క్రిస్‌మస్ అంటే గుర్తొచ్చేది కేకులు, పేస్ట్రీలే. వాటిని అందరూ ఆర్డర్ ఇచ్చి తెచ్చుకుంటారు. కానీ పండుగకు ఇంట్లోనే కేకు చేసుకుంటే ఆ టేస్టే వేరు. కేకు చేయడం రాదు అనుకోకండి, చేయడం చాలా సులువు. కేకు మిశ్రమాన్ని కలపడం వస్తే చాలు... మిగతాదంతా ఎంతో సింపుల్. ఆ మిశ్రమాన్ని ఓవెన్ లేదా, కుక్కర్లో పెడితే చాలు. కేకు రెడీ అయిపోతుంది.


కావాల్సిన పదార్థాలు
రాగి పిండి - ముప్పావు కప్పు
గోధుమ పిండి - ముప్పావు కప్పు
కోకో పొడి - పావు కప్పు
పంచదార - అరకప్పు
వెనిల్లా ఎసెన్స్ - పావు స్పూను
బేకింగ్ పొడి - ఒకటిన్నర స్పూను
పాలు - ఒకటిన్నర కప్పు
బేకింగ్ సోడా - అర స్పూను
డార్క్ చాక్లెట్ - పెద్దది ఒకటి
బటర్ - అర కప్పు
బాదం పప్పులు - గుప్పెడు
ఉప్పు - చిటికెడు 


తయారీ ఇలా
1. రాగి పిండి, గోధుమ పిండి, కోకో పొడి ఒక గిన్నెలో వేసి బాగా కలపాలి. 
2. అందులోనే పంచదార, బేకింగ్ పొడి, బేకింగ్ సోడా, ఉప్పు వేసి కలపాలి.
3. ఆ మిశ్రమంలో పాలు, బటర్, వెనిల్లా ఎసెన్స్ వేసి బాగా గిలక్కొట్టాలి. 
4. ఇప్పుడు కేకు మౌల్డ్‌లో వెన్న రాసి కాస్త పిండిని చల్లి అందులో కేకు మిశ్రమాన్ని మొత్తం వేయాలి. గాలి బుడగలు లేకుండా నేలపై ఆ మౌల్డ్‌ని మెల్లగా తట్టాలి. 
5. ఓవెన్ ఉన్న వాళ్లు దాన్ని 180 డిగ్రీల వరకు ప్రీహీట్ చేసి తరువాత ఈ మౌల్డ్‌ని లోపల పెట్టాలి. 
6. దాదాపు నలభై నిమిషాలు ఉంచితే కేకు సిద్ధమైపోతుంది. 


ఓవెన్ లేకపోతే...
ఓవెన్ లేకపోయినా కూడా కుక్కర్లో కేకును చేసుకోవచ్చు. 
1. కుక్కర్ అడుగు భాగంలో మెత్తటి ఇసుక లేదా రాళ్ల ఉప్పు వేయాలి. మూత పెట్టి ప్రీ హీట్ చేసుకుంటే మంచిది. 
2. తరువాత మూత తీసి కేకు మౌల్డ్‌ను అందులో పెట్టి, కుక్కర్ మూత పెట్టేయాలి. 
3. దాదాపు నలభై నిమిషాల పాటూ చిన్న మంట మీద ఉడికించాలి. 
4. ఒక సన్నని టూత్ పిక్ తో గుచ్చితే, దానికి ఏమీ అతుక్కోకుండా వస్తే కేకు రెడీ అయినట్టే. 
5. ఇప్పుడు కేకు చల్లారక తీసి ఒక ప్లేటులో వేయాలి. 


గార్నిష్ కోసం... 
1. బాదం పప్పులను సన్నగా తరుక్కోవాలి. 
2. ఒక గిన్నెలో చాక్లెట్ ముక్కలు, కాస్త పాలు లేదా ఫ్రెష్ క్రీమ్ వేసి చిన్న మంట మీద నెమ్మదిగా కలపాలి. చాక్లెట్ పూర్తిగా కరుగుతుంది. 
3. ఆ కేకుపై కరిగిన చాక్లెట్‌ను పోయాలి. పైన బాదం పప్పును చల్లుకోవాలి. లేదా పండ్ల ముక్కలను వేసుకోవచ్చు. జెమ్స్ వంటి రంగురంగుల చాక్లెట్ బిళ్లలను వేసుకోవచ్చు. గార్నిషింగ్ అనేది మీ ఇష్టం. 


ఈ కేకులో రాగులు ఉన్నాయి. రాగి పిండి ఎంతో ఆరోగ్యకరం. ఎముకలకు మేలు చేస్తాయి. కాల్షియం పుష్కలంగా ఉంది. ఐరన్ లోపం ఉన్న వారికి రాగి తింటే రక్త హీనత సమస్య దూరమవుతుంది. ముఖ్యం మధుమేహం ఉన్న వారికి రాగి పిండి చాలా మేలు చేస్తుంది. 


Also read: ప్రొటీన్ పొడిని ఇలా ఇంట్లోనే తయారుచేసుకోండి, రోజూ తాగితే ఎంతో బలం