Nellore Fish Curry Recipe :హైదరాబాద్ బిర్యానీ, కాకినాడ కాజా, తాపేశ్వరం పూత రేకులు.. ఇలా ఒక్కో ప్రాంతానికి ఒక్కో ఫుడ్ ఐటమ్ ఫేమస్. నెల్లూరుకి వచ్చే సరికి ఇక్కడ చేపల పులుసు ఫేమస్. ఆసలు ఆ పేరే నెల్లూరు చేపల పులుసు అంటూ ఓ బ్రాండ్ లాగా ఉండిపోయింది. హైదరాబాద్ అయినా, బెంగళూరు అయినా, చెన్నై అయినా, ఆఖరికి ఢిల్లీ వెళ్లినా కూడా పెద్ద పెద్ద హోటల్స్ లో నెల్లూరు చేపల పులుసు స్పెషల్ అట్రాక్షన్. అసలు నెల్లూరు చేపల పులుసు అంత ఫేమస్..?
చేపలు అన్ని ప్రాంతాల్లో దొరుకుతాయి. చేపల పులుసు, చేపల వేపుడు.. ఇలా రకరకాల వంటకాలు అందరూ చేస్తారు. కానీ నెల్లూరు చేపల పులుసు మాత్రమే ఎందుకంత ఫేమస్. దీనికి ప్రధాన కారణం ఇక్కడ పెట్టే పులుసు. పులుసు కలుపుకొనే విధానం. మిగతా ప్రాంతాలకంటే ఇక్కడ పులుసులో ఎక్కువ చింతపండు వాడతారు, అది కూడా ఎర్ర చింతపండునే ఎక్కువగా వినియోగిస్తారు. ఇక పులుసు బాగా మరిగే వరకు చేప ముక్కలను అందులో వేయరు. ఇలాంటి కారణాలతో నెల్లూరు చేపల పులుసు ప్రత్యేకంగా మారింది.
కట్టెల పొయ్యిపై వంట
కట్టెల పొయ్యిపై వండిన వంటకు, గ్యాస్ పై వండిన వంటకు చాలా తేడా ఉంటుంది. నెల్లూరులోని హోటల్స్ లో చేపల పులుసు తయారీకి కట్టెల పొయ్యినే వాడతారు. అలా చేస్తేనే చేపల పులుసుకి ఆ టేస్ట్ వస్తుందని చెబుతుంటారు వంట మాస్టర్లు. ఒకరోజు గడిస్తే నెల్లూరు చేపల పులుసుకి రుచి మరింత పెరుగుతుందని, అందుకే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై.. ఇలా ఇతర ప్రాంతాలకు ఇక్కడినుంచి పార్శిల్స్ పంపిస్తుంటామని చెబుతుంటారు.
నెల్లూరు నుంచి ప్రయాణాలు పెట్టుకున్న ఎవరైనా.. మధ్యాహ్నం వేళ నెల్లూరు దాటి వెళ్తుంటే కచ్చితంగా ఇక్కడ ఆగి చేపల పులుసు రుచి చూసి వెళ్తుంటారని చెబుతున్నారు హోటల్స్ నిర్వాహకులు. రకరకాల చేపల ఐటమ్స్ నెల్లూరులో మాత్రమే దొరుకుతాయని చెబుతుంటారు.
పులుసులో చింతపండు ఎక్కువగా వాడటంతోపాటు, పులుసు పెట్టే విధానం కూడా ప్రత్యేకంగా ఉంటుంది కాబట్టే నెల్లూరు చేపల పులుసు అన్నిచోట్లా ఫేమస్ అయింది. అయితే ఇతర ప్రాంతాల్లోని హోటళ్లలో నెల్లూరు చేపల పులుసు పేరుతో వంటకాలు లభిస్తాయే కానీ, అసలైన టేస్ట్ చూడాలంటే మాత్రం నెల్లూరు రావాల్సిందే.
చేపల పులుసు అదుర్స్
నెల్లూరులో నాన్ వెజ్ ఐటమ్స్ లభించే ప్రతి హోటల్ లో దాదాపు ఐదారు రకాల చేపల వెరైటీలు అందుబాటులో ఉంటాయి. ప్రత్యేకంగా ప్రతిరోజూ ఏ వెరైటీ ఉంటుందో బయట బోర్డ్ పెట్టి మరీ ఆకట్టుకుంటారు. అందులో చేపల పులుసు మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. నెల్లూరు చేపల పులుసు అసలైన టేస్ట్ తెలుసుకోవాలంటే మాత్రం అది నెల్లూరులోనే సాధ్యం. నెల్లూరు బ్రాండ్ పేరుతో ఇతర ప్రాంతాల్లో లభించే చేపల కూర ఆ టేస్ట్ రాదు. నెల్లూరు హోటల్స్ లో మాత్రం చేపల పులుసు అదిరిపోతుందందే.
Also Read : Sweet Recipe: పిల్లలకు నచ్చేలా పాలబూరెలు, చిటికెలో చేసేయండిలా
Also Read : Mutton Dosa: టేస్టీ మటన్ దోశ, చేయడం చాలా సింపుల్