మంచి నిద్ర వల్ల ఆయుష్షు పెరుగుతుంది. మీరు ఆరోగ్యంగా ఉంటారు. కావల్సిందల్లా పద్ధతిగా నిద్రించడం. నిద్ర గురించిన కొన్ని చిన్నచిన్న విషయాలు తెలుసుకుని ఆ ప్రకారం నిద్రపోవడం వల్ల లాభాలున్నాయట. అవేమిటో తెలుసుకుందాం.
ఆహారం లాగే నిద్ర కూడా చాలా ముఖ్యమైన జీవక్రియ. ఇది తప్పించలేని దిన చర్య. నిద్రలేకుండా గడిచిన రోజు చాలా దుర్భరంగా ఉంటుంది. అయితే నిద్ర అందరికీ అంత సులభంగా పట్టదు. ఇలా నిద్ర పట్టకపోతే శరీరానికి తిరిగి శక్తి సంతరించుకునే అవకాశం ఉండదు. ఫలితంగా రకరకాల ఇబ్బందులు, సమస్యలే కాదు ఒక్కోసారి దీర్ఘకాలం పాటు నిద్ర సరిగా లేని వారు తగ్గించుకోలేని వ్యాధుల బారిన పడే ప్రమాదం కూడా ఉంటుంది. నిద్ర సరిగా లేకపోతే చికాకు వెంబడిస్తుంది. మెదడు పనితీరు మందగిస్తుంది. ఏకాగ్రత చెడిపోతుంది. దేని మీద మనసు నిలవదు. పనులు సమయానికి పూర్తి చెయ్యలేం. ఆకలి రుచెరగదు, నిద్ర సుఖమెరుగదు అని సామెత. అంటే చాలా ఆకలిగా ఉన్నవాడికి ఆహారం ఎంత రుచిగా ఉందనే ధ్యాస ఉండదు. అలాగే అలసి నిద్రపొయ్యే వాడికి ఎలాంటి చోట నిద్రపోతున్నామనే చింత ఉండదు అని. కానీ తినే ఆహారమయినా, విశ్రాంతిగా ఉండే నిద్రకయినా కొన్ని నియమాలు ఉంటాయి. ఆహారానికి ఉన్నంత ప్రాముఖ్యత నిద్రకు కూడా ఉంటుందని శాస్త్రం చెబుతోంది. అందుకే తగినంత నిద్ర పోవడం అవసరం. కొంత మంది అలా పడుకోగానే ఇలా నిద్రపోతారు. ఇలాంటి వారిని అదృష్టవంతులు అనవచ్చు. కానీ చాలా మంది నిద్ర పోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు కొన్ని నిద్రకు సంబంధించిన నియమాలు విధిగా పాటిస్తే త్వరగా నిద్ర పట్టేందకు అవకాశం ఏర్పడతుంది. మరి నిద్ర గురించి తెలుసుకుందామా?
నిద్రా నియమాలు
- ఖాళీగా లేదా మనుషులు కనిపించని ఇంట్లో ఒంటరిగా పడుకోకూడదు.
- దేవుడి గుడిలో లేదా స్మశానంలో కూడా నిద్రపోకూడదు
- నిద్ర నుంచి అకస్మాత్తుగా మేలుకోకూడదు
- విద్యార్థులు, పనివాళ్లు, కాపలాదారులు ఎక్కువ సమయం పాటు నిద్ర పోకూడదు.
- ఆరోగ్యంగా ఎక్కువకాలం జీవించాలని ఆశించే వారు బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవాలి.
- తడి పాదాలతో పక్కమీదకు చేరకూడదు. శుభ్రమైన పొడి పాదాలతో నిద్రించాలి.
- విరిగిన మంచంలో నిద్రపోకూడదు
- నగ్నంగా కూడా పడుకోకూడదు.
- తూర్పుదిక్కుగా తల పెట్టి నిద్రిస్తే జ్ఞానం, పడమర వైపు తలపెట్టి నిద్రిస్తే ఆందోళన, ఉత్తరం వైపు తలపెడితే నష్టం, మరణం, దక్షిణం వైపు తల ఉంచి నిద్రించడం వల్ల ఐశ్వర్యం, ఆయురారోగ్యాలు కలుగుతాయి.
- పగటి పూట నిద్ర తగదు. సూర్యోదయం లేదా సూర్యాస్తమయం వరకు పడుకునే వారు దరిద్రులు లేదా రోగులుగా మారుతారు.
- సూర్యుడు అస్తమించిన మూడు గంటల తర్వాతే నిద్రపోవాలి.
- ఎడమ వైపు తిరిగి పడుకుంటే ఆరోగ్యానికి మంచిది.
- పైకప్పుకు వేసిన వాసం లేదా పిల్లర్ కింద నిద్రించరాదు
- గుండెల మీద చెయ్యి వేసుకుని లేదా కాలుమీద కాలు వేసుకుని నిద్రపోకూడదు.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ఏబీపీ దేశం ఎలాంటి భాధ్యత తీసుకోవదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి విరాలు తెలుసుకోగలు. ఏబీపీ దేశం ఈ విషయాలను దృవీకరించడం లేదు.