Proven Tips To Stick To Your Weight Loss Resolution : చాలామంది కొత్త సంవత్సరం(New Year 2026)లో రెజుల్యూషన్‌లో భాగంగా బరువు తగ్గాలనుకుంటారు. మొదట్లో దీనిని సీరియస్‌గా తీసుకుని ప్రాసెస్ స్టార్ట్ చేసినా.. చాలామంది ఆ లక్ష్యాన్ని చేరుకోరు. దానివెనుక తేలికపాటి నిర్లక్ష్యం ఉంటుంది. లేదా ఇతర పనుల్లో బిజీగా అయిపోవడం వల్ల పట్టించుకోవడం కష్టం అవుతుంది. దీనివల్ల బరువు తగ్గడం తీరని కోరికగా మిగిలిపోతుంది. కానీ మీరు సరైన ప్రణాళికతో ఉంటే బిజీ టైమ్‌లో కూడా బరువు తగ్గవచ్చు అని చెప్తున్నారు నిపుణులు. దానికోసం మీరు బరువు తగ్గడాన్ని రొటీన్ పనులతో మిక్స్ చేయాలంటున్నారు. అవేంటో.. వాటివల్ల బరువు ఎలా తగ్గవచ్చో చూసేద్దాం.
రోటీన్పై దృష్టి పెట్టండి
వర్క్ బిజీ పెరిగినప్పుడు.. స్ట్రిక్ట్ డైట్, జిమ్ షెడ్యూల్‌లు బ్రేక్ అవుతాయి. అలాంటి సమయంలో మీరు ఇంటి భోజనం ఎన్నిసార్లు తింటున్నారు? ఎంతసేపు కూర్చొని ఉంటున్నారు? ఎప్పుడు నిద్రపోతున్నారు? అనే విషయాలపై దృష్టి పెట్టాలి. మీరు ఈ బేసిక్ విషయాలపై ఫోకస్ చేస్తే రిజల్ట్ చూడవచ్చని చెప్తున్నారు. ఎందుకంటే ఇవి చిన్న మార్పులే అయినా.. పెద్ద ఫలితాలు ఇస్తాయి. పైగా ఈ రొటీన్ సెట్ అయితే ఎక్కువకాలం కొనసాగించవచ్చు.
భోజనం విషయంలో మార్పులు
చాలామంది ఫుడ్ మానేస్తే బరువు తగ్గిపోతామనుకుంటారు. అలాగే కొన్ని ఫుడ్స్ పూర్తిగా తినడం మానేస్తారు. ఇలా చేస్తే తర్వాత మీకు తొందరగా క్రేవింగ్స్ పెరుగుతాయి. కొన్నిసార్లు ఎక్కువ తినేస్తారు. కాబట్టి ఫుడ్ బ్యాలెన్స్డ్గా ఉండేలా చూసుకోండి. ఇది మీకు శక్తిని ఇచ్చి ఆకలిని కంట్రోల్ చేస్తుంది. పప్పులు, కూరగాయలు, పెరుగు, తృణధాన్యాలు, పండ్లు వంటివి డైట్లో ఉండేలా చూసుకోండి. నూనె తగ్గించండి. వేయించిన స్నాక్స్‌కి దూరంగా ఉండండి. తప్పట్లేదు అనే సందర్భాల్లో తక్కువ తీసుకోండి. స్వీట్ క్రేవింగ్స్‌ని డేట్స్ వైపు డైవర్ట్ చేయండి. ఏది తీసుకున్నా.. లిమిటెడ్‌గా తీసుకోవాలని గుర్తించుకోండి. టైమింగ్స్ పాటిస్తే మంచి ఫలితాలు చూస్తారు.
ఆ ఫుడ్‌కి నో..
ప్యాకేజీ చేసిన స్నాక్స్, ఆర్డర్ పెడితే వచ్చే ఫుడ్స్‌కి వీలైనంత దూరంగా ఉండండి. కార్బోనేటెడ్, స్వీట్స్ డ్రింక్స్ కట్ చేస్తే మంచిది. తాజా ఆహారాన్ని కంటికి కనిపించేలా ఉంచుకుంటే.. అధికంగా ప్రాసెస్ చేసిన స్నాక్స్‌కి దూరమవ్వవచ్చు. ఇంట్లో తయారు చేసిన ఫుడ్‌ని ఆఫీస్‌కి తీసుకెళ్తే బయట తినాల్సిన అవసరం రాదు. మీరు పీజీలో ఉన్నా కెటిల్, కుకర్ ఉపయోగించి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ట్రై చేయకుండా కుదరదు అని సాకు చెప్తే నష్టం మీకేనని గుర్తించాలి.
శారీరక శ్రమ
వ్యాయామం అనేది మీ రొటీన్లో భాగమవ్వాలి. అలా అని మీరు జిమ్‌కే వెళ్లాల్సిన పని లేదు. నడవడం, సైకిల్ తొక్కడం, యోగా చేయడం, ఈత కొట్టడం, ఇంట్లో వ్యాయామాలు చేయడం లేదా వినోదం కోసం క్రీడలు ఆడటం వంటివి మీ బరువును అదుపులో ఉంచడంలో సహాయపడతాయి. మీరు చేసే పని ఎంత తరచుగా చేస్తారనేదే ముఖ్యం. స్వల్పకాలిక, తీవ్రమైన వ్యాయామాల కంటే రెగ్యులర్‌గా చేసే తేలికపాటి వ్యాయామాలే ఆరోగ్యానికి మంచిది.
నిద్ర ప్రభావం
తగినంత నిద్ర లేకపోవడం వల్ల మీ ఆకలి దెబ్బతింటుంది. క్రేవింగ్స్ పెంచుతుంది. అలసిపోయేలా చేస్తుంది. మంచి నిర్ణయాలు తీసుకోవడం కష్టతరం చేస్తుంది. ఆలస్యంగా భోజనం చేయడం, అసాధారణ సమయాల్లో నిద్రపోవడం, స్క్రీన్‌ల ముందు ఎక్కువ సమయం గడపడం వంటివి నిద్రను దూరం చేస్తాయి. క్రమమైన నిద్ర షెడ్యూల్ ఫాలో అవ్వడం, రాత్రిపూట తేలికపాటి భోజనం వంటివి నిద్రతో పాటు బరువును కూడా బ్యాలెన్స్ చేస్తాయి.
బరువు చెక్ చేసుకోకండి..
తరచుగా బరువు చూసుకుని.. అనవసరంగా ఆందోళనకు గురికాకండి. ఎందుకంటే మీ బరువు ప్రతిరోజూ మారుతుంది. ఒక్కోసారి పెరగవచ్చు, తగ్గొచ్చు. కానీ అస్తమాను బరువు చూసుకుని ఏమి చేసినా తగ్గలేదనే నిరాశతో పూర్తిగా మానేయడం కన్నా.. మీరు అన్ని క్రమంగా ఫాలో అవుతూ బరువు చెక్ చేసుకుంటే మంచిది. ఒకవేళ తగ్గకపోయినా.. మీరు ఎంత యాక్టివ్‌గా ఉంటున్నారు? ఎంత రెగ్యులర్‌గా ఇవి ఫాలో అవుతున్నారనేది మీకు మంచి ఫీలింగ్ ఇవ్వవచ్చు. కాబట్టి వెయిట్ చెక్ చేసుకుని ఒత్తిడి పెంచుకోకండి.
వైద్య సహాయం
జీవనశైలిలో మార్పులు చేసినప్పుడు క్రమంగా మెరుగుదలలను చూస్తారు. అయితే కొందరికి ఎలాంటి ఫలితాలు ఉండకపోవచ్చు. అలాంటివారు వైద్యుల సహాయం తీసుకోవాలి. అంటే సమస్య ఎక్కడ వస్తుందో గుర్తించాలి. ఏదైనా ఆరోగ్య సమస్య కారణంగా బరువు తగ్గట్లేదో తెలుసుకోవాలి. తప్పని పరిస్థితుల్లో వైద్యులు రోబోటిక్ బారియాట్రిక్ సర్జరీ సిఫార్సు చేయవచ్చు. బాడీ మాస్ ఇండెక్స్ (BMI) 32 కంటే ఎక్కువగా ఉండి.. మధుమేహం, ఊబకాయం, ఆస్టియో ఆర్థరైటిస్, అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా లేదా ఆస్టియో ఆర్థరోసిస్ వంటి ఆరోగ్య సమస్యలు ఉంటే ఇలాంటి సర్జరీలు వైద్యులు సిఫార్సు చేస్తారు.
కాబట్టి బరువు తగ్గడాన్ని స్వల్పకాలిక లక్ష్యంగా కాకుండా.. మీ మొత్తం ఆరోగ్య నిర్వహణలో భాగంగా తీసుకోండి. అప్పుడే మీరు గోల్ రీచ్ అవుతారు. ఈరోజు జిమ్ చేసి ఈరోజు బరువు తగ్గడమనేది అసాధ్యం. చిన్న మార్పు అయినా ఎక్కువ రోజులు చేస్తేనే ఫలితాలు ఉంటాయనేది నిజం. ఇది యాక్సెప్ట్ చేస్తే బరువు తగ్గడంతో పాటు ఆరోగ్యంగా కూడా ఉండగలుగుతారు.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.