Creative Home Decoration Tips for Dussehra : విజయదశమి (Vijayadashami 2025) వచ్చేసింది. ఈ సమయంలో పండుగ వాతావరణం దాదాపు అందరి ఇళ్లల్లోనూ కనిపిస్తుంది. సెలవులు ఉండడంతో కుటుంబం అంతా ఓ చోట చేరుతుంది. ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు. ఈ సమయంలో ఇంటిని అందంగా ఉంచుకోవడం అతి పెద్ద పని. అయితే మీరు దసరా(Dussehra) పండగకి ఇంటిని అందంగా తీర్చిదిద్దాలనుకుంటే ఈ టిప్స్ మీకోసమే. ఈ చిన్న మార్పులు మీ ఇంటికి చక్కని లుక్ ఇవ్వడంతో పాటు.. నవరాత్రి వైబ్‌ని పెంచుతాయి.
పూజ స్థలం..
దుర్గాదేవి ఫోటో లేదా విగ్రహాన్ని ఉంచేందుకు ప్రత్యేకమైన స్థలం ఏర్పాటు చేసుకోండి. చెక్క లేదా లోహంతో తయారు చేసిన పూజా మండపంలో అమ్మవారిని ఉంచి.. పూజ చేసుకోవచ్చు. ఇంట్లో మీరు పెట్టుకునే ఈ చిన్ని పూజా మండపం మొత్తం ఇంటికే పండుగ శోభను తీసుకువస్తుంది.
లైటింగ్..
పూజా మండపంతో పాటు.. ఇంటి కిటికీలు, ద్వారాబంధాలు, మొక్కల దగ్గర మీరు ఫెయిరీ లైట్స్ పెట్టవచ్చు. LED లైట్లు కూడా మీరు ఉపయోగించవచ్చు. ఇవి పండుగ వాతావరణాన్ని రెట్టింపు చేస్తాయి. వీటిని ఫర్నీచర్‌పై కూడా వేసుకోవచ్చు. సాయంత్రం వేళ చూసేందుకు ఇవి మంచి లుక్‌ని ఇస్తాయి.
కుషన్స్..
పండుగ సమయంలో ఫర్నీచర్ మార్చలేము కాబట్టి.. ఫర్నీచర్ అందాన్ని మెరుగుపరిచే కొన్ని టిప్స్ ఫాలో అవ్వవచ్చు. మీ చైర్స్, కుర్చీలు, సోఫా కవర్లు మార్చవచ్చు. ఎంబ్రాయిడరీ చేసిన కుషన్స్ లేదా థీమ్‌తో చేసిన కవర్స్‌ని వేయవచ్చు. ఇవి ఇంటి లుక్‌ని మార్చడంలో ప్రధానపాత్ర పోషిస్తాయి. అప్పటివరకు అలవాటైన కుషన్స్ మారడంతో ఫర్నీచర్ కూడా మార్చారా అనే ఫీల్ వస్తుంది.
ముగ్గులు
పండుగను ముగ్గులు రెట్టింపు చేస్తాయి. కాబట్టి ఇంటి ముందు లేదా ప్రవేశ ద్వారా వద్ద.. పూజా చేసుకునే ప్లేస్‌లో.. బాల్కనీలో మీరు ముగ్గులు వేసి.. వాటికి రంగులు దిద్దవచ్చు. ఉదయం వేసిన ముగ్గుపై సాయంత్రం దీపాలు పెడితే ఆ లుక్ ఎంత బాగుంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మీరు పువ్వులతో కూడా ముగ్గులు వేయవచ్చు.
స్పేస్ ఇవ్వండి..
ఇంటిని సర్దడం అంటే అన్ని దగ్గరికి పేర్చేయడం కాదు. అవసరం లేనివి దూరంగా లేదా అటకపై పెట్టి.. ఇంటికి స్పేస్ ఇవ్వాలి. అంటే మీరు తిరిగేందుకు.. ఎవరైనా వస్తే కూర్చోనేందుకు, స్వేచ్ఛగా తిరగలిగేలా ఉంచుకోవాలి. చాలామంది అవసరం లేనివి.. ఉపయోగించనవి కూడా ఉంచేసి.. ఇంటిని ఇరుకుగా చేసుకుంటారు. అది ఏమాత్రం మంచిది కాదు. అవసరం లేనివి లేదా ఉపయోగించనివి ఎవరికైనా ఇచ్చేయండి లేదా పడేయండి. ఇళ్లు ఎంత ప్రశాంతంగా ఉంటే మీరు అంత ప్రశాంతంగా ఉండగలుగుతారని గుర్తించుకోండి.
మరిన్ని టిప్స్..
అన్నింటికంటే ముందు ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గుమ్మాలకు మామిడి ఆకులు కట్టడం లేదా పువ్వులు కట్టడం వల్ల కూడా ఇంటికి మంచి లుక్ వస్తుంది. అలాగే ఇంట్లో దీపారాధన చేయడం లేదా సాంబ్రాణి, అగరబత్తులు వంటివి వెలిగించడం వల్ల మంచి సువాసన వస్తుంది. గుమ్మం దగ్గర డోర్ మ్యాట్స్ కచ్చితంగా వేయండి. ఈ తరహా మార్పులు చేయడం వల్ల ఇంట్లో పండుగ వాతావరణం పెరగడమే కాదు.. మీకు కూడా ప్రశాంతంగా ఉంటుంది.