వేసవి వేడి నుంచి వర్షా కాలం మంచి ఊరటనిస్తుంది. సీజన్ మారే సరికి వాతావరణంలో మార్పులు వస్తుంటాయి. దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులు చుట్టుముడుతుంటాయి. ఇవి కాకుండా ఎక్కువ మందిలో చర్మం పొడి బారడం, జుట్టు ఊడిపోవడం వంటి సమస్యలు వస్తాయి. వానలో తడవడం వల్ల చాలా మంది స్కిన్ పాడవుతుంది. కాస్త జిడ్డు చర్మం కలవారికైతే స్కిన్ మరింత ఆయిలీగా తయారవుతుంది. ఫలితంగా ముఖంపై మొటిమలు, మచ్చలు వంటివి వస్తాయి. ఈ సీజన్‌లో చర్మం దురద పెట్టడం, పగలడం, ఇతర ఇన్‌ఫెక్షన్లు వంటి సమస్యలు కూడా వస్తుంటాయి. ఇలాంటి వాతావరణంలో మన చర్మం, ముఖాలను రక్షించుకోవాలంటే ఈ చిట్కాలు తప్పక పాటించాలి.
- వర్షాకాలం వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల ముఖంపై జిడ్డు పేరుకుపోతుంది. ఉదయం, సాయంత్రం నీటితో ముఖాన్నిశుభ్రం చేసుకుంటే దీని నుంచి ఉపశమనం లభిస్తుంది. దీని వల్ల జిడ్డుతో పాటు ముఖంపై పేరుకుపోయిన దుమ్ము, ధూళి కణాలు తొలగిపోతాయి.
- అలాగే ఈ సీజన్‌లో ఎక్కువ గాఢత ఉన్న ఫేస్ క్రీములు వాడకపోవడం మంచిది. దీనికి బదులుగా ఫ్రెష్ టోనింగ్ రోజ్ వాటర్ వాడవచ్చు. వర్షాకాలంలో వచ్చే చర్మ సంబంధ సమస్యలకు రోజ్ వాటర్ చెక్ పెడుతుందని పలు అధ్యయనాల్లో కూడా తేలింది.
- శనగ పిండి కూడా జిడ్డును తొలగించడంలో సాయం చేస్తుంది. శనగ పిండితో ప్రతిరోజూ స్నానం చేసినా చర్మం తాజాగా ఉంటుంది.
- వానా కాలంలో చర్మాన్ని రోజంతా మాయిశ్చరైజింగ్‌గా ఉంచడం చాలా అవసరం. చర్మం సహజసిద్ధంగా మాయిశ్చరైజ్ కావాలంటే శరీరంలో తేమ శాతం అధికంగా ఉండాలి. మంచి నీటిని ఎక్కువగా తాగితే చర్మం ఆటోమెటిక్‌గా మాయిశ్చరైజ్ అయి.. గ్లో వస్తుంది. కాబట్టి చర్మం పొడిబారకుండా ఉండేందుకు రోజంతా కొద్దికొద్దిగా నీటిని తాగుతూ ఉండండి.
- దీంతో పాటు మీ చర్మతత్వానికి తగినట్లుగా మాయిశ్చరైజర్‌ను ఎంపిక చేసుకోండి. దీనిని రెగ్యులర్‌గా అప్లై చేయడం వల్ల.. చర్మం పొడిబారకుండా ఉంటుంది.
- వానా కాలంలో ముఖం తాజాగా ఉండాలంటే ప్రతిరోజు కనీసం రెండు సార్లు అయినా శుభ్రం చేసుకోవాలి. సాధారణ సబ్బుతో కాకుండా ఫేష్‌వాష్‌తో శుభ్రం చేసుకుంటే మార్పు త్వరగా తెలుస్తుంది. ఉదయం లేవగానే, రాత్రి పడుకోబోయే ముందు ఫేష్‌వాష్ చేసుకుంటే ముఖం ప్రకాశవంతంగా మారుతుంది. జిడ్డు చర్మం కల వారిలో ఫలితం త్వరగా కనిపిస్తుంది.
- వర్షాకాలంలో చర్మాన్ని రక్షించేందుకు ఫేస్ ప్యాక్స్ బాగా ఉపయోగపడతాయి. అరటి పండ్లు, బొప్పాయి, పుచ్చకాయ వంటి వాటిని మొత్తగా చేసి ముఖానికి అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. తేనె, పసుపు, శనగపిండి కలిపిన ఫేస్ ప్యాక్ కూడా ముఖం తాజాగా ఉండేలా చేస్తుంది.
ఆరోగ్యకరమైన ఆహారం..
చర్మం ఆరోగ్యంగా ఉండటానికి ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. సాధ్యమైనంత వరకు జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండండి. దీనికి బదులుగా తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలను ఆహారంలో చేర్చుకోండి. గ్రీన్ టీ, లెమన్ టీ వంటివి చర్మంలో ఉండే మృత కణాలను తొలగించడంలో సహాయపడతాయి. వీటిని కూడా రెగ్యులర్ డైట్‌లో భాగంగా తీసుకోండి. ఆరోగ్యకర ఆహారంతో పాటు కొన్ని చిట్కాలు పాటిస్తే చర్మ సంబంధిత సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
Also Read: వర్షాకాలంలో ఈ ఫుడ్ తింటున్నారా? తినకూడని లిస్ట్ తెలుసా?