ఆర్ఆర్ఆర్ సినిమా అంతర్జాతీయ స్థాయిలో గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ వంటి కార్యక్రమాల్లో మెరిసింది. ముఖ్యంగా ఆ సినిమాలో నాటు నాటు పాట సూపర్ హైలైట్ అయింది. ఆ పాటకే గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా వచ్చింది. ఆ పాట గురించి మాట్లాడుతూ రామ్ చరణ్ ఒక విషయం చెప్పారు. పాట కోసం 6 రోజులపాటు రిహార్సల్స్ చేశామని, అందులో ఆ ఆరు రోజుల్లోనే తాను నాలుగు కిలోల బరువు తగ్గానని చెప్పారు. బరువు పెరిగినవాళ్లు ఆ బరువు తగ్గడం కోసం ఎన్నో నెలలపాటు కష్టపడతారు. వాకింగ్ చేస్తారు. జిమ్ కి డబ్బులు పోస్తారు.  కానీ కేవలం డాన్స్ చేయడం ద్వారా ఆరు రోజుల్లోనే నాలుగు కిలోలు బరువు తగ్గడం అంటే మామూలు విషయం కాదు. బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు డాన్స్ చేయడం ద్వారా మంచి ఫలితాలు అందుకోవచ్చని రామ్ చరణ్ చెప్పిన విషయాన్ని బట్టి అర్థమవుతుంది.


ఆరోగ్య నిపుణులు చెబుతున్న ప్రకారం డ్యాన్స్ ద్వారా అధిక బరువు త్వరగా తగ్గొచ్చు. ఇవి మీ కండరాల బలాన్ని పెంచడమే కాదు, క్యాలరీలను కూడా త్వరగా బర్న్ చేస్తాయి. అందుకే బరువు త్వరగా తగ్గుతారు. అధిక బరువు తగ్గాలంటే డాన్స్ ని మించిన  మంచి ఉపాయం మరొకటి లేదు. ఇవి కండరాలను టోన్ చేస్తాయి కూడా. 


డ్యాన్స్ వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు
1. స్టామినాను పెంచుతుంది. 
2. చురుగ్గా శరీరం కదిలేలా చేస్తుంది. 
3. శరీరం అంతటా రక్తప్రసరణ సవ్యంగా జరిగేలా చూస్తుంది. 
4. రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తుంది.
5. నిద్రలేమి వంటి సమస్యలను నయం చేస్తుంది. 
6. ఒత్తిడి, డిప్రెషన్ వంటివి రాకుండా చూస్తుంది. 
7. మధుమేహం, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.


ఎన్ని క్యాలరీలు?
డ్యాన్స్ లో చాలా రకాలు ఉన్నాయి. ఒక్కో రకం డ్యాన్స్ వల్ల ఒక్కో రకంగా క్యాలరీలను బర్న్ అవుతాయి. హెల్త్ లైన్ చెప్తున్న ప్రకారం ఒక అరగంట పాటు డ్యాన్స్ చేయడం వల్ల ఎన్ని కేలరీలు కరుగుతాయో ఆ డ్యాన్స్ రకాన్ని బట్టి చెప్పొచ్చు. 
బ్యాలెట్ డ్యాన్స్ - 179 క్యాలరీలు 
బాల్ రూమ్ డ్యాన్స్ - 118 క్యాలరీలు 
సల్సా - 143 క్యాలరీలు 
స్వింగ్ - 207 క్యాలరీలు 
కంట్రీ వెస్ట్రన్ లైన్ డాన్స్ - 172 క్యాలరీలు


మీరు కూడా బరువు త్వరగా తగ్గాలి అనుకుంటే, రోజులో మీకు నచ్చిన డాన్స్ ను ఒక అరగంట పాటు చేయండి చాలు. కేవలం రెండు వారాల్లోనే మీ బరువు చాలా వరకు తగ్గుతుంది. 


Also read: మిస్ యూనివర్స్ పోటీలో భారతీయ అందం దివితా రాయ్, ఎవరీమె?















గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.