Monsoon Health Tips with Luke Warm Water : వర్షాకాలంలో చాలామంది చేసే అతిపెద్ద మిస్టేక్ ఏంటి అంటే.. నీటిని ఎక్కువగా తీసుకోకపోవడం. వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి నీటిని తక్కువగా తీసుకుంటారు. పైగా చల్లని వాతావరణంలో నీటిని ఎక్కువగా తాగడంవల్ల వాష్‌రూమ్‌కి ఎక్కువగా వెళ్లాల్సి వస్తుంది. అందుకే చాలామంది నీటిని తక్కువగా తాగుతారు. ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని చెప్తున్నారు నిపుణులు. మాన్సూన్లో నీటిని తీసుకోవడమే కాదు.. గోరువెచ్చని నీటిని తీసుకుంటూ హైడ్రేటెడ్‌గా ఉండడం చాలా ముఖ్యమని చెప్తున్నారు. అలా ఎందుకు చెప్తున్నారో.. దానివల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వర్షాకాలంలో వాతావరణం తేమతో నిండి ఉంటుంది. అంతేకాకుండా హ్యూమిడిటీ పెరుగుతుంది. కాబట్టి ఈ సీజన్లో వైరస్లు, బ్యాక్టీరియాల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ సీజన్లో ఎక్కువగా వ్యాధులు ప్రబలుతుంటాయి. ముఖ్యంగా నీటి ద్వారా వ్యాధులు వ్యాపిస్తాయి. అందుకే నీటిని కాస్త వేడి చేసి తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. నీటిని వేడి చేసి వడకట్టి తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని చెప్తున్నారు. మరి వర్షాకాలంలో నీటిని వేడి చేసి తాగడం వల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
గోరువెచ్చని నీరు తాగడం వల్ల కలిగే లాభాలివే..
వర్షాకాలంలో చాలామంది జీర్ణ సమస్యలు ఎదుర్కొంటారు. దీనివల్ల తీసుకునే ఆహారం సరిగ్గా జీర్ణమవ్వదు. ఆ సమయంలో శరీరంలో టాక్సిన్లు పేరుకుంటాయి. అప్పుడు గోరువెచ్చని నీటిని తీసుకోవడం వల్ల శరీరం డీటాక్స్ అవుతుంది. దీనివల్ల శరీరంలోని టాక్సిన్లు మూత్రం రూపంలో బయటకు వస్తాయి. మలబద్ధకం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. పలురకాల జీర్ణ సమస్యలను దూరం చేయడంలో గోరువెచ్చని నీరు హెల్ప్ చేస్తుంది.
రోజూ వేడి చేసిన నీటిని తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. సీజనల్ వ్యాధులు వచ్చే సమస్య తగ్గుతుంది. జలుబు, దగ్గు వంటివి దరిచేరవు. వచ్చినా తగ్గుముఖం పడతాయి. అంతేకాకుండా ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో, శరీరాన్ని తేమగా ఉంచడంలో కూడా హెల్ప్ చేస్తుంది. చల్లని వాతావరణలో గోరువెచ్చని నీటిని తాగడం వల్ల మంచి ఉపశమనం ఉంటుంది. శరీరంలోని టాక్సిన్లు బయటకు పోవడం వల్ల చర్మంపై మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. స్కిన్ మెరుస్తూ, హెల్తీగా ఉంటుంది.
నీటిని ఎప్పుడు తాగితే మంచిదంటే..
ఉదయం నిద్రలేచిన వెంటనే ఖాళీ కడుపుతో ఓ గ్లాసు నీటిని సిప్ చేస్తూ తాగాలి. అలాగే ప్రతి భోజనానికి అరగంట ముందు తాగితే మంచిది. రాత్రి నిద్రకు ఓ గంట ముందు తాగితే మంచిది. ఇలా నీటిని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది. ఉదయాన్నే ఫ్రీ మోషన్ కూడా అవుతుంది. మంచి నిద్ర మీ సొంతమవుతుంది. కాబట్టి వర్షాకాలంలో నీటిని తీసుకోవడం అస్సలు స్కిప్ చేయవద్దు. గోరువెచ్చని తీసుకోవడం అస్సలు మానొద్దు.