Rainy Season Driving Tips : వర్షాకాలంలో ఆఫీసుకు వెళ్లడం ఉద్యోగులకు పెద్ద సవాలుగా మారుతుంది. తడి రోడ్లు, నీరు నిలిచిన గుంతలు, విజిబిలిటీ సమస్యలు, ట్రాఫిక్ జామ్‌లు వంటివి ప్రమాదాల అవకాశాన్ని పెంచుతాయి. ఈ సమయంలో మీరు కారు మీద అయినా, బైక్​పై అయినా ఆఫీస్​కి వెళ్తుంటే.. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. వాటితో మీ ప్రయాణాన్ని మరింత సురక్షితంగా మార్చుకోవచ్చు. ప్రమాదాల బారిన పడకుండా కాపాడగలిగే జాగ్రత్తలు ఏంటో చూసేద్దాం. 

Continues below advertisement

సమయానికి ముందే బయలుదేరండి

వర్షం కారణంగా ట్రాఫిక్ సాధారణంగా కంటే ఎక్కువగానే ఉంటుంది. ఆలస్యం అవుతుందనే ఆందోళనతో వేగంగా వెళ్లడం ప్రమాదాలకు దారితీస్తుంది. కాబట్టి కనీసం 15-20 నిమిషాలు ముందే బయలుదేరడం మంచిది.

టైర్ల పరిస్థితి చెక్ చేసుకోండి

బైక్, కారు టైర్లలో సరైన గాలి ఉండాలి. టైర్ ట్రెడ్ అరిగిపోయి ఉంటే తడి రోడ్లపై స్కిడ్ అయ్యే ప్రమాదం పెరుగుతుంది. వర్షాకాలం ప్రారంభంలో ఒకసారి టైర్లను పరిశీలించడం మంచిది. కుదిరితే గ్రిప్ ఉండే టైర్స్ వేయించుకోండి.

Continues below advertisement

Also Read : వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు

బ్రేకులు, లైట్ల పనితీరు

వర్షంలో విజిబిలిటీ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో హెడ్‌లైట్లు, టెయిల్‌లైట్లు, ఇండికేటర్లు సరిగా పనిచేసేలా చూసుకోవాలి. ఇది మీకు, మీ వెనుక ప్రయాణించేవారికి కూడా మంచిది. అలాగే బ్రేకులు కూడా సమర్థంగా పనిచేస్తున్నాయో లేదో చెక్ చేసుకోవాలి.

వేగంగా వెళ్లకండి

వర్షం కారణంగా రోడ్లపై నీరు పేరుకుపోతుంది. అలాంటి ప్రదేశాల్లో వేగంగా వెళ్లడం మంచిది కాదు. ఎందుకంటే నీటి కింద గుంతలు ఉండొచ్చు. వేగంగా వెళ్లితే వాహనం అదుపు తప్పే ప్రమాదం ఉంది. అంతేకాదు ఇంజిన్‌లోకి నీరు వెళ్లే అవకాశం కూడా ఉంటుంది.

రెయిన్ గేర్ 

మీరు వర్షంలో బైక్​పై వెళ్తే.. వాటర్‌ప్రూఫ్ జాకెట్, ప్యాంట్, గ్లవ్స్, షూ కవర్లు వాడితే శరీరం తడవదు. హెల్మెట్ వైజర్ శుభ్రంగా ఉండాలి. మసకబారిన వైజర్‌తో ప్రయాణించడం ప్రమాదకరం.

Also Read : వర్షాకాలంలో తినకూడని ఫుడ్స్ లిస్ట్.. చేపలు, రొయ్యలు, పీతలు, ఆకుకూరలు తినకూడదా?

వైపర్లు, డీఫాగర్ చెక్

వైపర్లు పాడై ఉంటే గాజు సరిగా శుభ్రం కాదు. అలాగే గాజుపై ఆవిరి ఏర్పడితే డీఫాగర్‌ను ఉపయోగించాలి. విజిబిలిటీ తగ్గితే వెంటనే వేగాన్ని తగ్గించండి.

తగినంత దూరం పాటించండి

తడి రోడ్లపై బ్రేకింగ్ దూరం పెరుగుతుంది. ముందు వాహనానికి చాలా దగ్గరగా వెళ్తే అకస్మాత్తుగా బ్రేక్ వేయాల్సి వస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత దూరం, అదుపు చేయగలిగే వేగంతో వాహనం నడపాలి.

మొబైల్ వినియోగం..

వర్షంలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఫోన్ మాట్లాడటం లేదా మెసేజ్ చూడటం ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. అవసరమైతే వాహనాన్ని సురక్షితంగా ఆపిన తర్వాత మాత్రమే ఫోన్ ఉపయోగించండి.

Also Read : వర్షాకాలంలో పిల్లల ఇమ్యూనిటీని పెంచే ఆహారాలు ఇవే.. ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా కిడ్స్ డైట్‌లో చేర్చండి

తీసుకోవాల్సిన మరిన్ని జాగ్రత్తలు

మీతో పాటు ఒక జత పొడి దుస్తులు, చిన్న టవల్, గొడుగు, మొబైల్‌కు వాటర్‌ప్రూఫ్ కవర్ వంటి వస్తువులు బ్యాగ్‌లో ఉంచుకోవడం మంచిది. ఆఫీసుకు చేరుకున్న తర్వాత తడి దుస్తులు మార్చుకోవడం ఆరోగ్యానికి మంచిది. అలాగే భారీ వర్షాల హెచ్చరికలు ఉంటే కొద్దిసేపు ఆలస్యంగా బయలుదేరడం లేదా పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకోవడం మంచిది.

వర్షాకాలంలో ప్రమాదాలకు ప్రధాన కారణాలు అతివేగం, తడి రోడ్లను తక్కువ అంచనా వేయడం, వాహన నిర్వహణను నిర్లక్ష్యం చేయడమే. బైక్ అయినా, కారు అయినా చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చు. సురక్షితంగా ఆఫీసుకు చేరుకోవడమే కాకుండా, మీ ఆరోగ్యం, మీ వాహనం కూడా మంచి స్థితిలో ఉండేలా చూసుకోవచ్చు. ఈ వర్షాకాలంలో సేఫ్టీ ఫస్ట్ అనే ఫార్ములా పాటిస్తే అందరికీ మంచిది. 

Also Read : వర్షాకాలంలో కీళ్ల నొప్పులు ఎందుకు ఎక్కువ అవుతాయి? కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే