Obesity in India Cases : ప్రపంచ ఒబెసిటీ ఫెడరేషన్ నివేదికల ప్రకారం.. భారతీయుల్లో 135 మిలియన్లకు పైగా భారతీయులు ఊబకాయంతో ఇబ్బంది పడుతున్నారట. అయితే పిల్లలపై దీని ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉందనేది మరింత ఆందోళన కలిగిస్తుంది. గత దశాబ్ధంలో ఇండియాలో పిల్లల్లో ఊబకాయం రేటు దాదాపు మూడు రెట్టి పెరిగిందని ఫలితాలు చూపిస్తున్నాయి. ఈ ఊబకాయం రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు డైజెస్టివ్ హెల్త్ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకుడు డాక్టర్ ముఫ్జల్ లక్డవాలా.
పిల్లల్లో, యువతలో ఊబకాయ ప్రభావం ఎక్కువగా ఉండడానికి లైఫ్‌స్టైల్, తీసుకునే ఆహారం, జెనిటిక్స్ వంటి వివిధ కారణాలు ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు జాగ్రత్తలు తీసుకోకుంటే ఈ ప్రభావం ఫ్యూచర్లో మరింత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఊబకాయం రాకుండా ఉండేందుకు డాక్టర్ ముఫ్జల్ పలు సూచనలు చేస్తున్నారు.
ఆరోగ్యకరమైన అలవాట్లు
పిల్లలకు ఆరోగ్యకరమైన అలవాట్లు నేర్పించాలని ముఫ్జల్ తెలిపారు. పాఠశాలల్లో పోషకాహార గురించిన పాఠ్యాంశాలు భాగం చేయాలని సూచించారు. ప్రాసెస్ చేసిన, తియ్యని పదార్థాలు తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు.. ప్యాక్ చేసిన స్నాక్స్ పరిమితంగా తీసుకోకుంటే వచ్చే ఇబ్బందులు గురించి పిల్లలకు అవగాహన కల్పించాలని తెలిపారు.
పిల్లలకు పండ్లు, హెల్తీ ఫుడ్స్ అందుబాటులో ఉంచాలన్నారు. అలాగే చదువుతో పాటు శారీరక విద్య, క్రీడలు తప్పకుండా ఆడేలా చూడాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. పిల్లలకు స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయాలి. విద్యార్థులను పాఠశాలకు నడిచి లేదా సైకిల్ మీద వెళ్లేలా ప్రోత్సహించాలి. క్రమం తప్పకుండా నీటిని తీసుకునేవిధంగా పిల్లలకు పేరెంట్స్, టీచర్స్ సహకరించాలని తెలిపారు.
కుటుంబంలో చేయాల్సిన మార్పులు
చిన్న వయస్సు నుంచే పిల్లలు ఆరోగ్యకరంగా ఉండేందుకు తల్లిదండ్రులు కృషిచేయాలి. పిల్లలపై ఒత్తిడి పెంచడం సరికాదు. అలాగే సమతుల్య ఆహారం పిల్లలకు అందించాలి. స్వీట్స్ ఎక్కువగా తింటే వచ్చే సమస్యలు పిల్లలకు అవగాహన కల్పించాలి. బలవంతం చేస్తే మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని పడుతుంది.
పిల్లలను స్కూల్‌తో పాటు యోగా తరగతులు, వాకింగ్ క్లబ్‌లు లేదా ఇంటరాక్టివ్ వెల్‌నెస్ సెమినార్ల వంటి కమ్యూనిటీ స్థాయిలో యాక్టివ్‌గా ఉండేలా చూసుకోవాలి. పిల్లలతో పాటు పెద్దలు కూడా వీటిలో పాల్గొంటే ఊబకాయ వంటి దీర్ఘకాలిక సమస్యలు రాకుండా ఉంటాయి.
ఉద్యోగం చేసేవారైతే..
డెస్క్ జాబ్‌లు చేసేవారు వార్షికంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. ఫిట్నెస్ వివరాలు, ఉద్యోగుల మానసిక పరిస్థితిపై యాజమాన్యం శ్రద్ధ చూపించాలి. ఉద్యోగుల మానసిక ప్రశాంతతకు సంబంధించిన వాతావరణ కల్పించాలి. స్పోర్ట్స్ క్లబ్స్, వెల్‌నెస్ ఛాలెంజ్‌లు చేయిస్తే వారిపై ఒత్తిడి తగ్గుతుంది. ఊబకాయం రావడానికి ఒత్తిడి ఓ ప్రధాన కారణం. కాబట్టి దానిని ఉద్యోగులపై పడకుండా చూసుకోవాలి.
జాతీయ స్థాయిలో రావాల్సిన మార్పులు
ఊబకాయం పెరగకుండా చూడాలంటే.. షుగర్ డ్రింక్స్, ప్రాసెస్ చేసిన ఆహారాలపై పన్ను విధించడంతో పాటు ప్యాకేజీ ముందు భాగంలో స్పష్టంగా పోషకాహార లేబులింగ్ ఉండేలా చూసుకోవాలి. స్థానికంగా పండించిన తాజా ఉత్పత్తులకు, హెల్తీ ఫుడ్స్‌కు ప్రోత్సాహకాలు అందించేలా చర్యలు తీసుకోవాలి. వ్యాయామాన్ని ప్రోత్సాహించే కార్యక్రమాలను ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు నిర్వహించాల్సి ఉంటుంది.
బారియాట్రిక్ సర్జరీ ద్వారా ఊబకాయంతో ఇబ్బంది పడేవారి ప్రాణాలు కాపాడవచ్చు. అయితే దాని తర్వాత జీవనశైలి మారాల్సి ఉంటుంది. అందుకే చికిత్సకంటే రాకుండా నివారించడమే ముఖ్యమంటున్నారు ముఫ్జల్.
గ్లోబల్ హెల్త్ ఎకనామిక్ అధ్యయనాల ప్రకారం.. నివారణ ఆరోగ్య సంరక్షణపై ఖర్చు చేసిన ప్రతి రూపాయి.. కాలక్రమేణా చికిత్స ఖర్చులలో పది శాతం వరకు ఆదా చేస్తుందని తెలిపింది. ఇప్పుడు నివారణ చర్యలు తీసుకోకపోతే.. భవిష్యత్తులో దానికి రెట్టింపు అనుభవించాల్సి వస్తుందని అంటున్నారు నిపుణులు.