Winter Drinks for a Healthy Life : చలికాలంలో దగ్గు, జలుబు, ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులు కామన్. కానీ.. అవి వచ్చాయంటే సరిగ్గా తినలేము, కూర్చోలేము, పడుకోలేము, పని చేసుకులేము అన్నట్టు పరిస్థితి ఉంటుంది. దగ్గు, తుమ్ములనేవి అస్సలు కంట్రోల చేయలేము. ముక్కు కూడా జలుబు వల్ల కారుతూ.. లేదంటే పట్టేసి ఊపిరాడనివ్వకుండా ఇబ్బంది పెడుతుంది. అంతేకాకుండా గొంతు కూడా చాలా నొప్పిగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఇమ్మూనిటీ పెంచుకోవడం చాలా ముఖ్యం. అయితే కొన్ని ఇంటి చిట్కాలు మీ సమస్యను తగ్గించడమే కాకుండా.. రోగనిరోధక వ్యవస్థను పెంచి.. మీపై ఎలాంటి ప్రతికూల ప్రభావాలు లేకుండా చేస్తాయి. జలుబు, ఫ్లూను దూరం చేసే.. ఇంటి చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 


అల్లం టీ


ఎన్నో ఏళ్లుగా వివిధ ఆరోగ్య ప్రయోజనాల కోసం అల్లం టీని తమ రోటీన్​లో చేర్చుకుంటున్నారు. ముఖ్యంగా వింటర్​లో ఇది చేసే ప్రయోజనాలు అన్ని ఇన్ని కాదు. ఇవి మీకు జలుబు, దగ్గు, ఫ్లూ వంటి లక్షణాల నుంచి వెంటనే ఉపశమనం అందిస్తాయి. అంతేకాకుండా ఇది మిమ్మల్ని హైడ్రేటెడ్​గా ఉంచుతుంది. కడుపు నొప్పి వంటి సమస్యలనుంచి ఉపశమనం కలిగిస్తుంది. కొన్ని తాజా అల్లం ముక్కలను వేడి నీటలో వేసి లేదా.. టీలో కలిపి తీసుకుంటే మీకు ఇమ్యూనిటీ అందుతుంది. 


పాలు, పసుపు


జ్వరం వచ్చిందంటే ఓ గ్లాసు పాలల్లో పసుపు వేసుకుని తాగుతారు చాలామంది. ఎందుకంటే ఇది రోగనిరోధక శక్తిని పెంచి.. జ్వరాన్ని తగ్గిస్తుంది కాబట్టి. అయితే ఇది ఫ్లూ లక్షణాలను కూడా తరిమేస్తుంది. పసుపులోని యాంటీ ఆక్సిడెంట్స్​ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఫ్లూ లక్షణాలు తగ్గించి.. ఇమ్యూనిటీని పెంచుతాయి. ఇది శ్వాసకోశ ఇబ్బందులు, వాపు, కీళ్ల ఇబ్బందులు, కాలేయ సమస్యలు, జీర్ణ సమస్యలు, మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుంది. 


నిమ్మరసం, తేనె


నిమ్మకాయ రసం శరీరంలోని శ్లేష్మాన్ని క్లియర్ చేయడంలో సహాయం చేస్తుంది. ఇది శరీరాన్ని డిటాక్స్​ కూడా చేస్తుంది. తేనెలోని పెరాక్సైడ్​లు.. శరీరంలోని వైరస్​లను బయటకు పంపిస్తాయి. జీర్ణక్రియ, జీవక్రియను మెరుగుపరుస్తాయి. జలుబు, దగ్గు లక్షణాలు తగ్గించుకోవాలనుకుంటే.. మీరు గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తాగవచ్చు. దీనిలోని విటమిన్ సి మీ శరీరంలో రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. 


ఉసిరి


శీతాకాలంలో ఎక్కువగా దొరికే వాటిలో ఉసిరి ఒకటి. ఇది ఫ్లూ, జలుబు వంటి సమస్యలకు ఎన్నో శతాబ్ధాలుగా ఇంటి నివారిణిగా ఉపయోగపడుతుంది. దీనిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది శరీరంలోని తెల్ల రక్త కణాల సంశ్లేషణను పెంచుతుంది. వివిధ వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడేలా మీ శరీరంలో రోగనిరోధకశక్తిని పెంచుతుంది. రోజూ ఉసిరికాయ తింటే.. రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది. కాలేయ పనితీరు మెరుగుపడటంతో పాటు.. మధుమేహం కూడా కంట్రోల్​లో ఉంటుంది. 


అవిసె గింజలు


జుట్టు, చర్మ సౌందర్య రక్షణ కోసం అవిసె గింజలు ఉపయోగిస్తారు. కానీ.. ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా అవిసె గింజలు ఉపయోగించవచ్చు. దీనిలోని ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ మీ శరీరాన్ని రోగాల బారి నుంచి రక్షిస్తాయి. జలుబు, ఫ్లూకి వ్యతిరేకంగా పోరాడటంలో సహాయం చేస్తాయి. దీనికోసం మీరు 2 టీస్పూన్ల అవిసె గింజలను ఒక కప్పు నీటితో కలిపి చిక్కగా.. తినేలా ఉడికించుకోవాలి. చల్లారిన తర్వాత వాటిని సేవిస్తే.. జలుబు, ఫ్లూ వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. 


ఈ ఇంటి చిట్కాలు వచ్చిన వ్యాధులను తగ్గించడంలోనే కాదు.. ఫ్లూ లక్షణాలు రాకుండా కూడా మీ శరీరాన్ని సిద్ధం చేస్తాయి. రోగనిరోధకశక్తిని పెంచుతాయి. పైగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్​ కూడా ఉండవు. 


Also Read : పనిచేస్తుంటే కండరాలు పట్టేశాయా? అయితే ఈ రిలీఫ్ టెక్నిక్స్ మీకోసమే..