నాన్ వెజ్ ప్రియులందరికీ కోడిగుడ్డు రెసిపీలంటే చాలా ఇష్టం. గుడ్డుతో అనేక రకాల వంటకాలు చేయచ్చు. చాలా తక్కువ సమయంలో గుడ్డు ఉడికేస్తుంది, అందుకే ఆమ్లెట్, కీమా ఇలా రకరకాలుగా గుడ్డును చేసుకుని తింటారు. ఎప్పుడు ఒకేలా తినడం బోరు కొడితే తందూరీ స్టైల్లో ఓసారి కోడిగుడ్డు వంటకాన్ని ప్రయత్నించండి.
కావాల్సిన పదార్థాలు
గుడ్లు - నాలుగు
పెరుగు - నాలుగు స్పూన్లు
శెనగపిండి - రెండు స్పూన్లు
నూనె - రెండు స్పూన్లు
కారం - అర స్పూను
నిమ్మరసం - ఒక స్పూను
చాట్ మసాలా - అర టీస్పూను
తందూరీ మసాలా - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
తయారీ ఇలా
1. గుడ్లు ఉడకబెట్టి పెంకులు తీసి పక్కన పెట్టుకోవాలి.
2. ఒక గిన్నెలో పెరుగు, శెనగపిండి, నిమ్మరసం, కారం, తందూరి మసాలా, ఉప్పు వేసి బాగా కలపాలి.
3.ఉడికించిన గుడ్లను సగానికి రెండు ముక్కలుగా చేసి పైన కలిపిన మిశ్రమంలో మారినేట్ చేయాలి.
4. గ్రిల్ పాన్‌లో ఒక స్పూను నూనె వేసి వేడి చేయాలి.
5. ఇప్పుడు ఆ పాన్‌లో మారినేట్ చేసిన గుడ్లను వేసి వేయించాలి.
6. ఓవెన్లో వండే వాళ్లు 180 డిగ్రీల సెల్సియస్ వద్ద పది నిమిషాల పాటూ గుడ్లను గ్రిల్ చేయాలి.
7. గుడ్లు బాగా వేగాక పైన చాట్ మసాలా, కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకోవాలి.
కోడిగుడ్డు లాభాలు....
రోజుకో కోడి గుడ్డు తినడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా? మనిషికి అత్యవసరమైన తొమ్మిది ప్రొటీన్లు కలిగిన ఏకైవ పదార్థం గుడ్డు. ఒక్క గుడ్డు తింటే మీకు శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు అందుతాయి. అందుకే దీన్ని సంపూర్ణ ఆహారం అని పిలుస్తారు. ఏడాదికి ఒక మనిషి 320 గుడ్లు దాకా తినవచ్చు. అంటే వారాంలో అయిదు రోజులు రోజుకో గుడ్డు తినవచ్చన్నమాట. కోడి గుడ్డు రోజూ తినడం వల్ల ఐసోమిక్ స్ట్రోక్ వచ్చే అవకాశం 50 శాతం, కార్డియాక్ అరెస్టు వచ్చే అవకాశం 80 శాతం, కార్డియోవాస్కులర్ వ్యాధులు వచ్చే అవకాశం 75 శాతం తగ్గుతాయి. మహిళలకు గుడ్డు ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని తెల్లసొన తినడం వల్ల రొమ్ము క్యాన్సర్ రాకుండా ఉంటుంది. గుడ్డును క్రమం తప్పకుండా తీసుకునే వారు, తినని వారితో పోలిస్తే 44 శాతం క్యాన్సర్ బారిన పడకుండా ఉండే అవకాశం ఉంది. గుడ్డును ఏ రూపంలో తీసుకుంటే ఎక్కువ లాభాలు కలుగుతాయో తెలుసా? ఉడికించిన గుడ్డును తినడం వల్ల సంపూర్ణంగా లాభాలు శరీరానికి అందుతాయి. గుడ్డు పచ్చసొనలో ఉండే కొలిన్ అనే పోషకం వల్ల మెదడుకు చాలా మేలు జరుగుతుంది. మూడేళ్ల వయసు దాటిని పిల్లలకు కచ్చితంగా రోజుకో ఉడికించిన గుడ్డు తినడం అలవాటు చేయడం చాలా మంచిది.
Also read: మేనరికపు పెళ్లిళ్లు ఎందుకు వద్దని చెబుతున్నారు? పిల్లల్లో అవకరాలు కచ్చితంగా వస్తాయా?