Rajahmundry Milk Adulteration Scare : ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో కల్తీ పాల ఘటన తీవ్ర సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో చాలామందిలో ఆందోళన పెరిగింది. ఎందుకంటే పాలు రోజువారీ ఆహారంలో ఓ ముఖ్యమైన భాగం పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ వీటిని తీసుకుంటారు. కేవలం పాలుగానే కాకుండా టీ, కాఫీలు అలాగే ఇతర వంటకాల్లో పాలు వినియోగిస్తారు. పాలను ఇలా ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఎక్కువమందిలో ఆందోళన పెరిగింది. 

Continues below advertisement

మనం తాగే పాలు మంచివా? కాదా? అనే చర్చ మొదలైంది. ఎందుకంటే కల్తీ పాలు తాగితే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఉండొచ్చు. ముఖ్యంగా కిడ్నీల(Milk Adulteration Effect on Kidney)పై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే దీని గురించిన కచ్చితమైన అవగాహన ఉండాలని అంటున్నారు నిపుణులు. అసలు కల్తీ పాలు అంటే ఏంటి? వీటి ప్రభావం కిడ్నీలపై ఏ విధంగా ఉంటుందో చూసేద్దాం. 

కల్తీ పాలు అంటే..

పాలల్లో నీరు కలపడమే కల్తీపాలు అనుకుంటారు. అయితే దీనివల్ల ఎక్కువ ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో అధిక లాభాల కోసం పాలల్లో డిటర్జెంట్లు, యూరియా, స్టార్చ్, సింథటిక్ కెమికల్స్ కూడా కలుపుతారు. ఈ తరహా ఘటనలు ఇప్పటికే చాలా బయటపడినట్లు అధికారులు చెబుతున్నారు. ఇవి పాల సహజ గుణాలను మార్చి ఆరోగ్యానికి ప్రమాదం కలిగిస్తాయి.

Continues below advertisement

కిడ్నీలపై కల్తీ పాల ప్రభావం..

కిడ్నీలు శరీరంలోని టాక్సిన్స్‌ను ఫిల్టర్ చేసే ప్రధాన అవయవాలు. కానీ కల్తీ పదార్థాలు ఎక్కువ కాలం శరీరంలోకి వెళ్తే కిడ్నీలపై అదనపు ఒత్తిడి పడుతుంది. కల్తీపాలల్లో ఉపయోగించే కొన్ని కెమికల్స్ కిడ్నీలపై ప్రభావం చూపిస్తాయి.

యూరియా ప్రభావం

పాలల్లో యూరియా కలిపితే ప్రోటీన్ లెవల్స్ ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ యూరియా అధికంగా శరీరంలోకి వెళ్తే కిడ్నీలపై భారం పెరుగుతుంది. దీర్ఘకాలంలో కిడ్నీ ఫంక్షన్ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.

డిటర్జెంట్ 

డిటర్జెంట్ కలిసిన పాలు తాగితే జీర్ణవ్యవస్థ సమస్యలతో పాటు టాక్సిక్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఇవి రక్తంలోకి వెళ్లి కిడ్నీలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు.

సింథటిక్ కెమికల్స్

కొన్ని రసాయనాలు శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోయేలా చేస్తాయి. కిడ్నీలు వాటిని బయటకు పంపడానికి ఎక్కువగా పని చేయాల్సి వస్తుంది.

కల్తీ పాల లక్షణాలు ఏమిటంటే..

పాలు కల్తీవైనప్పుడు శరీరం కొన్ని లక్షణాలు ఇస్తుంది. వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, అలసట, మూత్ర విసర్జనలో మార్పుల వంటి లక్షణాలు చూపిస్తుంది. కొన్ని సీరియస్ కేసుల్లో కాళ్ల వాపు కూడా కనిపిస్తుంది. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

పాలు కొనేప్పుడు నమ్మకమైన బ్రాండ్ లేదా డెయిరీ నుంచి మాత్రమే కొనుక్కోవాలి. పాల వాసన, రుచి మార్పులు ఉంటే వాడకూడదు. పిల్లలకు పాలు ఇచ్చే ముందు మరిగించి ఇవ్వాలి. అయితే కల్తీ పాలు ఒక్కరోజులోనే కిడ్నీ ఫెయిల్యూర్‌కు కారణం కావని.. కానీ దీర్ఘకాలంగా తీసుకుంటే అవయవాలపై ఒత్తిడి పెరిగి సమస్యలు రావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా పాలను ఎంచుకోవాలని సూచిస్తున్నారు.