డయాబెటిస్ వచ్చిందంటే చాలు తీపికి దూరమైపోవాలి. కేకులు చూసి నోరూరుతున్నా కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ చేసుకోవడం కష్టమే కానీ ఆరోగ్యం కోసం తప్పదు. అయితే మధుమేహుల కోసం ప్రత్యేకంగా అప్పుడప్పుడు ఇలా రాగి కేకును తయారుచేసుకోవచ్చు.  గంటసేపు కష్టపడితే చక్కగా కేకు రెడీ అయిపోతుంది. 


కావాల్సిన పదార్థాలు
పెరుగు - అరకప్పు
రాగి పిండి - ఒకటిన్నర కప్పు
బేకింగ్ పొడి - ఒక టీస్పూను
బేకింగ్ సోడా - ఒక టీస్పూను
ఉప్పు - చిటికెడు
వెనిల్లా ఎసెన్స్ - ఒక టీ స్పూను
ఆర్టిఫిషియల్ స్వీట్‌నెర్ - మూడు టీస్పూన్లు
కొకో పొడి - ఒక టీస్పూను
వెజిటెబుల్ నూనె - మూడు స్పూన్లు
నీళ్లు - ముప్పావు కప్పు
బటర్ - ఒక టీస్పూను


తయారీ ఇలా
1. రాగి కేకు చేయడానికి ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో పెరుగు వేయాలి. 
2. పెరుగులో బేకింగ్ పొడి, బేకింగ్ సోడా, ఆర్టిఫిషియల్ స్వీట్‌నెర్, ఉప్పు, వెనిల్లా ఎసెన్స్ కలపాలి. 
3. ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా గిలక్కొట్టాలి. ఓ పది నిమిషాలు ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టాలి. 
4. తరువాత ఆ మిశ్రమంలో రాగిపిండి వేసి బాగా గిలక్కొట్టాలి. 
5. అందులో వెజిటబుల్ నూనె, కోకో పొడి వేసి బాగా కలపాలి. ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. 
6. కేకు చేసే మౌల్డ్ తీసుకుని దానికి బటర్ రాసుకోవాలి. పార్చ్‌మెంట్ పేపర్ వేసి అందులో రాగి మిశ్రమాన్ని వేయాలి. 
7. ముందుగానే మైక్రోవేవ్ ఓవెన్‌ను 180 డిగ్రీల సెల్పియస్‌కు ప్రి హీట్ చేసుకుని పెట్టుకోవాలి. 
8. ఇప్పుడు పిండి వేసి మౌల్డ్‌ను ఓవెన్లో పెట్టాలి. 
9. దాదాపు అరగంట నుంచి 40 నిమిషాలు ఓవెన్లో వేడి చేసుకోవాలి. కేకు తయారైందో లేదో తెలిసేందుకు టూత్ పిక్ లేదా ఫోర్క్ కేకు మీద గుచ్చి చూడాలి. దానికి ఏమీ అంటుకోకుండా వస్తే కేకు రెడీ అయినట్టే. 


రాగి పిండి తింటే...
మధుమేహం బారిన పడిన వాళ్లు రాగి పిండితో చేసిన వంటకాలు తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి.  రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా రాగిపిండి కాపాడుతుంది. మధుమేహం ఉన్నవారు రోజూ రాగిజావ తాగితే డయాబెటిస్ అదుపులో ఉంటుంది. రాగి దోశెలు, రాగి ముద్ద... ఇలా ఏ రూపంలో రాగి పిండి తిన్నా మంచిదే. రాగి కేకు కూడా ఆరోగ్యానికే మేలు చేస్తుంది. కాకపోతే అందులో బెల్లం, చక్కెర వంటివి కలుపుకోకూడదు. రాగుల్లో ఖనిజాలు, పోషకాలు నిండుగా ఉంటాయి. కాల్షియం కూడా అధికంగా ఉంటాయి. పిల్లలకు ఈ కేకులను పెట్టడం వల్ల చాలా మేలు జరుగుతుంది. ఎముకలు బలంగా మారుతాయి. రక్త హీనత తక్కువగా ఉన్నవారికి కూడా రాగి మేలు చేస్తుంది. రక్త ఉత్పత్తికి రాగులు సహకరిస్తాయి. ఆస్టియోపొరోసిస్ వచ్చే అవకాశం తగ్గుతుంది.  రోజు రాగి జావ తాగే వారిలో నీరసం కూడా రాదు, బ్రేక్ ఫాస్ట్ సమయంలో రాగి జావ తాగడం వల్ల రోజంతా శక్తివంతంగా ఉంటారు.


Also read: స్పైసీ ఫుడ్ తిన్నాక మండిపోతున్న ఫీలింగ్ తగ్గాలంటే వీటిని తినాలి