పిల్లల ప్రవర్తన విషయంలో తల్లిదండ్రులు ఎప్పుడు కనిపెట్టుకుని ఉండాలి. ఇతరులతో వారి ప్రవర్తన ఎలా ఉంటుంది, నెగటివ్ గా మాట్లాడుతుంటే వాళ్ళని గద్దించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అటువంటి ప్రవర్తన వారి మానసిక పరిస్థితి మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. పిల్లలో చెడు ప్రవర్తన అసలు స్వాగతించే విషయం కాదు. మీ పిల్లల్లో ఇటువంటి ప్రతికూల లక్షణాలు కనిపిస్తే వెంటనే నిరోధించాలి. అందుకే పెద్దలు అంటుంటారు.. మొక్కై వంగనది మ్రానైనాక వంగవు అని. చిన్న వయస్సులోనే వాళ్ళు చేసిన తప్పులు సరిదిద్ది మంచి మార్గంలో నడిచే విధంగా ప్రోత్సహించాలి.


పిల్లలు ఏది అడిగినా ఏం చేసినా నో చెప్పడం వంటివి తరచూ చెయ్యకూడదు. తమకన్నా పెద్ద వారితో మాట్లాడేటప్పుడు వినయంగా క్రమశిక్షణగా మాట్లాడటం అలవాటు చెయ్యాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు అసభ్యకరంగా మాట్లాడిన వెంటనే వారిని పక్కకి తీసుకెళ్ళి ఎలా మాట్లాడాలి ఎక్కడ తప్పుగా మాట్లాడారు అనే విషయం అర్థం అయ్యేలాగా చెప్పాలి. అంతే కానీ వారిని శరీరారకంగా దండించడం అనేది తగిన మార్గం కాదు. వీడియో గేమ్స్, ఫోన్స్ వంటి వాటిని వాళ్ళకి దూరంగా ఉంచాలి. తమ తప్పులు తెలుసుకునే విధంగా చెప్పాలి.


ఇతరులని చిన్న చూపు చూడకూడదు


కులం, మతం, వర్ణం, డబ్బు.. ఇలా ఏదైనా ఎత్తి చూపి ఇతరులని అగౌరవపరచడం చెయ్యకూడదు. అందరినీ సమానంగా చూడటం అనేది నేర్పించాలి. ఎక్కడ నుంచి వచ్చినా డబ్బు హోదా ఏదైనా దాన్ని పక్కన పెట్టి అందరూ సమానం అనే భావన వచ్చే విధంగా పిల్లలకి మంచి నేర్పించడం చాలా ముఖ్యం.


అతిగా బుజ్జగించకూడదు


పిల్లల్ని ఎక్కువగా పాంపరింగ్ చెయ్యకూడదు. అది వారి మీద చెడు ప్రభావం చూపిస్తుంది. ఏం చేసినా తల్లిదండ్రులు ఏమి అనరులే అనే ధీమాతో కొంతమంది ప్రవర్తిస్తారు. డబ్బు ఉన్నదనే అహంతో ఎదుటి వారిని చులకనగా చూస్తారు. అది మంచి పద్ధతి కాదు అనే విషయం తల్లిదండ్రులు నేర్పించాలి. డబ్బు, శ్రమ విలువ వారికి తెలిసి వచ్చేలా చెయ్యాలి. వాళ్ళు చేసే చిన్న చిన్న పనులు మంచివి అయితే మెచ్చుకోవడం చెయ్యాలి. ఎదుటి వాళ్ళు ఏదైనా సహాయం చేస్తే కృతజ్ఞతలు చెప్పడం అలవాటు చెయ్యాలి.


ఇతరులని వేధిస్తే దండించాలి


పిల్లల ప్రవర్తన గమనించాలి. ఇతరులని వేధిస్తుంటే అది తప్పని అర్థం అయ్యేలాగా చెప్పాలి. అటువంటి వాటిని అసలు ప్రోత్సహించకూడదు. మన బిడ్డ వేధింపులకి గురయితే ఎంత బాధగా ఉంటుందో ఎదుటి వారి పరిస్థితి అలాగే ఉంటుంది. బూతులు మాట్లాడటం, దుర్భాషలాడటం వంటివి చేస్తుంటే వెంటనే పరిష్కరించాలి. ఎంత పెద్ద తప్పు చేసిన దాన్ని సరిదిద్దవలసిన బాధ్యత తల్లిదండ్రుల మీదే ఉంది.


అబద్ధాలు చెప్పకూడదు


అబద్ధాలు చెప్పడం వల్ల ఒక్కోసారి జీవితాలే నాశనం అయ్యే పరిస్థితి రావచ్చు. చిన్న వయస్సులోనే అటువంటి అలవాటు మాన్పించాలి. చిన్న పిల్ల కదా వాళ్ళకి ఏం తెలుసులే అని అబద్ధాలు చెప్పడం ప్రోత్సహిస్తే అది పెద్దయిన తర్వాత తీవ్ర సమస్యలకి దారి తీసే ప్రమాదం ఉంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: బాదం పప్పులు పేగుల ఆరోగ్యానికి మంచివేనా? అధ్యయనంలో ఏం తేలింది?