కరోనా వైరస్.. ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో తెలీదు. మాస్కులు పెట్టుకున్నా.. వ్యాక్సిన్లు తీసుకున్నా.. తన పని తాను చేసుకెళ్లిపోతుంది. తాజాగా కోవిడ్-19 కొత్త వేరియెంట్ ‘ఒమిక్రాన్’ దేశంలో శరవేగంగా వ్యాపిస్తోంది. అధికారిక లెక్కలే దిమ్మతిరిగేలా ఉంటే.. వాస్తవ పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కోవిడ్ నియంత్రణ కోసం ప్రభుత్వాలు లాక్‌డౌన్‌కు బదులు నైట్ కర్ఫ్యూలు విధిస్తున్నాయి. తాజాగా ఢిల్లీలో కెజ్రీవాల్ ప్రభుత్వం వీకెండ్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. 


రాత్రి కర్ఫ్యూ ఎందుకు?: వాస్తవానికి నైట్ కర్ఫ్యూ అనేది ఒక కంటి తుడుపు చర్య. ఆ సమయానికి దాదాపు ప్రజలంతా ఇళ్లలోనే ఉంటారు. రాత్రి 10 నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు బయట తిరిగేవారి సంఖ్య చాలా తక్కువ. అలాంటప్పుడు ఆ సమయంలో కర్ఫ్యూ విధించి ఏం లాభమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఆఫీసులన్నీ తెరుచుకోవడంతో ఉదయం వేళల్లో ప్రజలు రోడ్లపైనే ఉంటున్నారు. కనీసం మాస్క్ కూడా ధరించడం లేదు. నిబంధన అతిక్రమించేవారిపై అధికారులు కనీసం చర్యలు కూడా తీసుకోవడం లేదు. దీంతో నెటిజనులు ప్రభుత్వ చర్యలను చూసి నవ్వుకుంటున్నారు. కరోనా పగటి వేళ పడుకుని.. రాత్రి వేళల్లో నిద్రలేస్తుందా అని ప్రశ్నిస్తున్నారు. పోనీ.. రాత్రివేళ్లలో జనాలు ఎక్కువగా గుమిగూడుతారనే ఉద్దేశం ఉంటే.. సాయంత్రం 6 గంటల నుంచే కర్ఫ్యూ విధించవచ్చు కదా అని అంటున్నారు. తమ అభిప్రాయాన్ని ఫన్నీ మీమ్స్ ద్వారా వెల్లడిస్తున్నారు. అయితే, కరోనా అడ్డుకోవడం.. కేవలం ప్రభుత్వం బాధ్యతే కాదు. ప్రజలు కూడా బాధ్యతగా ఉండాలి. మాస్కులు పెట్టుకుని, సామాజిక దూరాన్ని పాటిస్తేనే.. సేఫ్. ముఖ్యంగా.. కరోనా వచ్చినప్పుడు చేతులెత్తేసే మన ప్రభుత్వాలను తీరును చూసైనా మనమంతా జాగ్రత్తగా ఉండాలి.