Most Mysterious Places in India : భారతదేశంలోని ప్రతి అంగుళంలోనూ మిస్టరీ ఉంటుంది. ఆసక్తితో నిండిన కథనాలు ఉంటాయి. మనస్సును కదిలించే, గందరగోళానికి గురిచేసే, వెన్నులో వణుకు పుట్టించే గమ్యస్థానాలకు నిలయంగా చెప్తారు. కొన్ని ప్రదేశాలు ఆసక్తికరంగా ఉంటే.. కొన్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తాయి. ఏ శాస్త్రాలు, శక్తులు వాటిని వివరించలేకపోయాయి. అయితే ఇండియాలో అలాంటి ఆసక్తిగల ప్రదేశాలు ఏంటో.. వాటి వెనుక ఉన్న ఆసక్తికర కథనాలు, ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
గాల్లో తేలే రాయి
ఆ రాయిని 11 మంది ఒకేసారి వేళ్లు పెట్టి.. "కమర్ అలీ దర్వేష్" అని తాకితే.. ఆ రాయి గాల్లోకి లేచి పైకి ఎగురుతుందట. ఈ రాయి బరువు సుమారు 90 కిలోల వరకు ఉంటుంది. ఇది శతాబ్దాల నాటి విశేషంగా, అద్భుతంగా, మత విశ్వాసంగా చెప్తారు. అయితే ఇప్పటికీ రాయి ఎగరడానికి కారణం ఎవరికీ తెలియలేదు. మిస్టరీగానే ఉంది. కానీ ఆ ప్రాంతంలో ఇది ఒక పవిత్రమైన విశ్వాస స్థలంగా చెప్తారు. కమర్ అలీ దర్వేష్ అనే సాధువు ఆ రాయికి శాపం పెట్టారని.. ఆయన పేరుతో పిలిస్తేనే అది లేస్తుందని నమ్ముతారు.
కర్ణి మాత ఆలయం
రాజస్థాన్‌లోని కర్ణి మాత ఆలయంలో 20,000 కంటే ఎక్కువ ఎలుకలు ఉంటాయి. అయితే ఈ ఎలుకలను అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు. అలాగే పూజిస్తారు కూడా. వాటికి ఏమి జరగకుండా కాపాడుతారు. ఎందుకంటే ఈ ఎలుకలు కర్ణి మాతకు చెందిన బంధువులుగా భావిస్తారు. వారు పునర్జన్మ ఎత్తారని.. వారు ఆ మాత కుటుంబ సభ్యులని నమ్ముతారు.
శని శింగనాపూర్
మహారాష్ట్రలోని శని శింగానాపూర్ గ్రామంలో ఇప్పటివరకు దొంగతనం జరగలేదట. అందుకే ఇక్కడ ఏ ఇంటికి, పాఠశాలకు, ఇతర ఏ భవనాలకు తలుపులు ఉండవట. ఇక్కడి గ్రామస్తులు నేరాలు జరగకపోవడానికి శని దేవుడే కారణమని భావిస్తారు. ఆయన్ని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు.
లేహ్ అయస్కాంత కొండ
లేహ్ లడఖ్‌లోని అయస్కాంత కొండ ఉంది. ఇక్కడ వాహనాల ఇంజిన్‌లను ఆపివేసినా అవి నడుస్తాయి. ఏదో అతీంద్రియ శక్తి లాగుతున్నట్లుగా అవి కదులుతాయట. కొండ గురుత్వాకర్షణ శక్తి వల్ల కలిగే దృశ్య భ్రమేనని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
లేపాక్షి
ఆంధ్రప్రదేశ్‌లోని లేపాక్షిలో స్తంభాలు చాలానే ఉన్నాయి. అయితే వాటితో పాటు వేలాడే స్తంభం కూడా ఒకటి ఉంది. ఇది నేలను తాకకుండా ఉంటుందట. దానికింద నుంచి పేపర్, కర్ర వంటివి ఏమి పెట్టి లాగినా అడ్డు లేకుండా వస్తాయట. అయితే దానికి గల కారణం ఇప్పటికీ తెలియదు.
కొడిని, కవలల భూమి
కేరళలోని కొడిని అనే ప్రదేశం ఉంది. ఇక్కడ రహస్యం ఏమిటంటే ఎక్కువమంది కవలలు ఉంటారట. కొన్ని అంచనాల ప్రకారం.. ఈ గ్రామంలో 200 జతల కవలలు ఉన్నారట. స్థానికంగా పండించిన చిలగడదుంపల వినియోగమే దీనికి కారణమని భావిస్తున్నారు. జెనిటికల్ కారణాలు, నీరు, పర్యావరణం వల్ల ఇలా జరుగుతున్నాయని పరిశోధకులు చెప్తున్నారు.
కొంగ్కా లా పాస్
భారతీయ, చైనా సరిహద్దులోని కొంగ్కా లా పాస్ అనే వివాదాస్పద ప్రాంతం ఉంది. అయితే ఇక్కడ గ్రహాంతరవాసుల గురించి అనేక నివేదికలు వచ్చాయి. ఈ ప్రాంతంలో గుర్తు తెలియని వస్తువులను ఎగురుతున్నట్లు చాలామంది ప్రత్యక్ష సాక్షులు చూశారట. ఇది గ్రహాంతరవాసుల ప్రదేశమని చాలామంది నమ్ముతారు.
మీరు ఎప్పుడైనా అడ్వెంచర్ చేయాలనుకుంటే ఈ ప్రదేశాలకు వెళ్లి ఈ వింతలను చూడొచ్చు. అయితే కొంగ్కా లా పాస్‌కి మాత్రం వెళ్లలేరు. చైనా, ఇండియా బోర్డర్ కాబట్టి వెళ్లకపోవడమే మంచిది.