ప్రశ్న: నాకు పెళ్లయి ఏడేళ్లు అయింది. మాది పెద్దల కుదిర్చిన వివాహమే. మా అత్తా, మామ గారికి మాకు కొడుకు పుట్టాలని ఉండేది. కానీ ముగ్గురు కూతుళ్లే పుట్టారు. ఈ కాలంలో కూడా ముగ్గురు పిల్లలు కనడానికి కారణం కొడుకు పుడతాడేమో అన్న ఆశ. నాలుగుసారీ కూడా కూతురు పుడితే పెంచడం కష్టంగా మారుతుందని ఆపరేషన్ చేయించుకున్నాను. మా ఇంటికి వారసుడిని ఇవ్వలేదంటూ మా అత్త మామ బాగా తిడుతున్నారు. నేను ఇప్పుడు ముగ్గురు ఆడపిల్లల తల్లిని. వయసు 32. నా భర్త కొడుకు లేని కారణంగా నన్ను వదిలేస్తానంటున్నాడు. అతనిపై తల్లిదండ్రుల ప్రభావం ఎక్కువగా ఉంది. అతనికి మా కూతుళ్లంటే ఇష్టమే. కానీ కొడుకు కావాలని అంటున్నాడు. మాది మధ్య తరగతి కుటుంబం. ఆయన వదిలేస్తే నేను నా ముగ్గురు పిల్లల్ని పెంచడం ఎలా? ఏం చేయాలో అర్థం కావడం లేదు?


జవాబు: ఇది 21వ శతాబ్దం. అమ్మాయిలు అంతరిక్షపు అంచులను తాకుతున్న కాలం. ఈ కాలంలో కూడా ఇంకా కొడుకు కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలు ఉండడం దురదృష్టకరం. ముగ్గురు ఆడపిల్లలను కన్నందుకు మిమ్మల్ని వదిలేస్తే అతను చట్టపరంగా కూడా చాలా తప్పులు చేసినట్టే లెక్క. ఆడపిల్లల పుట్టుక వెనక మీ ఒక్కదాని బాధ్యతే లేదు, మీ భర్త భాగస్వామ్యం కూడా ఉంది. ఆ విషయాన్ని కూర్చోబెట్టి ఆయనకు చెప్పండి. పుట్టబోయే బిడ్డ లింగాన్ని నిర్ణయించేది తల్లి కాదు, తండ్రే. అతను వేరే వివాహం చేసుకున్నా కూడా అతనికి ఆడపిల్ల పుడితే ఏం చేస్తాడో ప్రశ్నించండి. ఆడపిల్లలు చదువుల్లో, ఉద్యోగాల్లో రాణిస్తున్న ఈ సమయంలో కూడా ఇంకా కొడుకు కోసం అంతగా ఎదురు చూడాల్సిన అవసరం లేదని వివరించండి. ఇప్పుడు ఆడపిల్ల ఏమాత్రం భారం కాదు. మీ అత్తగారు కూడా ఒక స్త్రీ అన్న విషయాన్ని మర్చిపోయింది. ఆ విషయాన్ని ఆమెకు అర్థమయ్యేలా చెప్పండి. ఆమె తల్లిదండ్రులు ఆమె పుట్టినప్పుడు ఆడపిల్ల పుట్టిందని వదిలేస్తే ఏమయ్యేదో వివరించండి. 


ఆడపిల్ల పుట్టుక వెనక ముఖ్య కారణం పురుషులే. తల్లిలో కేవలం ఎక్స్ క్రోమోజోములు మాత్రమే ఉంటాయి. మగవాడిలో ఎక్స్, వై అనే రెండు రకాల క్రోమోజోములు ఉంటాయి. వీర్యం ద్వారా భర్త వై క్రోమ్‌జోమ్‌ను భార్యకు అందిస్తే ఆమె గర్భంలో ఎక్స్, వై క్రోమోజోములు కలిసి మగబిడ్డగా రూపాంతరం చెందుతాయి. భర్త ఎక్స్ క్రోమోజోమ్ అందిస్తే గర్భంలో రెండు ఎక్స్ క్రోమోజోములు కలిసి ఆడపిల్లగా మారుతాయి. దీన్ని బట్టి ఆడపిల్ల పుట్టుక వెనుక మీ భర్త భాగస్వామ్యమే అధికంగా ఉన్నట్టు చెప్పండి. ఇంతా చెప్పిన కూడా అతను వినకపోతే మానసిక వైద్యుల వద్దకు కౌన్సెలింగ్ కు తీసుకెళ్లండి. అయినా ఫలితం లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోండి. ముందుగా మీరు ధైర్యాన్ని తెచ్చుకోండి. చదువుకున్న వారైతే ఉద్యోగప్రయత్నాలు చేయండి. చదువు లేకపోతే స్వయం ఉపాధి పొందేలా ఏమైనా అవకాశాలు ఉన్నాయేమో వెతకండి. స్త్రీ ఆర్ధికంగా ఎవరి మీదైనా ఆధారపడినంత కాలం ఇలా భయపడుతూనే ఉండాలి. 



Also read: మీరు తినే ఈ తెల్లని పదార్థం మిమ్మల్ని తన బానిసగా చేసుకుంటుంది, ఎంత తగ్గిస్తే అంత మంచిది