Microplastic Found in Human Brain : రోజురోజుకి ప్లాస్టిక్ వినియోగం పెరిగిపోతుంది. దీనివల్ల పర్యావరణమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో నష్టం వాటిల్లుతుంది. ఎన్ని అవగాహన సదస్సులు నిర్వహించినా.. ప్లాస్టిక్​ను ఏదొక రూపాన వినియోగిస్తున్నారు. అలా ఉపయోగించిన ప్లాస్టిక్ ఎంతగా ఎఫెక్ట్ చేస్తుందంటే.. మైక్రోప్లాస్టిక్స్ శరీరంలోకి చేరి.. మెదడులో పేరుకుపోతున్నాయని తాజా అధ్యయనంలో శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్లాస్టిక్​ వినియోగాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శాస్త్రవేత్తలు పలు సూచనలు చేస్తున్నారు. 

పెరిగిన ప్లాస్టిక్ ఉత్పత్తి

మైక్రోప్లాస్టిక్స్ అనే చిన్న ప్లాస్టిక్ ముక్కలు మానవ మెదుడులో పేరుకుపోతున్నట్లు తాజాగా చేసిన అధ్యయనంలో గుర్తించారు. అయితే ఈ మైక్రోప్లాస్టిక్​లు, నానోప్లాస్టిక్​లు మానవ ఆరోగ్యంపై ఏ విధంగా ప్రభావం చూపిస్తాయనే అంశంపై నిపుణులు ఇంకా పరిశోధనలు కొనసాగిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 2000 నుంచి ప్లాస్టిక్ ఉత్పత్తి చేసే పరిమాణం రెట్టింపు అయింది. 2060 నాటికి ఇది మూడు రెట్లు పెరగనుందని అంచనా. 

మెదడులోని మైక్రోప్లాస్టిక్​లపై చేసిన అధ్యయనంలో భాగంగా.. అమెరికాలోని న్యూమెక్సికోలో 2016లో మరణించిన 28 మంది, 2024లో చనిపోయిన 24 మంది మెదడు కణజాలాన్ని శాస్త్రవేత్తలు పరీక్షించారు. కాలక్రమేణా నమూనాలలో మైక్రోప్లాస్టిక్​లు పెరిగినట్లు గుర్తించారు. మెదుడులో ప్లాస్టిక్​ చెంచాకు సమానమైన మైక్రోప్లాస్టిక్​లు కనుగొన్నట్లు తెలిపారు. దానికి సంబంధించిన వివరాలను నేచర్ మెడిసిన్ జర్నల్​లో ప్రచురించారు. 

ఆరోగ్యంపై ప్రభావం

ఈ నేపథ్యంలో మెదడులో మైక్రోప్లాస్టిక్స్ అనే అంశంపై నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. మైక్రోప్లాస్టిక్స్ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో సరైన ఫలితాలు లేనప్పటికీ.. న్యూరోలాజికల్ సమస్యలు, మతిమరువు, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి సమస్యలు వచ్చే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. బ్లడ్ బ్రెయిన్ క్యాన్సర్​ ప్రమదాన్ని రెట్టింపు చేయడం, ఇన్​ఫ్లమేషన్​ పెంచి అవయవాలను దెబ్బతీసే అవకాశముందని చెప్తున్నారు. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు 

ఈ సమస్యలను ప్లాస్టిక్​ను నివారించేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. దానిలో భాగంగా ప్లాస్టిక్ బాటిల్స్ వినియోగం మానేస్తే బెటర్ అని చెప్తున్నారు. అలాగే ప్లాస్టిక్ బాక్స్​లలో ఫుడ్ పెట్టుకోవడం మానేయాలంటున్నారు. ముఖ్యంగా వేడి ఆహారాన్ని ప్లాస్టిక్ బాక్స్​లో పెట్టడం అస్సలు మంచిది కాదని చెప్తున్నారు. గ్లాసు, సిరామిక్ బాక్స్​లు వినియోగిస్తే మంచిదని చెప్తున్నారు. ప్లాస్టిక్​ బాటిల్స్​ రీయూజ్ అస్సలు చేయవద్దని చెప్తున్నారు. 

ఫుడ్ కటింగ్ చేయడానికి ప్లాస్టిక్ బోర్డులకు బదులుగా చెక్కలను వాడితే మంచిదని చెప్తున్నారు. గాలిని ప్యూర్ చేసుకోవడానికి ఎయిర్ ప్యూరీఫైయర్స్ వాడితే మంచిది. పిల్లలకు కూడా పాలు, ఫార్మూలాను ప్లాస్టిక్​ బాటిల్స్​లో ఇవ్వద్దని సిలికాన్ వంటివి ఉపయోగిస్తే బెస్ట్​ అని చెప్తున్నారు. ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం అనేది మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మొదటి అడుగుగా భావించాలి. మీరు తినే ఆహారం నుంచి వాడే నీటి బాటిల్ వరకు ప్రతిదానిలో జాగ్రత్త తీసుకుంటే.. మైక్రోప్లాస్టిక్ ప్రభావాన్ని తగ్గించవచ్చు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.