మనిషి మనుగడకు ముఖ్యమైనది ఆహారమే. ఎంత కష్టపడినా ఆ గుప్పెడు పొట్ట కోసమే అంటారు పెద్దలు. ఒక్కో దేశంలో ఒక్కో రకమైన ఆహారాలు ఉంటాయి. వాటిని అభిమానులు కూడా భారీగా ఉంటారు. మనదేశంలోని ఆహారాల గురించి తెలుసుకోవాలంటే అది పెద్ద చిట్టానే అవుతుంది. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన చిరుతిళ్లు అమ్ముడుపోతాయి. మరి ప్రపంచం మొత్తం మెచ్చిన ఆహారం ఏది? అని మీకు ఎప్పుడైనా తెలుసుకోవాలనిపించిందా? బల్గేరియాకు చెందిన ఫుడ్ వెబ్ సైట్ ఆ పనిని చేపట్టింది. ఆ ఫుబ్ వెబ్ సైట్ పేరు ‘టేస్ట్ అట్లాస్.కామ్’. ఇది ఈ ఏడాదిలో ఉత్తమ ఆహారాలేవి, ఉత్తవ వంట పద్దతులు ఏ దేశానికి చెందినవి... అనే విషయాలపై ఓటింగ్ నిర్వహించి రేటింగ్ ఇచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది ప్రజలు ఓట్లను వేశారు.
ఆ దేశానిదే మొదటి స్థానం
టేస్ట్ అట్లాస్ అవార్డ్స్ 2022 ప్రకారం, 2022లో ప్రపంచంలోని అత్యుత్తమ వంటకాల జాబితాలో భారతదేశం ఐదవ స్థానంలో ఉంది. పదార్థాలు, వంటకాలు, పానీయాల ఇలా ప్రతి ఆహారంపైనా ప్రేక్షకుల ఓట్లను లెక్కించారు. కాగా ఉత్తమ వంటకాల విషయంలో ఇటలీ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ‘Italy Cuisines’ రుచికరంగా ఉంటాయని ఎక్కువ మంది ఓట్లు వేశారు. తరువాతి స్థానంలో గ్రీస్, స్పెయిన్, జపాన్ దేశాలు నిలిచాయి. అయిదవ స్థానంలో మన దేశం ఉంది. మన దేశానికి ఫైవ్ స్టార్ రేటింగ్లో భాగంగా 4.54 రేటింగ్ వచ్చింది.
ర్యాంకింగ్ ప్రకారం భారతదేశంలో వాడే ఉత్తమ పదార్థాలలో గరం మసాలా, బాస్మతి, కరివేపాకు, పనీర్, కాశ్మీరీ మిరపకాయ, గోస్ట్ పెప్పర్, నింబు పానీ, ఇడియప్పం, హిమాలయన్ బ్లాక్ సాల్ట్ (కాలా నమక్), చెట్టినాడ్ మసాలా, ఆమ్‌చూర్, చాట్ మసాలా ఉన్నాయి.
టాప్ 50 మనది ఒకటే...
ప్రపంచంలో అత్యుత్తమ వంటల జాబితాను విడుదల చేసింది టేస్ట్ అట్లాస్. అందులో మన దేశానికి చెందిన ‘షాపీ పనీర్’ 28వ స్థానంలో నిలిచింది. అది ఢిల్లీలోని కేక్ డా హోటల్‌కు చెందిన షాపీ పనీర్‌గా దాన్ని ప్రకటించారు. దీనికి ఫైవ్ స్టార్ రేటింగ్‌కు బదులు 4.66 రేటింగ్ అందుకుంది. మొఘల్ వంటకాల నుండి ఉద్భవించిన షాహి పనీర్ అనేది పనీర్, ఉల్లిపాయలు, బాదం పప్పుల పేస్ట్, టొమాటో ప్యూరీతో కలిపి చేస్తారు. ఈ వంటకం సాధారణంగా నాన్, రోటీ లేదా పూరీ, చపాతీకి జతగా తింటారు.
ఇతర వంటకాలు
షాపీ పనీర్ 28వ స్థానంలో నిలిస్తే బటర్ చికెన్ 53వ స్థానంలో నిలిచింది. అలాగే లక్నోలోని కోర్మా వంటకం 55 వ ర్యాంక్ సాధించింది. గోవాలోని వెనైట్ రెస్టారెంట్లో వండే విందాలూ అనే పదార్ధం 71వ స్థానంలో ఉంది. ఇక హైదరాబాద్ బిర్యానీ 71 స్థానంతో సరిపెట్టుకుంది.
ప్రపంచంలోనే టాప్ వంటకం ఏదంటే...
ఇక ప్రపంచం మొత్తంమ్మీద ఎక్కువ మంది మెచ్చిన టాప్ వంటకంగా జపాన్ దేశానికి చెందిన ‘కరే’ అనే ఆహారం నిలిచింది. తరువాత బ్రెజిల్‌కు చెందిన పికాన్హా, పోర్చుగల్‌కు చెందిన అమీజోస్ ఎ బుల్హావో పాటో, చైనాకు చెందిన టాంగ్ బావో, గుయోటీలు ఆహారాలు టాప్ ఫైవ్ వంటల్లో నిలిచాయి.