Dondakaya Ulli Karam Recipe for Lunch Box : దొండకాయలను ఫ్రై, కర్రీల రూపంలో చేసుకుంటారు. కొందరు దీనిని తినేందుకు ఇష్టపడరు. అయితే లంచ్ సమయంలో దొండకాయను టేస్టీగా తినాలనుకుంటే దొండకాయ ఉల్లికారం చేసుకోవాలి. ఇది మంచి రుచిని అందించడమే కాకుండా లంచ్​కి పర్​ఫెక్ట్ కాంబినేషన్ అవుతుంది. దీనిని నేరుగా రోటీలు, రైస్​లలో కలిపి తినవచ్చు. లేదంటే పప్పు చారు, సాంబార్ చేసుకున్నప్పుడు సైడ్ డిష్​గా చేసుకోవచ్చు. మరి ఈ టేస్టీ రెసిపీని ఎలా చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటి వంటి విషయాలు ఇప్పుడు చూసేద్దాం.


కావాల్సిన పదార్థాలు 


దొండకాయలు - పావు కేజీ


నూనె - 4 టేబుల్ స్పూన్స్


జీలకర్ర - 1 టీస్పూన్


ధనియాలు - 1 టీస్పూన్


ఎండుమిర్చి - 10


ఉల్లిపాయ - 1 పెద్దది


పసుపు - అర టీస్పూన్ 


ఉప్పు - రుచికి తగినంత 


వెల్లుల్లి - 5 రెబ్బలు 


కరివేపాకు - 1 రెబ్బ


చింతపండు రసం - 2 టేబుల్ స్పూన్స్


తయారీ విధానం


ముందుగా దొండకాయలను బాగా కడిగి ముచుకులు తీసి.. నచ్చిన షేప్​లో కట్ చేసుకోవాలి. గుత్తివంకాయ మాదిరిగా కూడా వీటిని కట్ చేసుకుని ఈ రెసిపీని చేసుకోవచ్చు. అనంతరం ఉల్లిపాయను పెద్ద ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి కడాయి పెట్టండి. దానిలో ఓ స్పూన్ నూనె వేసి.. దానిలో జీలకర్ర, ధనియాలు వేసి వేయించాలి. అవి కాస్త వేగిన తర్వాత దానిలో ఎండుమిర్చి వేయాలి. అనంతరం ఉల్లిపాయలు వేసి వాటిని కాసేపు మగ్గనివ్వాలి. 


ఉల్లిపాయలు పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదు. కాస్త మగ్గితే సరిపోతుంది. ఇలా వేయించుకున్న మిశ్రమాన్ని కాసేపు చల్లారనివ్వాలి. ఈలోపు స్టౌవ్ వెలిగించి మందపాటి కడాయి పెట్టి దానిలో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు నూనె వేయాలి. దానిలోనే కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసి మూతపెట్టి మగ్గనివ్వాలి. కాసేపటి తర్వాత దానిలో కాస్త ఉప్పు, పసుపు వేసి కలపి.. ముక్కలని ఉడకనివ్వాలి. 


మిక్సీజార్​లోకి ఉల్లిపాయల మిశ్రమాన్ని తీసుకోవాలి. దానిలో కాస్త ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసి పేస్ట్ చేసుకోవాలి. మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా చేసుకోవాలి. దొండకాయలు ఉడికినవో లేదో చెక్ చేసుకోవాలి. లేత దొండకాయలు త్వరగా ఉడుకుతాయి. మంచి రుచిని ఇస్తాయి కాబట్టి.. అలాంటివి ఎంచుకుంటే మంచిది. దొండకాయలు ఉడికిన తర్వాత దానిలో మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లికారం వేయాలి. దొండకాయలకు ఉల్లికారం పట్టేలా బాగా కలపాలి. 



ఈ మిశ్రమాన్ని రెండు నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు దానిలో చింతపండు రసాన్ని వేసి ఉడకనివ్వాలి. దానిలో కరివేపాకు కూడా వేసి కలపాలి. ఇది పూర్తిగా ఆప్షనల్. వేసుకోకపోయినా పర్లేదు. కానీ వేసుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది. ఓ 5 నిమిషాలు ఉడికితే దానిలోని నూనె కాస్త పైకి తేలుతుంది. ఇలా నూనె పైకి వచ్చేస్తే దొండకాయ ఉల్లికారం రెడీ అయిపోయినట్టే. దీనిని మీరు రోటీలు, రైస్​లకు కాంబినేషన్​గా తీసుకోవచ్చు. దొండకాయను ఇష్టపడనివారికి కూడా ఇది బాగా నచ్చుతుంది. మీరు కూడా ఈ టేస్టీ రెసిపీని లంచ్ రెసిపీగా వాడుకోవచ్చు. 


Also Read : టేస్టీ మైసూర్ బోండా రెసిపీ.. ఈ టిప్స్​తో పిండి ముద్దలుగా రాదు, నూనె ఎక్కువ పీల్చదు