టైటిల్ చూసి.. ఆ ఆస్తి ఏదో నాకు రాసిచ్చేసినా బాగుంటుందని అనుకుంటున్నారు కదూ. మీరే కాదు, ఈ విషయం తెలిసి చాలామంది ఇలాగే అనుకుంటున్నారు. అంత మొత్తాన్ని కుక్క ఏం చేసుకుంటుంది? ఆ ఆస్తి కుక్కకు బదులు మాకు రాసిస్తే.. కుక్కలా పడి ఉండేవాళ్లమని.. అప్పులు తీర్చుకుని దర్జాగా బతికేస్తామని అంటున్నారు. డబ్బు విలువ తెలియని కుక్కకు ఎందుకిస్తున్నావ్? అని నిట్టూరుస్తున్నారు. మరి ఆమె అంత పెద్ద నిర్ణయం తీసుకోడానికి కారణం ఏమిటీ?
ప్లే బాయ్ మోడల్ జు ఐసెన్.. ఇటీవల కొంతమంది లాయర్లను కలిసింది. తాను సంపాదించిన 2 మిలియన్ డాలర్లు (సుమారు రూ.15 కోట్లు) ప్రాపర్టీని తన కుక్కకు రాసేయాలని నిర్ణయించుకున్నానని తెలిపింది. పూచ్ ఫ్రాన్సిస్కోలోని తన అపార్టమెంట్, కార్లను కూడా కుక్కే ఇచ్చేస్తానని తెలిపింది. ఇది వినగానే లాయర్లు ఆశ్చర్యపోయారు. కుక్కకు ఆస్తి రాసివ్వడం ఏమిటని అడిగితే.. ‘‘నాకు పిల్లలు లేరు. అందుకే కుక్కకు నా ఆస్తి ఇచ్చేయాలని అనుకుంటున్నా. అయినా.. నేను పైకిపోతే.. కుక్కను ఎవరు చూసుకుంటారు? నేను ఆస్తి రాసిస్తే.. దాని కేర్ టేకర్ శ్రద్ధగా చూసుకుంటాడు. నేను పోయినా.. అది సుఖంగా ఉంటుంది’’ అని చెప్పింది. ప్రస్తుతం మనంగా బాగానే ఉన్నామని.. భవిష్యత్తు గురించి ముందు చూపు లేకుండా బతికేయకూడదని ఐసెన్ పేర్కొంది.
ఐసెన్‌కు కుక్కంటే ఎంతో ప్రాణం.. ఆమెతోపాటు లగ్జరీ లైఫ్‌ను అనుభవిస్తోంది. ఆమెతోపాటు ప్రైవేట్ జెట్‌లో కూడా విహరిస్తోంది. పేరుకు కుక్కే.. కానీ, రకరకాల స్టైలిష్ దుస్తులు వేస్తూ వయ్యారంగా తిరుగుతూ మిగతా కుక్కలకు సైతం ఈర్ష్య పుట్టిస్తుంది. పిల్లలు లేరని ఆ కుక్కకు ఆస్తులు రాసిచ్చే బదులు.. బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి పిల్లలు కనొచ్చుగా అని అభిమానులు అడిగితే.. ‘‘పిల్లలను కనేందుకు టైమ్ లేదు’’ అని సమాధానం ఇచ్చింది. ఏది ఏమైనా.. ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుందంటే.. ఇదే కాబోలు.
మోడల్‌గా అవకాశాల కోసం ఐసెన్ తన శరీరంలో చాలా మార్పులు చేయించుకుంది. ప్లాస్టిక్ సర్జరీల కోసం 2,19,000 పౌండ్లు (రూ.1.64 కోట్లు) వెచ్చించినట్లు గత జనవరి నెలలో ప్రకటించింది. శరీరంలో వివిధ అవయవాల మార్పు కోసం ఆమె దాదాపు 50 ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నట్లు తెలిపింది. సర్జరీలు చేయించుకోవడం తనకు అలవాటుగా మారిపోయిందని పేర్కొంది. ‘‘నేను నా గతాన్ని మరిచిపోవాలని అనుకుంటున్నాను. అద్దంలో చూసుకుంటే నన్ను నేను గుర్తుపట్టలేను. నేను ఇప్పుడు పూర్తిగా మారిన మహిళను’’ అని పేర్కొంది.
Also Read: కూల్ డ్రింక్స్ తాగితే సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుందా?
Also Read: కూల్ డ్రింక్ తాగిన కొన్ని గంటల్లోనే వ్యక్తి మృతి.. ఇతడిలా మీరు చేయొద్దు!