Obesity Prevention Tips in Female : జీవనశైలిలో మార్పులు, ఆరోగ్య సమస్యలు, ఇతర కారణాల వల్ల చాలామంది ఊబకాయంతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఈ సమస్య ఆడవారిలో ఎక్కువగా ఉందని నిపుణులు చెప్తున్నారు. ఇండియాలోని మహిళల్లో ఊబకాయం గణనీయంగా పెరుగుతున్నట్లు గుర్తించారు. టీనేజ్ నుంచి 50 ఏళ్లలోపు మహిళల్లో 24 శాతం మంది ఊబకాయంతో ఇబ్బంది పడుతున్నట్లు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలో వెల్లడైంది. అందుకే ఈ విషయంపై మహిళలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు.
ఊబకాయం అనేది జీవనశైలిపై, శారీరక శ్రమ, మానసిక ఒత్తిడిపై ఆధారపడి ఉంటుంది. సరైన లైఫ్‌స్టైల్ ఫాలో అవ్వకపోయినా.. ఫిజికల్ యాక్టివిటీ లేకపోయినా.. స్ట్రెస్ ఎక్కువగా ఉండి ప్రాసెస్ చేసిన ఫుడ్స్ తీసుకున్నా ఊబకాయం వచ్చే అవకాశం రెట్టింపు ఉంటుంది. ఇలా బరువు పెరగడం వల్ల పీసీఓఎస్, ప్రెగ్నెన్సీ సమస్యలు, మధుమేహం, ఇతర ఆరోగ్య సమస్యలపై తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది. అందుకే ఊబకాయం రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫాలో అవ్వాల్సిన టిప్స్? సమస్యను ఎలా తగ్గించుకోవచ్చో చూసేద్దాం.
ఒబెసిటీ రావడానికి కారణాలు..
ఊబకాయం అనేది కొందరికి జెనిటికల్గా వస్తుంది. మరికొందరికి వారు ఉండే ప్రదేశం, వాతావరణం, హార్మోనల్ సమస్యల వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే షుగర్ ఎక్కువగా ఉండే డ్రింక్స్, ప్రాసెస్ చేసిన ఫుడ్స్, అన్‌హెల్తీ ఫ్యాట్స్ వంటివి తీసుకుంటే కూడా ఊబకాయం వచ్చే అవకాశముంది. శారీరక శ్రమ లేకపోవడం వల్ల, అలాగే డెస్క్ జాబ్‌లు, వ్యాయామం లేకపోవడం వల్ల కూడా ఇది వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట. మహిళల్లో PCOS, హార్మోనల్ సమస్యల వల్ల కూడా బరువు పెరుగుతారు.
ఒత్తిడి పెరగడం, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొనే వారిలో కూడా ఊబకాయ సమస్యలు పెరుగుతాయి. నిద్ర సమస్యలు హార్మోనల్ సమస్యలను పెంచుతాయి. ఇవి క్రేవింగ్స్‌ని పెంచి తినాలనే కోరికలు పెంచి ఊబకాయాన్ని పెంచుతాయి. మెడికల్ సమస్యలు ఉన్నవారికి కూడా ఇది వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఊబకాయం సమస్యను తగ్గించుకోవాలన్నా.. రాకుండా తీసుకోవాలన్నా.. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ముందుగా ఫుడ్‌లో మార్పులు చేయాలి. సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. కూరగాయలు, పండ్లు, లీన్ ప్రోటీన్స్, తృణధాన్యలు, హెల్తీ ఫ్యాట్స్ డైట్లో చేర్చుకోవాలి. అలాగే పోర్షన్ కంట్రోల్ ఫాలో అవ్వాలి. అంతేకాకుండా వ్యాయామం రెగ్యులర్‌గా చేయాలి. కనీసం వారానికి 150 నుంచి 300 నిముషాలు వ్యాయామం చేస్తే మంచిదని సూచిస్తున్నారు.
హైడ్రేషన్ కోసం రోజుకు 7 నుంచి 8 గ్లాసుల నీటిని తాగాలని సూచిస్తున్నారు. శరీరానికి తగినంత నీటిని అందించడం వల్ల కూడా మెటబాలీజం పెరుగుతుంది. ఇది బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది. సోడాలు, స్వీట్స్, వైట్ బ్రెడ్ తీసుకోవడం తగ్గించాలి. ఎమోషనల్ సపోర్ట్ తీసుకోవాలి. ఇది కూడా ఒత్తిడిని తగ్గించి బరువు తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. యోగా, మెడిటేషన్, డీప్ బ్రీతింగ్, జర్నలింగ్ చేస్తే మంచి ఫలితాలుంటాయి. రాత్రి నిద్ర 7 నుంచి 9 గంటలు ఉండేలా చూసుకోండి.
ఇవన్నీ ఫాలో అవుతూ రెగ్యులర్‌గా హెల్త్ చెకప్స్ చేయించుకోవాలి. వీలైనంత వరకు వైద్యసహాయం తీసుకుని పర్ఫెక్ట్ డైట్ ప్లాన్ తీసుకుని ఫాలో అయితే మంచి ఫలితాలు ఉంటాయి. ఊబకాయ సమస్యల్ని దూరం చేస్తాయి.