Moringa Seeds Benefits : మునగ కాయలను సూపర్ ఫుడ్స్ అంటారు. మునగ ఆకులు కూడా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఇస్తాయి. అయితే మునగ గింజలు కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తాయని నిపుణులు చెప్తున్నారు. వీటిని నెలరోజులు తీసుకుంటే శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి? వీటిని ఎలా తీసుకుంటే మంచిది? సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో లేదో ఇప్పుడు చూసేద్దాం.
ఎలా తీసుకోవాలంటే..
రోజుకు 2 నుంచి 3 గింజలు తీసుకోవచ్చు. దానిని 5 నుంచి 6 వరకు పెంచుకోవచ్చు. పొట్టు తీసేసి పచ్చిగా తినొచ్చు. లేదా వేయించి తీసుకోవచ్చు. పొడి చేసి స్మూతీస్, సూప్స్‌లో తీసుకోవచ్చు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో లేదా భోజనం తర్వాత తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.
మునగ గింజల్లోని పోషకాలు..
మునగ గింజలు చిన్నవే అయినా పోషకాలతో నిండి ఉంటాయి. వీటిలో విటమిన్ సి, కాల్షియం, ఐరన్, పొటాషియం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఎమినో యాసిడ్స్, యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి శరీరానికి మంచి పోషకాలు అందిస్తాయి. అయితే వీటిని 30 రోజులు వరుసగా తింటే కలిగే లాభాలు ఏంటో చూసేద్దాం.
డీటాక్స్
మునగలోని యాంటీబ్యాక్టీరియల్ గుణాలు శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపడంలో సహాయపడతాయి. దీనివల్ల లివర్ పనితీరు మెరుగుపడుతుంది. జీర్ణక్రియ బాగుంటుంది. మలబద్ధకం తగ్గుతుంది.
షుగర్, బీపీ కంట్రోల్
మునగ గింజలు రక్తంలో గ్లూకోజ్ రిలీజ్‌ను చేస్తాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఉపయోగకరం కావచ్చు. పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల రక్తనాళాలు రిలాక్స్ అవుతాయి. ఇది హై బీపీ నియంత్రణకు హెల్ప్ చేస్తుంది.
బరువు తగ్గేందుకు
మునగ గింజల్లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల.. ఎక్కువసేపు ఆకలి అనిపించదు. మెటబాలిజం పెరుగుతుంది. ఇది బరువు తగ్గడానికి హెల్ప్ చేస్తుంది.
చర్మం, జుట్టు ఆరోగ్యం
మునగలోని యాంటీఆక్సిడెంట్స్ వల్ల.. చర్మం క్లియర్‌గా ఉంటుంది. మొటిమలు తగ్గడంతో పాటు జుట్టు బలంగా పెరుగుతుంది.
లైంగిక ఆరోగ్యం
పురాతన వైద్యంలో మునగను సహజ ఆఫ్రొడిసియాక్‌గా ఉపయోగించేవారు. దీనివల్ల రక్త ప్రసరణ, హార్మోన్ బ్యాలెన్స్ మెరుగుపడి స్టామినా పెరుగుతుంది.
సైడ్ ఎఫెక్ట్స్ కూడా
మునగ గింజలు ఎక్కువగా తీసుకుంటే కూడా కొన్ని సమస్యలు రావచ్చు. వాంతులు, డయేరియా, పొట్ట ఉబ్బరం, లివర్‌పై ఒత్తిడి పడడంతో పాటు.. బీపీ లేదా షుగర్ చాలా తగ్గిపోవడం జరగవచ్చు. గర్భిణీలు కూడా తీసుకోకపోవడమే మంచిది. కానీ వీటిని డైట్లో చేర్చుకునే ముందు కచ్చితంగా వైద్యుల సూచనలు తీసుకోవడం మంచిది.
గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.
