ప్రశ్న: అమ్మకు, నాన్నకు నేనొక్కదాన్నే కూతురిని. మా అమ్మ నా చిన్నప్పుడే మరణించింది. అప్పటినుంచి మా నాన్నే నన్ను చూసుకున్నారు. అమ్మగా, నాన్నగా రెండు బాధ్యతలను ఆయనే నిర్వహించారు. ఏడాది క్రితం నాకు పెళ్లయింది. మంచి సంబంధం చూసి చేశారు. అప్పటినుంచి ఇంట్లో నాన్నగారు ఒక్కరే ఉంటున్నారు. దీంతో ఆయన చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. ఎన్నోసార్లు నాకు ఫోన్ చేసి ఒంటరితనాన్ని భరించలేకపోతున్నానని అంటున్నారు. ఆ ఒంటరితనం వల్ల డిప్రెషన్ గా అనిపిస్తోందని చెబుతున్నారు. అయితే హఠాత్తుగా ఈ మధ్యన ఫోన్ చేసి తాను రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పారు. మా వీధిలోనే ఉండే ఒక మహిళను పెళ్లి చేసుకుంటానని చెబుతున్నారు. ఆవిడకు కూడా భర్త లేరు. వాళ్ల గురించి మాకు పెద్దగా ఏమీ తెలియదు. ఆవిడ మా నాన్నగారు తరచు వాకింగ్ కి వెళ్ళినప్పుడు మాట్లాడుకునేవారు. ఆమెతో పరిచయం అయ్యాక మా నాన్నగారిలో మార్పు వచ్చింది. ఆమెతో కలిసి జీవిస్తానని, రెండో పెళ్లి చేసుకుంటానని అంటున్నారు. నాకు ఇష్టం లేదు. ఈ విషయంలో మా నాన్నగారికి, నాకు గొడవ కూడా అయింది. నేను ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందో మీరే చెప్పండి.
జవాబు: మీరు తీసుకునే నిర్ణయం ఎలా ఉండాలో మీ మనసును అడగండి. మీరు ఒక తోడును వెతుక్కుని వెళ్లి పెళ్లి చేసుకున్నారు. మరి మీ నాన్నగారికి ఎవరు తోడుంటారు? మీకు కుటుంబం తోడు అవసరం కానీ చిన్నప్పటి నుంచి మీరే లోకంగా బతికిన మీ నాన్నగారికి ఒక తోడు ఉండాలనుకోవడంలో తప్పేముంది? అది కూడా మీ అమ్మగారు చనిపోయిన వెంటనే ఆయన రెండో పెళ్లి చేసుకుంటే అతను మంచివాడు కాదని మీరు అనుకున్నా అర్థం ఉంది. కానీ మీ బాధ్యతలు అన్నీ తీరిపోయాకే ఆయన తన కోసం ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. నిజానికి ఆయన కాదు మీరే ఈ నిర్ణయాన్ని తీసుకోవాలి. ఆయనకంటూ ఒక తోడును వెతికి పెట్టి ఇవ్వాలి. మీరు సంతోషంగా మీ భర్తతో జీవిస్తున్నారు. మరి మీ నాన్నగారి ఒంటరిగా ఎంత కాలం జీవిస్తారు? మీరు ఒకసారి ఒంటరిగా ఒక నెలపాటు ఉండి చూడండి... అది ఎంత భయంకరమైనదో తెలుస్తుంది. అందులోనూ మీ నాన్నగారు ఎవరు పడితే వారిని పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు. కొన్ని నెలల పాటు ఒక మహిళతో పరిచయం పెంచుకొని, ఆమెతో కొన్ని రోజులు ప్రయాణించాకే ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. అంటే ఆమెలో ఈయనకు తగ్గ అలవాట్లు, గుణాలు కనిపించి ఉంటాయి. ఆమెతో కలిసి సంతోషంగా జీవించగలనని మీ నాన్నగారు అనుకుని ఉంటారు. కాబట్టి మీరు మీ నాన్నగారి నిర్ణయాన్ని మీరు స్వాగతించాలి.
చిన్నప్పటినుంచి మీరూ, మీ నాన్నగారే ఇంట్లో ఉండేవారు. మీకు పెళ్లి చేస్తే తాను ఒంటరి అయిపోతానని స్వార్థంగా ఆలోచించి, ఆయన మీకు పెళ్లి చేయకుండా ఉండుంటే మీరు ఏమై ఉండేవారో ఆలోచించుకోండి. తన స్వార్ధాన్ని ఎక్కడా చూసుకోలేదు మీ నాన్నగారు. కాబట్టి ఇప్పుడు మీరు ఆయన కోసం ఈ త్యాగాన్ని చేయాలి. మీ కుటుంబంలోకి ఒక వ్యక్తిని ఆహ్వానించాలి. అది కూడా మీ నాన్నగారు ఎవరితో అయితే జీవితాన్ని పంచుకోవాలనుకుంటారో ఆమెతో మీరు కూడా మాట్లాడండి. ఆమె ఆలోచనలు, పద్ధతులు తెలుసుకోండి. ఆమెతో ఒక అనుబంధాన్ని ఏర్పరచుకోండి. మీ నాన్నగారికి ఇప్పుడు 63 ఏళ్ల వయసు అని చెప్పారు. ఆ వయసులో పెళ్లి చేసుకుంటే సమాజం ఏమనుకుంటుందో అనే భయంలో మీరు ఉన్నారు. కానీ మీ నాన్నగారు సమాజం గురించి ఆలోచించకుండా, తన గురించి ఆలోచించకుండా... కేవలం మీ గురించి మాత్రమే ఆలోచించి చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చాలా ప్రేమగా పెంచారు. ఇప్పుడు చివరి స్టేజ్లో తనకంటూ ఒక తోడు కావాలని, ఒంటరితనాన్ని భరించలేకపోతున్నాను అని అంటున్నారు, ఆయన తీసుకున్న నిర్ణయం మీకు ఎలాంటి హాని కలిగించేది కాదు. ఎందుకంటే వారికి పిల్లలు పుట్టే అవకాశం కూడా ఉండదు. కాబట్టి మీకు బయటకు చెప్పలేని భయాలు ఏమైనా ఉన్నా కూడా వాటిని తీసి పెట్టండి. ఆయన ఆస్తికి, అన్నిటికీ మీరు ఒక్కరే వారసులు అవుతారు. కేవలం ఆయన ఒక తోడును అడుగుతున్నారు. దాన్ని ఆనందంగా మీరు ఒప్పుకొని దగ్గరుండి పెళ్లి చేయండి.
Also read: ఎర్ర టమాటాలతో పోలిస్తే నల్ల టమాటాలే ఆరోగ్యానికి మంచిదట