వయసులో ఉన్నాం, ఏం తిన్నా అరిగించుకుంటామనే ధోరణిలో చాలా మంది యువకుల్లో కనిపిస్తాది. దీంతో నచ్చిన ప్రతిదీ తినేస్తుంటారు. ఫలితంగా బరువు పెరిగి పోతారు. అయితే, 30 సంవత్సరాల లోపు వయస్సులో బరువు పెరగడం వల్ల ప్రొస్టేట్ క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుందని కొత్త పరిశోధన చెబుతోంది.


17 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసులో సంవత్సరానికి ఒక్క కేజి బరువు పెరిగినా సరే వారికి ప్రొస్టేట్ క్యాన్సర్ రిస్క్ 27 శాతం వరకు పెరుగుతుందని స్విడిష్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. యుక్త వయసులో బరువు అదుపులో పెట్టుకోకపోతే ఆ ఒక్క కారణం భవిష్యత్తులో ప్రాణాంతక వ్యాదులకు కారణం కాగలదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


ప్రొస్టేట్ క్యాన్సర్‌కు కారణమయ్యే కారకాల గురించి మరింత తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉందని మాల్మోలోని లాండ్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ మరిసా డా సిల్వా అన్నారు.


పెరుగుతున్న వయసు, కుటుంబ ఆరోగ్య చరిత్ర, జెనెటిక్ మార్కర్స్ మాత్రమే మార్చేందుకు వీలు లేని విషయాలు. కానీ చాలా వరకు క్యాన్సర్ నివారించగలిగే అవకాశం ఉంటుంది. యువకుల్లో బరువు నియంత్రణలో పెట్టుకోవడం ద్వారా చాలా వరకు ప్రొస్టేట్ క్యాన్సర్ ను నివారించడం సాధ్యమవుతుంది.


ఏటా 12 వేల కంటే ఎక్కువ మంది ప్రొస్టేట్ క్యాన్సర్ తో మరణిస్తున్నారు. స్థూలకాయం పై సమర్పించిన అధ్యయనంలో 17 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న 2 లక్షల 58,477 మంది పురుషుల బరువును కనీసం 3 సార్లు ట్రాక్ చేసి యూరోపియన్ కాంగ్రెస్ లో వివరాలు సమర్పించారు.


1963 నుంచి 2014 వరకు వారంతా కూడా క్యాన్సర్ బారిన పడలేదు. వారిలో మార్పులను తెలుసుకునేందుకు 2019లో తిరిగి ఫాలోఅప్ చేశారు. అయితే వారిలో 23 వేల 348 మంది ప్రొస్టేట్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. వారిలో 4790 మంది మరణానికి చేరువలో ఉన్నారు.


30 సంవత్సరాల లోపు బరువు పెరగడం క్యాన్సర్ బారిన పడి దాని వల్ల మరణించేందకు కారణం అవుతోందని ఈ అధ్యయన సారాంశం. స్థూలకాయుల్లో గ్రోత్ ఫ్యాక్టర్ -1 అనే హార్మోన్ క్యాన్సర్ పెరిగేందుకు కారణం అవుతుందని పరిశోధకులు అంటున్నారు.


ఇలాంటి మరణాలను నివారించేందుకు  ఈ రకమైన పరిశోధనలు కీలకం. ప్రస్తుతం యువకుల్లో చాలా మంది ఆహారపు అలవాట్లు అంత ఆరోగ్యకరంగా లేవు. ఇవి బరువు పెరగడం వల్ల వచ్చే ప్రొస్టేట్ క్యాన్సర్ మాత్రమే కాదు నేరుగా చాలా రకాల జీర్ణసంబంధ క్యాన్సర్లకు కారణం అవుతాయి. కాబట్టి ప్రభుత్వం జంక్ ఫుడ్ ప్రకటనల  మీద ఒక ప్రణాళికాబద్ధమైన పరిమితులను విధించాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయ పడ్డారు.


ప్రొస్టేట్ క్యాన్సర్ మాత్రమే కాదు బరువు నియంత్రణలో ఉండడం వల్ల చాలా రకాల క్యాన్సర్ల నివారణ సాధ్యపడుతుందని సైమన్ గ్రీన్సన్ అనే యూకే శాస్త్రవేత్త అన్నారు. 50 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న వారు, నల్లజాతి వారు, కుటుంబ చరిత్ర కలిగిన పురుషులు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉంటుంది. వీరిలో బరువు కూడా నియంత్రణలో లేకపోవడం వల్ల మరింత ప్రమాదం పెరుగుతుందని నిపుణులు హెచ్చిరిస్తున్నారు. తరచుగా స్క్రీనింగ్ చేయించుకోవడం వీరికి అవసరం.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also read: బరువు తగ్గేందుకు డైటింగ్ చేస్తూ డైట్కోక్‌లు తాగేస్తున్నారా? జాగ్రత్త, ఈ జబ్బుతో ప్రాణాలు పోతాయ్!