Rice Water Benefits : రైస్​ వాటర్​లో అమినో యాసిడ్స్, B విటమిన్లు, విటమిన్ E, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి, జుట్టుకు మంచి పోషణ అందిస్తాయి. అందుకే ఆసియా దేశాల్లో తరతరాలుగా వీటిని తమ బ్యూటీ రొటీన్​లో భాగం చేసుకుంటున్నారు. క్రమం తప్పకుండా వాడితే వాటి ఉపయోగాలు మనం కూడా పొందవచ్చని చెప్తున్నారు నిపుణులు. అయితే రైస్​ వాటర్​ ఎలా ఉపయోగించాలో తెలిస్తే దాని ఫలితాలు అంత ఎఫెక్టివ్​గా పొందవచ్చో ఇప్పుడు చూసేద్దాం. 

రైస్ వాటర్ వల్ల కలిగే లాభాలు

రైస్ వాటర్​ రెగ్యులర్​గా ఉపయోగిస్తే చర్మం సహజంగా మెరుస్తుంది. మొటిమలు తగ్గి, పోర్స్ కంట్రోల్ అవుతాయి. అలాగే జుట్టు కుదుళ్లు బలపడతాయి. దీనివల్ల జుట్టు రాలడం తగ్గి, మెరుపు పెరుగుతుంది. 

రైస్ వాటర్ తయారీ.. 

అర కప్పు బియ్యాన్ని శుభ్రంగా కడిగి.. రెండు కప్పుల నీళ్లు వేసి 20 నుంచి 30 నిమిషాలు నానబెట్టాలి. ఇప్పుడు బియ్యాన్ని వడకట్టి.. నీటిని శుభ్రమైన గిన్నెలో స్టోర్ చేసుకోవాలి. అలాగే గంజిని కూడా ఈ ప్రయోజనాలకు ఉపయోగించవచ్చు. అన్నం వండి.. గంజిని వడకట్టి చల్లార్చుకోవాలి. ఇలా పక్కన పెట్టిన రైస్​ వాటర్​ను 24 గంటలు గది ఉష్ణోగ్రతలో ఉంచి.. తర్వాత ఫ్రిజ్‌లో పెట్టాలి. వాడే ముందు నీళ్లలో కలిపి పలుచగా చేసుకుని వాడాలి. 

చర్మానికి ఎలా వాడుకోవాలంటే.. 

ముఖం శుభ్రంగా కడిగిన తర్వాత.. కాటన్ ప్యాడ్‌తో రైస్ వాటర్ రాయాలి. 10 నిమిషాలు ఉంచి కడిగేస్తే టోనర్​గా పనిచేసి.. పోర్స్ తగ్గించి, చర్మం మెరిసేలా చేస్తుంది. ముఖం కడిగిన తర్వాత రైస్ వాటర్ చల్లుకుని, మెల్లగా మసాజ్ చేసి వాటర్​తో కడగాలి. వెంటనే తాజాగా మెరిసే అనుభవం కలుగుతుంది.

ఫేస్ మాస్క్​గా కూడా దీనిని ఉపయోగించవచ్చు. రైస్ వాటర్​కు అలోవెరా జెల్ లేదా మూల్తానీ మట్టి కలిపి ముఖానికి పట్టించాలి. 10 నుంచి 15 నిమిషాల తర్వాత కడగండి. దీనివల్ల చర్మం మృదువుగా మారి, నిగారింపు పెరుగుతుంది.

జుట్టుకు ఎలా ఉపయోగించాలంటే..

షాంపూ చేసిన తర్వాత, తలపై రైస్ వాటర్ పోసి మెల్లగా మసాజ్ చేయాలి. 5 నుంచి 10 నిమిషాలు ఉంచి నార్మల్ వాటర్​తో కడగండి. ఇలా చేస్తే జుట్టు బలంగా మారి మెరుపు వస్తుంది. రైస్ వాటర్​ను స్ప్రే బాటిల్లో నింపి.. కుదుళ్లపై స్ప్రే చేయండి. 15 నుంచి 20 నిమిషాలు హెయిర్ వాష్ చేస్తే కుదుళ్లకు పోషణ అందుతుంది. జుట్టు పెరుగుదల మెరుగవుతుంది.

రైస్ వాటర్​కు కొబ్బరి నూనె లేదా ఆముదం కొన్ని చుక్కలు కలిపి.. స్కాల్ప్, జుట్టుకు రాయండి. 20 నిమిషాలు ఉంచి కడిగితే.. పొడి చర్మం తగ్గి, జుట్టు రాలడం తగ్గుతుంది.

ఎన్నిసార్లు వాడాలి?

రైస్ వాటర్ వినియోగించాలంటే.. చర్మానికి వారంలో 3, 4 సార్లు.. జుట్టుకు 1–2 సార్లు వాడొచ్చు. అతిగా వాడితే చర్మం, జుట్టు పొడిబారవచ్చు. కాబట్టి మితంగా వాడితే మంచిది. ఎప్పుడూ ఫ్రెష్ రైస్ వాటర్ మాత్రమే వాడండి. ఫ్రిజ్‌లో పెడితే 3–4 రోజుల్లోపే వాడాలి. మొదటిసారి వాడే ముందు చేతిపై పాచ్ టెస్ట్ చేసుకోండి. పులిసినవి వాడితే.. నీళ్లతో పలుచన చేయాలి.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.