Ramadan Special Hyderabadi Chicken Biryani : బిర్యానీల్లో హైజరాబాద్ బిర్యానీకి ఉండే క్రేజే వేరు. పైగా రంజాన్ సమయంలో దీనిని చాలామంది ఇష్టంగా తింటారు. మరి ఈ హైదరాబాద్ బిర్యానీని రంజాన్ సందర్భంగా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్​లో ఎలా చేసుకోవాలో.. కావాల్సిన పదార్థాలు ఏంటో.. ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటో.. ఎలా తయారు చేస్తే రుచి మంచిగా వస్తుందో ఇప్పుడు చూసేద్దాం. 

కావాల్సిన పదార్థాలు

చికెన్ - 1 కేజీ

వెల్లుల్లి - 10 రెబ్బలు

అల్లం - 2 అంగుళాలు

పచ్చిమిర్చి - 3

కారం - 1.5 టీస్పూన్

పసుపు - 1 టీస్పూన్

ఉప్పు - 2 టీస్పూన్లు

యాలకు పొడి - 1 టీస్పూన్

గరం మసాల - అర టేబుల్ స్పూన్ 

నిమ్మకాయ - 1

కొత్తిమీర, పుదీనా తురుము - గుప్పెడు

షాజీరా - 1 టీస్పూన్

లవంగాలు - 5

యాలకులు - 5 

దాల్చిన చెక్క - 2

ఫ్రైడ్ ఆనియన్స్ - 2 

పెరుగు - 400 గ్రాములు

నూనె - 1 కప్పు 

గోరువెచ్చని పాలు- పావు కప్పు

కుంకుమ పువ్వు - కొంచెం 

చికెన్ మ్యారినేషన్ కోసం.. 

అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చిని పేస్ట్​గా చేసుకోవాలి. అనంతరం చికెన్​ను కడిగి మిక్సింగ్​ బౌల్​లోకి తీసుకుని ఈ పేస్ట్​ వేయాలి. కారం, పసుపు, ఉప్పు, యాలకుల పొడి, గరం మసాల, నిమ్మకాయ రసం, కొత్తిమీర, పుదీనా తురుము, షాజీరా, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ఫ్రైడ్ ఆనియన్స్, పెరుగు, నూనె వేసి బాగా కలుపుకోవాలి. పాలల్లో కుంకుమ పువ్వు వేసి నానిన తర్వాత దానిని కూడా ఈ చికెన్​లో వేసి బాగా కలపాలి. ఇలా కలిపిన చికెన్​ను మారినేషన్​ కోసం కనీసం 3 గంటలు పక్కన పెట్టుకోవాలి. 

బిర్యానీ రైస్ కోసం కావాల్సిన పదార్థాలు 

బాస్మతి రైస్ - 1 కేజీ

నీళ్లు - 4 లీటర్లు

ఉప్పు - 3 టేబుల్ స్పూన్లు

షాజీరా - 1 టీ స్పూన్

లవంగాలు - 5

యాలకులు - 5

దాల్చిన చెక్క - 2

నిమ్మకాయ - 1/2

నూనె - 2 టేబుల్ స్పూన్లు

కొత్తిమీర - పుదీనా - గుప్పెడు

తయారీ విధానం

ముందుగా బియ్యాన్ని కడిగి బిర్యానీ చేసే గంట ముందు నానబెట్టుకోవాలి. బియ్యం నానిన తర్వాత స్టౌవ్ వెలిగించి దానిపై పెద్ద గిన్నె పెట్టి దానిలో నీళ్లు వేయాలి. దానిలో ఉప్పు, షాజీరా, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, నిమ్మరసం, నూనె, కొత్తిమీర, పుదీనా తురుము వేసి మరగనివ్వాలి. ఇప్పుడు దానిలో నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. ఇప్పుడు బియ్యంలోని ఒక కప్పు నీటిని తీసిని.. మారినేట్ చేసి పెట్టుకున్న చికెన్​లో వేయాలి. 

బిర్యానీ తయారీ.. 

స్టౌవ్ వెలిగించి.. పెద్దగా, మందపాటిగా ఉన్న గిన్నెలో చికెన్ వేయాలి. మారినేట్ చేసిన చికెన్​ను లేయర్​గా పరిచి.. దానిపై 60 శాతం ఉడికిన రైస్ వేయాలి. తర్వాత 80 శాతం ఉడికిన రైస్​ని లేయర్​గా వేయాలి. గరం మసాల, కుంకుమ పువ్వు, ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, కాస్త నెయ్యిని పైన వేయాలి. ఇప్పుడు బిర్యాని గిన్నెను ఫోయిల్​తో సీల్ చేయాలి. దానిపై మూత ఉంచి.. బరువుగా ఉండే వస్తువును ప్లేస్ చేయాలి. 

ముందు 5 నిమిషాలు మంటను ఎక్కువగా ఉంచి కుక్ చేయాలి. తర్వాత 30 నుంచి 40 నిమిషాలు తవా మీద పెట్టి.. తక్కువ మంట మీద ఉడికించుకోవాలి. అనంతరం స్టౌవ్ ఆపేసి.. బిర్యానీ 5 నుంచి పది నిమిషాలు పక్కన ఉంచండి. తర్వాత ఓపెన్ చేస్తే హైదరాబాద్ చికెన్ బిర్యానీ రెడీ. ఈ రంజాన్ సందర్భంగా ఇంటిల్లిపాదీ దీనిని చేసుకుని తినేయొచ్చు. లేదా మీ స్పెషల్ అకేషన్ సమయంలో హైదరాబాద్ స్పెషల్ చికెన్​ బిర్యానీని తయారు చేసుకోవచ్చు.