Homemade Burfi : మీకు బర్ఫీ అంటే ఇష్టమా? అయితే వీటికోసం షాప్​కెళ్లి తెచ్చుకోవాల్సిన పనిలేదు. ఇంట్లోనే తేలికగా చేసుకుని.. ఇంటిల్లిపాది ఆస్వాదించవచ్చు. పైగా రుచిలో మీకు మంచి అనుభూతిని అందించేందుకు దీనిని మనం పాలపొడితో చేసుకుంటాము. అదేంటి పాలపొడితో బర్ఫీ చేయడమేంటి అనుకుంటున్నారా? అయితే అస్సలు కంగారు పడకండి. దీనితో బర్ఫీని చాలా తేలికగా చేయవచ్చు. మరి ఈ టేస్టీ రెసిపీని ఎలా చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 


కావాల్సిన పదార్థాలు 


పాల పొడి - రెండు కప్పులు


నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు


పాలు - 1 కప్పు(ఫ్యాట్ మిల్క్)


పంచదార పొడి - 8 టేబుల్ స్పూన్లు 


యాలకుల పొడి - పావు టీస్పూన్


తయారీ విధానం


ఈ స్వీట్ తయారు చేయడానికి మందంగా ఉండే నాన్​స్టిక్ పాన్​ని లేదా మందపాటి కడాయిని తీసుకోవాలి. స్టౌవ్ వెలిగించి.. దానిపై పాన్​ పెట్టి దానిలో పాలు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి. మంటను సిమ్​లో ఉంచి.. పాలను కాస్త మరగనివ్వాలి. దానిలో రెండు కప్పుల పాల పొడిని వేసి బాగా కలపాలి. ఉండలు లేకుండా.. పాలపొడి.. పాలల్లో పూర్తిగా కలిసేలా కలుపుకోవాలి. పాలల్లో నెయ్యి వేయడం వల్ల పిండి త్వరగానే కలిసిపోతుంది. 


ఇప్పుడు స్టౌవ్ మంటన్ మీడియంలో ఉంచి.. పాలపొడిని ఉడకనివ్వాలి. పాన్​కి అతుక్కోకుండా.. పాలు చిక్కగా మారేవరకు.. మిశ్రమాన్ని కలుపుతూ ఉండాలి. ఇలా పది నిమిషాలు అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మంటను తగ్గించి.. దానిలో మరో టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి. ఇది పూర్తిగా మిశ్రమంలో కలిసేలా మిక్స్ చేయాలి. అనంతరం పిండి బాగా దగ్గరయ్యేవరకు కలుపుతూ ఉండాలి. చలివిడి మాదిరిగా పిండి మారుతుంది. ఇలా మారిన పిండిని.. పూర్తిగా చల్లారనివ్వాలి. 


అనంతరం చేతులకు కాస్త నెయ్యి రాసుకుని.. పిండిని కొద్దిగా చేతిలోకి తీసుకుని ఉండగా చుట్టాలి. చేతికి అంటకుండా పిండి బాల్​గా అయిపోతే పూర్తిగా ఉడికినట్టు.. చేతికి అంటుకుంటే మరోసారి స్టౌవ్ మీద పెట్టి ఉడికించాలి. ఇలా సిద్ధం చేసుకున్న పిండిని4 టేబుల్ స్పూన్స్ లేదా మీ రుచికి తగినంత తీసుకుని మిశ్రమంలో వేయాలి. యాలకుల పొడిని కూడా వేసి.. అన్ని కలిసేలా బాగా కలపాలి. పిండిని చపాతీ ముద్దలగా చేసుకుని.. ఓ 5 నిమిషాలు పక్కన పెట్టేయాలి. 



ఇప్పుడు పిండిని బటర్ పేపర్ మీద లేదా చపాతీ పీటపై కవర్ వేసి.. దానిపై పిండిని ఉంచాలి. పిండిని సమానంగా ఒత్తుకోవాలి. దానిపై బాదం, జీడిపప్పు, పిస్తా పలుకులు వేసుకోవాలి. మరోసారి చపాతీ కర్రతో బర్ఫీని ఒత్తాలి. ఇలా చేసుకున్న పిండిని రెండు గంటలు పక్కన ఉంచి.. అనంతరం నచ్చిన షేప్​లలో కట్ చేసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ మిల్క్ పౌడర్ బర్ఫీ రెడీ. వీటిని బయటే ఉంచితే 4 రోజులు నిల్వ ఉంటాయి. ఫ్రిజ్​లో పెడితే రెండు వారాల వరకు ఉంటాయి. 


Also Read : బూందీ లడ్డూలను ఇలా చుట్టేయండి.. ఈ టిప్స్ ఫాలో అయితే వారంపైగా నిల్వ ఉంటాయి