మిలీనియల్స్ మనసుదోచిన సోషల్ మాధ్యమం ఇన్ స్టాగ్రామ్. అందులో రోజూ లక్షల ఫోటోలు అప్ లోడ్ అవుతుంటాయి. వాటిలో కొంతమంది తాము వండిన లేక తినే ఆహారపదార్థాలను అందంగా ఫోటో తీసి పోస్టు చేస్తుంటారు. ఇలా చేయడం ఆనవాయితీగా మార్చుకున్నవారూ ఉన్నారు. అలాంటి వారిని ఓ తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. ఆ పరిశోధన ప్రకారం ఇన్ స్టాగ్రామ్ లో ఫుడ్ ఫోటోలను షేర్ చేసే, అలాగే ఫుడ్ గురించి తన అనుభవాలను పంచుకునే వ్యక్తులు బరువు పెరిగే అవకాశాలు ఎక్కువ. వీరిలో ఆకలి, తినాలన్న కోరిక పెరిగిపోయి అధికంగా ఆహారాన్ని తినేస్తారు. దాని వల్ల బరువు పెరిగే అవకాశం అధికమవుతుంది. ప్రపంచంలో దాదాపు 70 శాతం మిలీనియల్స్ తినడానికి ముందు క్రమం తప్పకుండా ఫుడ్ ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేసుకుంటున్నట్టు తాజా సర్వే తేల్చింది.
అమెరికాకు చెందిన జార్జియా సదరన్ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఎవరైతే ఫుడ్ ఫోటోలు తీసి ఇన్ స్టాలో అప్ లోడ్ చేస్తారో, వారు రెండు రెట్లు అధికంగా తినే అవకాశం ఉన్నట్టు బయటపడింది. ఈ స్టడీ తాలూకు వివరాలు ‘అపెటైట్’అనే జర్నల్ లో ప్రచురించారు. ఇందుకోసం 145 మంది విద్యార్థులను తీసుకుని వారిని రెండు గ్రూపులుగా విడదీశారు. ఇద్దరికీ ఆహారాన్ని ప్లేట్లలో అందించారు. వారిలో సగం మందిని ఫోటోలు తీసి ఇన్ స్టాలో పోస్టు చేయమన్నారు. అలాగే ఆహారం గురించి రాయమన్నారు. రేటింగ్ కూడా ఇవ్వమన్నారు.
ఇక రెండో గ్రూపులోని వ్యక్తులను నేరుగా ఆహారాన్ని తినమన్నారు. వీరు ఇచ్చిన ఆహారాన్ని తిని చాలని చెప్పారు. కానీ ఇన్ స్టా కోసం ఫోటోలు తీసిన గ్రూపులోని విద్యార్థులు మాత్రం ఆహారాన్ని ఎంజాయ్ చేస్తూ, ఇంకా కావాలని రెండో సారి కూడా తిన్నారు. దీన్ని బట్టి ఇన్ స్టాలో ఫుడ్ ఫోటోలను పంచుకునే వారు అవసరం కన్నా ఎక్కువ తినే అవకాశం ఉందని తేల్చారు. పాత అధ్యయనాలలో మాత్రం ఇలా ఫుడ్ ఫోటోలు తీసే వారిలో మెదడు వాసన, రుచి ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తున్నట్టు తేలింది.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Also read: ఇలాంటి వ్యక్తులతో వివాహమా... కాస్త ఆలోచించుకోండి
Also read: కెలోరీల గురించి భయపడకుండా రోజులో ఎప్పుడైనా వీటిని తినొచ్చు
Also read: ఇలాంటి ఆహారపదార్థాలు తింటున్నారా... అయితే మతిమరుపు వచ్చే ఛాన్స్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి