Cancer: ప్రస్తుత కాలంలో క్యాన్సర్ అనేది వయసుతో సంబంధం లేకుండా చాలా మందిలో కనిపిస్తున్న వ్యాధిగా పరిణమిస్తుంది. ముఖ్యంగా క్యాన్సర్ వ్యాధి అసలు ఎందుకు వస్తుంది దీనికి గల కారణాలపై ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో శాస్త్రవేత్తలు వైద్య నిపుణులు పలు పరిశోధనలు చేస్తున్నారు. ఈ పరిశోధనల్లో పలు ఆసక్తికరమైనటువంటి విషయాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా క్యాన్సర్‌కు కారకాలు అయినటువంటి పలు అంశాలపై వైద్య నిపుణులు జరుపుతున్న పరిశోధనల్లో పలు కీలక అంశాలు బయటకు వస్తున్నాయి. తాజాగా అమెరికా పరిశోధకులు జరిపిన అధ్యయనంలో స్పెర్మ్ కౌంట్, వీర్య ఉత్పత్తి సమస్యలతో బాధపడుతున్న వ్యక్తుల్లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కనుగొన్నారు.


ముఖ్యంగా ఎవరికైతే శుక్రకణాల ఉత్పత్తి సమస్యలు (అజూస్పెర్మిక్) ఎదుర్కొంటున్న పురుషులకు ఎముక, కీళ్ల క్యాన్సర్‌లు వచ్చే ప్రమాదం 156 శాతం పెరిగిందని తెలిపారు. అంతేకాదు వీరిలో ఎముకలు, మృదు కణజాలం, థైరాయిడ్ క్యాన్సర్‌లు సైతం వచ్చే అవాకాశం 60 శాతం పెరిగినట్లు కనుగొన్నారు. ఈ అధ్యయనం కోసం, పరిశోధకులు 1996, 2017 సంవత్సరాల మధ్య అమెరికాలో పలు సంతానోత్పత్తి క్లినిక్‌లకు హాజరైన 786 మంది పురుషుల వీర్య కణాల నమూనాలను విశ్లేషించగా ఈ విషయాలు తెలిశాయి. వీర్య కణాల ఉత్పత్తి తక్కువగా ఉన్న వ్యక్తులు.. భవిష్యత్తులో క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన జబ్బులకు గురయ్యే ప్రమాదం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.


అయితే అలాగని ఎవరికైతే సంతాన సమస్యలు ఉన్నాయో వారందరికీ క్యాన్సర్ వస్తుందని  తాము పూర్తిస్థాయిలో నిర్ధారణ చేయడం లేదని, ఇది కేవలం ఒక అంచనా మాత్రమే అని, మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. అంతేకాదు క్యాన్సర్ సోకిన వారిలో వారి జీవన శైలిలో మార్పులు కూడా  ఒక ప్రధాన కారణం అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఉదాహరణకు అధికంగా ధూమపానం చేయడం మద్యపానం చేయడం, డ్రగ్స్ తీసుకోవడం వంటివి క్యాన్సర్ వచ్చేందుకు కారకాలు అవుతాయని  ఈ సందర్భంగా వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 


ఇదిలా ఉంటే క్యాన్సర్ వ్యాధి అత్యధికంగా సోకిన వారిలో ఎక్కువగా పొగాకు సంబంధిత ఉత్పత్తులను తీసుకున్న వారిలోనే ఈ కేసుల తీవ్రత అత్యధికంగా ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.  దీంతోపాటు మారుతున్న జీవనశైలి,  మనం తినే ఆహారంలో మార్పులు, ఎక్కువగా రసాయనాలు ఉన్నటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం కూడా క్యాన్సర్ వ్యాధి వచ్చేందుకు కారకంగా చెబుతున్నారు.  పైన పేర్కొన్నటువంటి లైంగిక సమస్యలు ఉన్న వారిలో అందరిలో క్యాన్సర్ వస్తుందని  పూర్తిస్థాయిలో నిర్ధారణ చేయడం లేదని, తాము చేసే పరిశోధనల్లో భాగంగానే ఒక్కో కారణం గురించి విశ్లేషిస్తామని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఆరోగ్యకరమైనటువంటి జీవనశైలి, దురలవాట్లకు దూరంగా ఉండటం, ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా క్యాన్సర్ వ్యాధి బారిన పడకుండా తమని తాము కాపాడుకోవచ్చని వైద్య నిపుణులు ఈ సందర్భంగా తెలిపారు.


Also Read : బరువు తగ్గేందుకు రోజూ రోజ్​ టీ తాగాలట.. తయారీ రెసిపీ ఇదే



గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.