఇలాంటి దుర్భర స్థితిలో ఓ భారతీయ రెస్టారెంట్ ఎంతో మంది యుద్ధ బాధితుల ఆకలి తీరుస్తోంది. ఆ రెస్టారెంట్ యజమాని ఓ భారతీయుడే. ఆ రెస్టారెంట్ పేరు ‘సాథియా’. ఇది ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో ఉంది. ఆ రెస్టారెంట్ యజమాని గుజరాత్‌కు చెందిన మనీష్ దవే. కీవ్‌పై రష్యా మూకలు కమ్ముకున్నప్పటి నుంచి తన రెస్టారెంట్‌ను బాంబ్ షెల్టర్‌గా మార్చేశారు మనీష్. భారతీయ విద్యార్థులతో పాటూ, ఉక్రెయిన్లకు కూడా నీడ కల్పించారు. ఈ రెస్టారెంట్ లోతైన సెల్లార్లో ఉంటుంది. అంటే దాదాపు బంకర్ అనే చెప్పుకోవాలి. అందుకే కీవ్ పై బాంబులు పడగానే చుట్టుపక్కల వారు రెస్టారెంట్ వైపు పరుగులు తీశారు.
మనీష్ దవే మాట్లాడుతూ ‘చాలా ఉక్రెనియన్ పౌరులు కూడా రెస్టారెంట్‌లో వచ్చి తలదాచుకుంటున్నారు. ఇది బంకర్ లాంటి నేలమాళిగలో ఉండడంతో సురక్షితంగా భావిస్తున్నారు. వీరందరికీ నేను ఆహారాన్ని అందిస్తున్నాను’ అని చెప్పారు. ప్రస్తుతం ఆ రెస్టారెంట్లో 125 మంది యుద్ధ బాధితులు ఉన్నారు. వారందరికీ నీళ్లు, ఆహారం సమయానికి అందిస్తున్నారు రెస్టారెంట్ స్టాఫ్. అందుకోసం రేషన్ కూడా వారే ప్రత్యేకంగా చుట్టుపక్కల దుకాణాల్లో, సూపర్ మార్కెట్లలో వెతుకుతున్నారు. ప్రస్తుతం ఆ రెస్టారెంట్లో కేవలం నాలుగు రోజులకు సరిపడా ఆహారం మాత్రమే ఉంది. కూరగాయలు దాదాపు అయిపోయాయి. రేషన్ కొనేందుకు బయటికి వెళ్లేందుకు కఠినమైన కర్ఫ్యూ అమలులో ఉంది. ప్రస్తుతానికి ఉన్నవాటితో పొదుపుగా నెట్టుకొస్తున్నారు మనీష్. కీవ్‌లోని భారత విద్యార్థులకు సాథియా ఫేవరేట్ రెస్టారెంట్. ఇక్కడ చికెన్ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది.
Also read: ఉక్రెయిన్లో ఒక నెల ఖర్చు ఎంత తక్కువో తెలుసా? మనం హ్యాపీగా బతికేయచ్చు
Also read: భారత పాస్‌పోర్టు ఉంటే చాలు, ఈ దేశాల్లో వీసా లేకుండా హ్యాపీగా తిరిగేయచ్చు