ఇలా నీళ్లలో వేస్తే అలా కరిగిపోతుంది చక్కెర, దీంతో స్వీట్లు చేయడం కూడా చాలా తేలిక. బెల్లంతో పోలిస్తే తీపి కూడా ఎక్కువ. అందుకే అందరూ పంచదారను వాడేందుకు ఇష్టపడతారు. పంచదారను ఎంత ఎక్కువగా వాడితే అంతగా మీరు అనారోగ్యాలకు దగ్గరవుతున్నట్టే. బెల్లాన్ని ముక్కలు చేసి, తురిమి, దాన్ని కరిగించి వంటలు చేసుకోవడం కష్టంగా అనిపిస్తుంది. అందుకనే దాన్ని పక్కన పడేసే వారు ఎక్కువ. కానీ మీకు ఆరోగ్యంగా జీవించాలంటే పంచదారను వదలాల్సిందేనని చెబుతున్నారు సెలెబ్రిటీ న్యూట్రిషనిస్టు రుజుతా దివేకర్. పంచదార స్థానాన్ని బెల్లంతీ భర్తి చేయాలని చెబుతున్నారు. బెల్లం తినడం వల్ల ఇనుము లభిస్తుంది. కానీ పంచదార తినడం వల్ల వచ్చే లాభాలు ఏమీ లేదని వివరిస్తున్నారు. 


తెలవారుతుండగానే టీలోనో, కాఫీలోనో చెంచా నిండా పంచదార కలుపుకుని తాగుతారు చాలా మంది. అందులో బెల్లం వేసుకుంటే బాగోదుగా అంటూ దీర్ఘాలు తీస్తారు. మీకు ఆరోగ్యం కావాలో, రుచి కావాలో మీరే తేల్చుకోండి. ఆరోగ్యం కావాలంటే పంచదార వాడకం తగ్గించి. గ్రీన్ టీ, అల్లం టీ, బ్లాక్ కాఫీ వంటివి తాగండి. వీలైతే కాఫీలో బెల్లం కలుపుకోండి. నిమ్మరసం ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ దాన్ని కూడా పంచదార కలిపి విషంలా మార్చుకుని తాగేస్తారు. దాని వల్ల మీకు రుచి బావుంటుంది కానీ లోపల్లోపల మీ శరీరాన్ని కుళ్లబొడిచేస్తుంది పంచదార. 


వచ్చే సమస్యలు ఇవే...
పంచదార రోజు వారీ వాడకం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు దీర్ఘకాలంలో బయటపడతాయి. హైబీపీ బారిన త్వరగా పడే అవకాశం ఉంది. అలాగే శరీరంలో ఇన్ ఫ్లమ్మేషన్ అంటే వాపులాంటివి ఎక్కువైపోతాయి. మీకు తెలియకుండా కొవ్వు పేరుకుపోయి బరువు పెరిగిపోతారు. ఇక డయాబెటిస్ వ్యాధి ఎలాగూ పొంచి ఉంటుంది. పంచదార తినడం వల్ల ఆ వ్యాధి చిన్న వయసులోనే వచ్చే అవకాశం ఉంది. కాలేయ వ్యాధులు వచ్చే అవకాశం కూడా పెరిగిపోతుంది. కాబట్టి చక్కెరను పక్కన పెట్టడం అన్ని విధాలుగా మంచిది. దీన్ని తినడం వల్ల మీకు వచ్చే పోషకాలు కూడా సున్నా. ఎందుకంటే దీన్ని అధికంగా ప్రాసెస్ చేసి తయారుచేస్తారు. ఆ ప్రాసెసింగ్లో ఇది అన్ని పోషకాలను కోల్పోతుంది. 


బెల్లాన్ని వాడితే
పంచదార బదులు బెల్లాన్ని వాడితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయితే అతిగా మాత్రం వాడకూడదు. రోజుకు చిన్న ముక్క తింటే చాలు. అది ఏరకంగా తినాలో మీపై ఆధారపడి ఉంటుంది. స్వీట్ల తయారీలో వాడతారో, లేక టీలో, కాఫీలో కలుపుకుంటారో మీ ఇష్టం. చెరకు రసాన్ని ఉడకబెట్టి బెల్లాన్ని తయారుచేస్తారు. ఇందులో కాల్షియం, మెగ్నిషియం, పొటాషియం, ఫాస్పరస్ వంటతి పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే పంచదార కన్నా బెల్లం బలమైనది. అన్నట్టు బెల్లం తినడం వల్ల వచ్చే కేలరీలు కూడా సున్నా. 


బెల్లాన్ని తింటే శరీరంలో ఉష్ణోగ్రత పుడుతుంది. కాబట్టి చలికాలంలో బెల్లం తినడం వల్ల చలి తక్కువగా వేస్తుంది. అదే వేసవిలో అధికంగా తింటే మాత్రం బయటి వేడి, ఒంట్లో వేడి కలిసి అనారోగ్యం పాలయ్యేలా చేస్తాయి. 


Also read: సమంతకున్న ఈ వ్యాధి ఎవరికైనా ఎప్పుడైనా రావచ్చు, ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త



గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.