A month without coffee : స్ట్రెస్​ఫుల్ లైఫ్ ఉండేవారికి​ కాఫీ అనేది బస్టర్​ లాగా మారిపోయింది. రోజుని కాఫీతో ప్రారంభించేవారు కోకొల్లలు. అలాగే ఆఫీస్​లో ఒత్తిడి ఎక్కువైనప్పుడు ముందుగా వెళ్లేది కాఫీ కోసమే. అంతేకాకుండా ఫోకస్​ని పెంచుకోవడానికి, అలెర్ట్​గా ఉండడానికి శరీరానికి ఇందనంగా దీనిని తీసుకుంటారు. ఇలా మీకు కూడా కాఫీని రెగ్యూలర్​గా తీసుకునే అలవాటు ఉందా? ఇది వ్యసనంగా మారుతుందని కాఫీని అవాయిడ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే. 

అలవాటు పడిన కెఫిన్​ని దూరం పెట్టడం చాలా కష్టం. అదే కాఫీని రెగ్యులర్​గా తీసుకునేవారికి ఇది మరింత కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా మొదటిరోజుల్లో దాని సైడ్​ ఎఫెక్ట్స్ కాస్త ఎక్కువగానే కనిపిస్తాయి. కానీ తర్వాత మంచి ఫలితాలు చూడగలుగుతారు. అయితే మీరు నెలరోజులు కాఫీ తాగడం మానేస్తే మీ శరీరం ఏ విధంగా రియాక్ట్ అవుతుందో ఇప్పుడు చూసేద్దాం. 

కాఫీ మానేయడం వల్ల కలిగే నష్టాలు

కాఫీని మానేయడం వల్ల మొదటి రోజుల్లో తలనొప్పి ఎక్కువగా ఉంటుంది. రక్తనాళాలను కుదించి.. మెదడుకు రక్త ప్రవాహం పెరుగుతుంది. దీనివల్ల మైగ్రేన్లు రావొచ్చు. శరీరం నెమ్మదిగా పనిచేస్తుందనిపిస్తుంది. అలసిపోతారు. కాఫీ నుంచి డోపమైన్ అనే హార్మోన్ ప్రభావితమవుతుంది. దీనివల్ల మీకు కోపం, చికాకు రావొచ్చు. పనిమీద ఫోకస్ చేయడం కష్టమవుతుంది. మీ మెదడు కాఫీ లేకుండా ఉండేందుకు కొంత సమయం పడుతుంది. వీటిని మీరు ఓవర్​కామ్ చేయగలిగితే మంచి ఫలితాలు ఉంటాయి. 

కాఫీ మానేయడం వల్ల కలిగే లాభాలు.. 

కొత్తలో కష్టంగా ఉన్నా.. కాఫీని మానేయడం వల్ల దీర్ఘకాలిక లాభాలు ఉంటాయి. కాబట్టి మీరు ఆ కొద్ది రోజులు భరిస్తే చాలు.. తర్వాత రోజుల్లో మంచి ఫలితాలు చూడగలుగుతారు. శరీరం కాఫీ లేకుండా ఉండేందుకు అలవాటు పడుతుంది. ఇంతకీ కాఫీ మానేయడం వల్ల కలిగే లాభాలు ఏంటో చూసేద్దాం. 

ప్రశాంతమైన నిద్ర.. 

కాఫీ మానేయడం వల్ల మీ నిద్ర నాణ్యత పెరుగుతుంది. ఉదయం కాఫీ తాగితే ఇలాంటిది ఉండదు అనుకుంటారు కానీ.. మార్నింగ్ కెఫిన్​ కూడా స్లీపింగ్ సైకిల్​కు అంతరాయం కలిగిస్తుంది. కెఫిన్ శరీరం నుంచి బయటకు రావడానికి చాలా ఎక్కువ గంటలు పడుతుంది. దీనివల్ల నిద్ర పాడవుతుంది. అదే కాఫీ లేకుండా ఉన్నప్పుడు దాని నాణ్యత పెరుగుతుంది. మధ్య రాత్రి లేవడం తగ్గుతారు. స్లీపింగ్ క్వాలిటీ పెరుగుతుంది. విశ్రాంతి దొరుకుతుంది. 

జీర్ణ సమస్యలు దూరం.. 

కాఫీ మానేసిన కొత్తలో జీర్ణ సమస్యలు కాస్త కనిపిస్తాయి కానీ.. తర్వాతి కాలంలో అవి పూర్తిగా దూరమవుతాయి. కాఫీ మానేసిన రోజుల్లో మలబద్ధకం కనిపిస్తుంది. కానీ పూర్తిగా కాఫీకి దూరం అవ్వడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. కాబట్టి ముందు కంగారు పడకూడదు. ఆ సమయంలో మీరు జీర్ణ సమస్యలు దూరం చేసుకోవడానికి కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు 

శరీరానికి తగినంత నీరు అందించాలి. ఇది జీర్ణక్రియకు హెల్ప్ చేస్తుంది. ఫైబర్ ఎక్కువగా ఉండే కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు తీసుకోవాలి. ఇవి మలబద్ధకాన్ని దూరం చేస్తాయి. అల్లం టీ, సోంపుతో చేసిన కషాయాలను కాఫీకి రిప్లేస్​గా తీసుకోవచ్చు. ఇవి జీర్ణక్రియకు మేలు చేస్తాయి. చర్మం కూడా హెడ్రేటెడ్​గా మెరుస్తూ కనిపిస్తుంది. 

ఎనర్జీ పరిస్థితి ఏంటి.. 

సాధారణంగా కాఫీని చాలామంది ఎనర్జీ కోసం తీసుకుంటారు. కాఫీ మానేస్తే ఇది రాదనుకుంటారు. కానీ.. ఒక్కసారి శరీరం కాఫీ లేకుండా ఉండడం ప్రారంభిస్తే శరీరంలో ఆటోమెటిక్​గా ఎనర్జీ వస్తుంది. మొదట్లో ఎనర్జీ డౌన్ అయినట్లు, అలసిపోయినట్లు, చికాకు వంటి సమస్యలు ఉండొచ్చు. కానీ తర్వాత రోజుల్లో అవి తగ్గిపోతాయి. రెగ్యులర్​గా వ్యాయామాలు చేస్తే ఎనర్జిటిక్​గా ఉంటారు. 

పంటి సంరక్షణ.. 

కాఫీ తాగడం వల్ల దంతాలపై మరకలు వంటివి కనిపిస్తాయి. ఎనామెల్​ రంగు మారుతుంది. కెఫిన్​ వల్ల దుర్వాసన కూడా రావొచ్చు. కాఫీ మానేస్తే ఈ మరకలు తగ్గుతాయి. నోటి ఆరోగ్యం కూడా మెరుగవతుంది. 

కాఫీకి ప్రత్యామ్నాయంగా.. 

కాఫీని వదిలి బయటకు రావాలనుకున్నప్పుడు మీరు దానిని హెర్బల్ టీలు లేదా గ్రీన్​ టీలతో భర్తీ చేయవచ్చు. వీటివల్ల యాంటీఆక్సిడెంట్లు సహజంగా అందుతాయి. హెల్తీ ఫుడ్స్ తీసుకుంటే మరీ మంచిది. కాబట్టి మొదట్లో వచ్చే సమస్యలకు భయపడకుండా కాఫీని దూరం చేసుకోగలిగితే.. మెరుగైన ఫలితాలు పొందవచ్చు. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.